ఒక్కటంటే ఒక్కటి కూడా మీ తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఒక్కటంటే ఒక్కటి కూడా మీ తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదు?

ఒక్కటంటే ఒక్కటి కూడా మీ తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదు?

Written By news on Monday, March 31, 2014 | 3/31/2014

తొమ్మిదేళ్లూ ఏం చేశావ్?
ఓట్ల కోసం వచ్చినప్పుడు చంద్రబాబును నిలదీయండి
 గజపతినగరం ‘వైఎస్సార్ జనభేరి’లో ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
 
 సాక్షి, విజయనగరం: మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తా.. అన్నీ ఉచితంగా ఇస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు మీ వద్దకొస్తాడు. ఆయన్ను ఒక్కటే మాట అడగండి. ‘చంద్రబాబూ.. ఇపుడు చెప్తోన్న హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదు?’ అని నిలదీయండి’’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తన తొమ్మిదేళ్ల చంద్రన్న రాజ్యం మళ్లీ తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఎందుకంటే చంద్రన్న రాజ్యం పేరెత్తితే చాలు.. జనాలే తరిమి తరిమి కొడ్తారంటూ ఆ తొమ్మిదేళ్ల భయానక పాలనను గుర్తు చేశారు. ‘‘చంద్రబాబు వయసు 65 ఏళ్లు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు.. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ఉంటుందో.. లేదో కూడా తెలియదు. అందుకే ఆయన ఎలాగైనా అధికారంలోకి రావడానికి ఏవేవో హామీలు గుప్పిస్తున్నారు.
 
 ఆయనకన్నా నేను 25 ఏళ్లు చిన్నవాడిని. మరో 30 ఏళ్లు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాల్సిన వాడిని. అందుకే అబద్ధాలు చెప్పలేను’’ అని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున.. అదే వేదికపై చేసే ఐదు సంతకాలతో రాష్ట్ర దశ, దిశ మారుస్తానని, మరో ఐదు కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావును ప్రకటించారు. సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగ సారాంశమిదీ..
 
 అది భయానక పాలన
 
 ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలిస్తున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలన నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజుల్లో అవ్వా తాతలకు ముష్టివేసినట్లు రూ.75 పింఛన్‌గా ఇచ్చేవారు. కొత్తవారికి పింఛన్ ఇవ్వాలంటే.. అప్పటికే ఆ ఊళ్లో పింఛన్ తీసుకుంటున్నవారెవరైనా చనిపోతే తప్ప ఇవ్వలేమనేవారు. పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే.. తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకోక తప్పని రోజులవి. రోగమొచ్చి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాల్సి వస్తే.. పేదలు అప్పులు చేయాల్సి వచ్చేది.. చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక జీవితాంతం ఊడిగం చేయాల్సి వచ్చేది. ఒక గ్రామంలో వంద మందికి ఇళ్లు లేకున్నా.. ఐదుగురికి మించి ఇచ్చే వారు కాదు. అలాంటి భయానక పాలన అందించిన చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలిస్తున్నారు. ఆనాడు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీతో గెలిచి.. ఎన్నికల తర్వాత.. మద్యపాన నిషేధంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందంటూ ‘ఈనాడు’ పత్రికలో రాయించింది చంద్రబాబే. అలా రాయించి మూడు రోజుల్లోనే ఊరూరా.. బెల్ట్‌షాపులు పెట్టించారు. కిలో బియ్యం రూ.2కే అని చెప్పి గద్దెనెక్కాక రూ.5.25 చేసిన వ్యక్తీ ఈ చంద్రబాబే.
 
 5 సంతకాలు.. 5 పనులు..
 
 నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చిన విశ్వసనీయతతో చెబుతున్నా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున.. అదే వేదికపై రాష్ట్ర దశ, దిశ మార్చే ఐదు సంతకాలు చేయబోతున్నా. మరో ఐదు పనులతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తా.
 
 అక్కాచెల్లెళ్లు నాలుగైదురోజులు ఇల్లు గడవడానికి వేరే దారిలేక.. 6, 7 తరగతులు చదువుతోన్న పిల్లల్ని కూడా పన్లోకి తీసుకెళ్లున్న పరిస్థితుల్ని చూశా. ఇకపై మీరు పిల్లల్ని పనికి కాకుండా.. బడికి పంపించండి. పిల్లల్ని బడికి పంపించే అక్కాచెల్లెళ్లకు ఒక్కో బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరికి రూ.వెయ్యి వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి నెలా పడేలా ‘అమ్మ ఒడి’ పథకంపై తొలి సంతకం చేస్తా. అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెడతా. మీ పిల్లల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తానని మాటిస్తున్నా.
 
 వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా.. కడుపు నింపుకోవడానికి పనులకు పోతున్న అవ్వా, తాతలను చూశా. ఆ అవ్వా, తాతల మనవడిలా చెబుతున్నా.. మీకు మూడు పూటలా భోజనం పెట్టేలా పింఛన్‌ను రూ.700 చేసేందుకు రెండో సంతకం చేస్తా.
 
 వేసిన పంటకు గిట్టుబాటు ధర రాక, నష్టపోతున్న రైతులకు మద్దతు ధర అందించేలా రూ.3000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చే స్తా.
 
 డ్వాక్రా అక్కా చెల్లెళ్లు నెలనెలా రూ.2 వేలు వాయిదా కట్టలేక, వడ్డీ మీద వడ్డీ పడుతుందన్న భయంతో పిల్లల్ని కూడా పన్లోకి తీసుకెళ్తున్నారు. వారికి మరో కొత్త జీవితం అందించేలా రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తా.
 
 ఏ గ్రామం, ఏ వార్డులోనూ ప్రజలు పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా అదే గ్రామం, అదే వార్డులోనే 24 గంటల్లో ఏ కార్డైనా అందించే వ్యవస్థ ఏర్పాటుకు ఐదో సంతకం చేస్తాం.
 
  వైఎస్సార్ హయాంలో.. దేశం మొత్తంలో 47లక్షల ఇళ్లు కట్టిస్తే.. మన రాష్ట్రంలో వైఎస్ 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆ మహానేత గర్వపడేలా ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టించి, 2019 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చేస్తా.
 
 వైఎస్సార్ కలల పథకం ఆరోగ్యశ్రీని ఆయన గర్వపడేలా చేస్తా. జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు, పదేళ్లలో హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరం నిర్మించి, అందులో 20 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులతో ఓ యూనివర్సిటీ తరహాలో అనుసంధానించి, వైద్యులంతా అందుబాటులో ఉండేలా చేస్తా.
 
 2019 నాటికి కరెంటు కోతల్లేని రాష్ట్రంతోపాటు, రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ పూర్తిగా పగటిపూటే అందిస్తా.
 
 గ్రామాల్లో బెల్ట్ షాపుల్లేకుండా చూసి, ప్రతి గ్రామంలో పది మంది అక్కా చెల్లెళ్లను ఆడ పోలీసులుగా నియమిస్తా. ఆరోగ్యవంతులైన బిడ్డలతో ఉజ్వల భవిష్యత్తునందిస్తా.
 
 చదువుకుంటున్న, చదువు పూర్తిచేసుకున్నవారికి భరోసా ఇస్తా. నాలుగున్నరేళ్లుగా.. ఇల్లు వదిలి రాత్రనక.. పగలనక.. ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసు. ఆ ఆవేదనతోనే చెప్తున్నా.. చంద్రబాబుకంటే.. గొప్ప పాలన అందిస్తా. రాజన్న రాజ్యం తీసుకొస్తానని హామీ ఇస్తున్నా.
Share this article :

0 comments: