అభిమానం కురిసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమానం కురిసింది

అభిమానం కురిసింది

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

అభిమానం కురిసింది
 సాక్షి, ఏలూరు : చేలల్లో పనిచేసే కూలీలు పరుగుపరుగున రోడ్లపైకి వచ్చి తమ అవస్థలు చెప్పుకున్నారు. ఉద్యోగులు తమ సమస్యల చిట్టా విప్పారు. మహిళలు కష్టాలు ఎకరువు పెట్టారు. వృద్ధులు ఆశీర్వదించారు. వికలాంగులు ఆసరా కోరారు. ప్రతి ఒక్కరిలోనూ జగన్ మా కష్టాలెరిగిన నేత, వాటిని తీర్చగల సమర్థుడు. ఆయనకు చెబితే సమస్యలు తీరిపోయినట్టే అన్న ఒకే భావన. సోమవారం జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోజు ఏలూరులో రోడ్‌షో చేసి ఎన్నికల జనభేరి మోగించారు. రెండో రోజు మంగళవారం గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలో పర్యటించారు. మూడో రోజు బుధవారం చింతలపూడి నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఆయనపై అమితమైన అభిమానం కురిపించారు. బుధవారం జననేతను చూసేందుకు, ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకునేందుకు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. అందరినీ జగన్ పలకరించారు.
 
 బుధవారం ఉదయం చింతలపూడిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. అనంతరం రోడ్‌షో ప్రారంభమైంది. కొద్ది దూరం వెళ్లగానే అప్పటికే ఎదురు చూస్తున్న వికలాంగ యువతి మంగవేణిని జగన్ పలకరించారు. డిగ్రీ చదివిన తాను  కష్టాలు పడుతున్నానని, ఉద్యోగం ఇప్పించమని కోరింది. మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చి ఆ యువతి వివరాలు తీసుకున్నారు. పాత చింతలపూడి, సమ్మిటవారిగూడెం మీదుగా ముందుకు సాగారు. ఆముదాల చలకలో అంబేద్కర్ విగ్రహానికి. మల్లయ్యగూడెంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పోతునూరు చేరుకున్న ఆయనను కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది కలిశారు. పన్నెండేళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న తమను మీ ప్రభుత్వం రాగానే  రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
 
 తప్పకుండా చేస్తానని, మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తానని చెప్పి జగన్ ముందుకు సాగారు. రాఘవాపురం చేరుకునేసరికి  010 హెడ్ కింద ట్రజరీల ద్వారా జీతాలు ఇవ్వాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరారు. తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. మీ తండ్రి ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ వల్లే జిల్లాలో మా వాళ్లు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి పెద్ద చదువులు చదువుతున్నారని, చాలామందికి ఉద్యోగాలొచ్చాయని ఉమర్‌బీబీ అనే మస్లిం మహిళ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ స్వర్ణయుగం వళ్లీ వస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి లింగగూడెం చేరుకున్నారు. జిల్లాలో సుమారు 2వేల 500 మంది గ్రామీణ వైద్యులకు వైఎస్ హయాంలో శిక్షణ ఇప్పించారని, ఆయన మరణం తరువాత వచ్చిన పాలకులు గుర్తింపుకార్డులు ఇవ్వలేదని పీఎంపీ అసోసియేషన్ మండల ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పీఎంపీలు తమ ఆవేదను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.  లింగగూడెం నుంచి గురుభట్లగూడెం సెంటర్ మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు.
 
 ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోటచంద్రశేఖర్, వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఆళ్లనాని, జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, జిల్లా కమిటీ సభ్యులు వి.వినోద్‌రెడ్డి, జగ్గవరపు జానకీరెడ్డి, టిడబ్ల్యూ జయరాజు, చేకూరి ఖాదర్‌బాబు, పార్టీ నాయకులు బీవీఎస్ రెడ్డి, చిన్నం గాంధీ, రాష్ట్ర యువజన విభాగం కమిటీ సభ్యుడు బీవీఎస్ చౌదరి, వైసీపీ జిల్లా బీసీ సెల్ కన్వీనర్ పాశెం రామకృష్ణ, చింతలపూడి మండల కన్వీనర్ టి.వెంకటరామిరెడ్డి, పట్టణ కన్వీనర్ గంధం చంటి పలువురు నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు రోడ్‌షోలో పాల్గొన్నారు. జిల్లా సరిహద్దు వరకూ వెంట ఉండి వీడ్కోలు పలికారు. సరిహద్దు వద్ద భారీగా తరలివచ్చిన ఖమ్మం జిల్లా వైసీపీ శ్రేణులు జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికాయి.
Share this article :

0 comments: