కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల

కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల

Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014

కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల కన్వీనర్లతో జరిగిన విస్తృత సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఉన్నప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టమంటే మాట్లాడలేదని, ఇప్పుడు తమమీద నిందవేస్తున్నారని మండిపడ్డారు. ''ఆఖరి నిమిషం వరకు ఇదిగో కొడతా, అదిగో కొడతా అన్నారు. పార్లమెంటులో ప్రతాపం చూపించలేదు, అసెంబ్లీలోనూ చూపించలేదు. సుప్రీంకోర్టులో ఆయనొక్కరే కాదు, అందరూ కేసులు వేశారు. అన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది తప్ప అందులో ఆయన గొప్పతనం కూడా ఏమీ లేదు'' అని చెప్పారు.

నాలుగేళ్లుగా పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలందరూ ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అవకాశం వస్తోందని, అందువల్ల పార్టీ శ్రేణులన్నీ పూర్తిస్థాయిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చినట్లు కొణతాల తెలిపారు. ఆయనేమన్నారంటే.. ''స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇబ్బందికరమే. రిజర్వేషన్లపరంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. అయినా కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి కాబట్టి మేం పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధమయ్యాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో జిల్లా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటుచేశాం. అన్ని స్థానాలకూ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఈ అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కామన్ సింబల్ గా కేటాయించారు. కాబట్టి ఆగుర్తుతోనే అందరూ పోటీ చేస్తారు. పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటుచేస్తారు. వాటిని రేపు జిల్లాలకు పంపుతాం. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పర్యవేక్షణ ఉంటుంది. రేపు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకుని, అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నాం. ఎన్నికల ప్రచారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగన్, విజయమ్మ, షర్మిల పర్యటిస్తారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు తిరుగుతారో చెబుతాం. రాష్ట్రస్థాయిలో పరిశీలకులు ఉంటారు. వాళ్లు కూడా ఎక్కడికక్కడ ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారు. పార్టీ నిర్మాణం రాష్ట్రంలో బలంగా ఉంది. ఆ విషయం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతోనే తేలిపోతుంది'' అని కొణతాల చెప్పారు.
Share this article :

0 comments: