శ్వాస ఉన్నంత వరకు జగన్ వెంటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్వాస ఉన్నంత వరకు జగన్ వెంటే

శ్వాస ఉన్నంత వరకు జగన్ వెంటే

Written By news on Sunday, March 23, 2014 | 3/23/2014

శ్వాస ఉన్నంత వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని, ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తానని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు శనివారం ఆయన పొదలకూరులోని పార్టీ కార్యాలయంలో బీఫారాలు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో తనకు సముచిత స్థానం లభిస్తోందన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తనను సర్వేపల్లిలో ఎదుర్కోలేక పార్టీ మారుతున్నట్లు వదంతులు సృష్టిస్తున్నాయన్నారు.
 
 కోటీశ్వరులను కాదని జగన్‌మోహన్‌రెడ్డి తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. పార్టీలో చేరిన వెంటనే జిల్లా కన్వీనర్‌గా నియమించారని చెప్పారు. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తే, వెంటనే సీఈసీలో చోటు కల్పించారని వివరించారు. విశ్వసనీయత కలిగిన జగన్ నాయకత్వంలో పనిచేయడం తనకు గర్వంగా ఉందన్నారు. వైఎస్సార్‌పై అభిమానంతో 2009లో ఆత్మకూరు టికెట్ తనకు దక్కకున్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని చెప్పారు. మహానేత మరణం తర్వాత ఆయన కుటుంబంపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.
 
 తన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవరూ తాను పార్టీ మారుతున్నానంటే నమ్మరన్నారు. దగుల్బాజీ రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. తండ్రి కాకాణి రమణారెడ్డి హయాం నుంచి రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీయే ఊపిరిగా ముందుకు సాగుతున్నామన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను నిద్రలేచింది మొదలు మళ్లీ పడుకునే వరకు ఎండగట్టే తాను టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రచారం జరగడంలో అర్థం లేదన్నారు. ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కొందరు నేతలు పనిగట్టుకుని ఈ దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు.
 
 ఇలాంటి వదంతులను తాను పట్టించుకోనని, కార్యకర్తలు అయోమయానికి గురవుతారనే భావనతో స్పందిస్తున్నానని అన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సర్వేపల్లి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ఓటమి భయంతో టీడీపీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. చంద్రబాబు చీకటి పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోనం బ్రహ్మయ్య, గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ ఉన్నారు.
 
Share this article :

0 comments: