ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే.

ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే.

Written By news on Saturday, March 29, 2014 | 3/29/2014

కుతంత్రమా.. విశ్వసనీయతా?: వైఎస్ జగన్

ఈ ఎన్నికలు జరుగుతున్నది వీటి మధ్యే..: వైఎస్ జగన్ విజయనగరం, న్యూస్‌లైన్: ‘‘రాష్ట్రంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతూ అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఓ సువర్ణయుగాన్ని అందించారు. దేశానికే ఆదర్శనీయంగా నిలిచారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పారు. ఇచ్చిన మాట తప్పకుండా పాలించి విశ్వసనీయతకు అర్థం చెప్పారు. ఆ దివంగత రాజశేఖరరెడ్డి నాకు వారసత్వంగా ఇచ్చింది ఏదైనా ఉందీ అంటే అది విశ్వసనీయతే అని చెబుతున్నా. ఈ విశ్వసనీయత అన్న పదానికి అర్థం చంద్రబాబుకు ఈ జన్మకు తెలియనే తెలియదు. ఏ గడ్డి కరిచైనా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అందుకే నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను పట్టపగలే మోసం చేయాలని చూస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 45 రోజుల్లోపే వస్తున్న ఎన్నికల్లో ఓవైపు నిజాయితీ, విశ్వసనీయత ఉంటే... మరోవైపు అధర్మం, కుళ్లు, కుతంత్రాలు ఉండి పోటీపడు తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బేబీనాయనను, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థిగా పెనుమత్స సురేశ్‌బాబును ప్రకటించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

 అందుకే బాబు అలా హామీలిస్తున్నారు..
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు. ఆ తర్వాత ఆయన పార్టీ ఉంటుందో లేదో చెప్పలేం. అందుకే ఇప్పుడు ఏదో విధంగా అధికారంలోకి రావాలని ఆయన నోటికొచ్చినట్టు హామీలిస్తున్నారు. చంద్రబాబు మాదిరి నాకు అబద్ధాలాడడం చేతకాదు. చంద్రబాబు మాదిరి నేను దొంగ హామీలు ఇవ్వలేను. ఆయన మాదిరి విశ్వసనీయతకు పాతరేయడం నాకు చేతకాదు. ఎందుకంటే చంద్రబాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ణి, నేను ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిని. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పదవి లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ప్రజలకు వెన్నుపోటు పొడవరని గ్యారంటీ లేదు. తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోని చంద్రబాబు.. ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఆల్ ఫ్రీ అంటూ హామీలిస్తున్నారు. అధికారంలోక రావడమే ధ్యేయంగా కళ్లార్పకండా అబద్ధాలు ఆడుతున్నారు.

ఇదే చంద్రబాబు మొన్నటికి మొన్న రైతులకు రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానని హామీలు ఇచ్చేశారు. చాలా మంది నా దగ్గరకువచ్చి చంద్రబాబులాగా మీరూ రైతుల రుణాలు మాఫీ చేస్తానని, హామీ ఇవ్వాలని అడిగారు. రోజంతా బడ్జెట్‌పై అధ్యయనం చేశాను. రాష్ర్టంలో రైతు రుణాలు రూ. లక్షా 27వేల కోట్లున్నాయి. అలాగే డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలున్నాయి. మన రాష్ర్ట బడ్జెట్ చూస్తే రూ. లక్షా 25 వేల కోట్లయితే చంద్రబాబేమో రూ.లక్షా 47 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటూ ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారు. అంతేకాదు,  మళ్లీ ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని కొత్త హామీ ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో చంద్రబాబుకు తెలుసా? ఈ రాష్ర్టంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉన్నాయి.. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బాబు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారు.

 ఐదు సంతకాలు.. మూడు పనులు..
 ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో రాజకీయం, పాలన రెండూ భ్రష్టుపట్టిపోయాయి. అలాంటి ఈ వ్యవస్థలో మళ్లీ నేను మార్పు తెస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపై ప్రజల తలరాతలు మార్చేసేలా ఐదు సంతకాలు చేస్తా. వీటితో పాటు మరో మూడు ముఖ్యమైన పనులు చేస్తా. మొదటి  సంతకం ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. అవ్వా తాతల పింఛన్  రూ.700కు పెంచుతూ రెండో సంతకం, రైతన్నల కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, ప్రతి గ్రామంలోనూ ఒక ఆఫీస్ తెరిచి.. ఆరోగ్య శ్రీ, పింఛను, రేషన్ ఇలా ఏ కార్డు కావాలన్నా అక్కడే ఇచ్చేలా ఐదో సంతకం చేస్తాను.

 వీటితోపాటు ఏటా 10 లక్షల ఇళ్లచొప్పున 2019 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లు కట్టించడాన్ని ఆరో పనిగా చేస్తా. ఏడో పనిగా.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకుని వస్తా. ఎనిమిదో పని అక్కా చెల్లెమ్మల కోసమే చేస్తా. గ్రామాల్లో బెల్టుషాపులనేవే లేకుండా చేస్తా.. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలను ఆడపోలీసులుగా చేసి వారితోనే బెల్టు తీయిస్తా. నియోజకవర్గానికి ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేలా చేస్తా. మన తలరాతలు మార్చనున్న ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులందరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.’’

 40 డిగ్రీల ఎండనూ లెక్క చేయకుండా..
 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సాయంత్రం 4.30 గంటల వరకు సాగిన రోడ్ షోకు హోరెత్తిన జన సందోహంలో జైజగన్ నినాదాలు ప్రతిధ్వనించాయి. శుక్రవారం సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా కూడా లెక్క చేయకుండా జగన్ జనంతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుని సమస్యలపై స్పందించారు. మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, ఇక సమస్యలుండవని భరోసా ఇచ్చారు.

 ఎండను లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన జనం ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వీధి వీధిలోనూ జనం ముఖ్యంగా మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టారు. నెల్లిమర్లలో రామతీర్థం కూడలి, మెయిద కూడలిలలో జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం జరిగిన నెల్లిమర్ల బహిరంగ సభకు జనం పోటెత్తడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కాగా, జగన్ వెంట పర్యటనలో పార్టీ  జిల్లా అధ్యక్షుడు పి.సాంబశివరాజు, నేతలు రఘుబాబు, శ్రీరాములు నాయుడు, సీహెచ్. వెంకటరమణ తదితరులున్నారు.

 వైఎస్సార్ సీపీలోకి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి
 నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్:  విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు పార్వతీపురం ఏఎంసీ చైర్మన్ భీమవరపు కృష్ణమూర్తి, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, డీసీసీబీ డెరైక్టర్ బొంగు చిట్టిరాజు, పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీ సీ సభ్యులు పార్టీలో చేరారు.
Share this article :

0 comments: