చరిత్రను మార్చే సంతకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చరిత్రను మార్చే సంతకాలు

చరిత్రను మార్చే సంతకాలు

Written By news on Tuesday, March 4, 2014 | 3/04/2014

ఏలూరు ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్‌మోహన్‌రెడ్డి హామీ
* వచ్చే ఎన్నికల్లో ప్రజలమంతా ఒక్కటవుతాం.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుంటాం
* మా వల్లే కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించేలా చేస్తాం
* అప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ కంటే అగ్రగామిగా చేస్తాం
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాను ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే, ప్రజల జీవితాలను మలుపు తిప్పే నాలుగు కీలక పథకాలపై సంతకాలు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘‘మొట్టమొదటి సంతకాన్ని అక్కాచెల్లెళ్ల కళ్లలో ఆనందాన్ని చూడ్డానికి ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించే తల్లికి అండగా నిలుస్తాం. విద్యార్థికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి ఆ అమ్మ ఖాతాలో వేస్తాం. ఇక రెండో సంతకం.. ప్రతి అవ్వ కోసం, తాత కోసం వారి మనవడిగా చేస్తా. ఇవాళ ఇస్తున్న పెన్షన్‌ను రూ.700కుపెంచుతా. మూడో సంతకం రైతన్న కోసం పెడతా. రైతన్న పంటలు పండిస్తున్నాడు.
 
 అన్యాయమైన రేటుకు ధాన్యాన్ని అమ్ముతున్నాడు. ఆ ధాన్యం రేటు దళారుల వద్దకు వెళ్లిన తర్వాత రెండింతలు పెరుగుతోంది. ఇకపై రైతన్నలకు గిట్టుబాటు కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ సంతకం చేస్తా. నాలుగో సంతకం డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి పెడతా. ఈ నాలుగు సంతకాలు చరిత్రను మారుస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాన్ని సింగపూర్‌కన్నా అగ్రగామిగా చేస్తా. విశ్వసనీయతకు అర్థం తీసుకువచ్చే పరిపాలనను చేస్తా’’ అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‘వైఎస్సార్ జనభేరి’ సభ నిర్వహించారు. ఈ సభకు తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
 ఈ నేతలు.. వైఎస్‌ను చూసి నేర్చుకోవాలి
 ‘‘రాజకీయం అన్నప్పుడు 2 పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ఒకటి విశ్వసనీయత,  రెండోది విలువలు, వ్యక్తిత్వం. ఇవాళ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో టార్చ్‌లైట్ వేసి చూసినా, భూతద్దం పెట్టి వెతికి చూసినా రాజకీయ నాయకుల్లో విలువలు కరువైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఓ వ్యక్తి చనిపోయి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. అయినా ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి ఎక్కడ ఉన్నాడని ఎవరినైనా అడిగితే గుండెలు చూపించి మా గుండె లోతుల్లో ఉన్నాడని చెబుతారు. అటువంటి వారిని విశ్వసనీయమైన వ్యక్తి అని, రాజకీయాల్లో విలువలు ఉన్న వ్యక్తి అని అంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామని కాదు, ఎలా బతికామనేది ముఖ్యమని వైఎస్ ఎప్పుడూ చెప్పేవారు. ఆ చనిపోయిన నేత నుంచి ఈ నాయకులు గుణ పాఠాలు నేర్చుకోవాలి.
 
 అది బాబు భయానక పాలన
 రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు రాష్ట్రంలో బాబు భయానక పాలన సాగుతుండేది. ఆ సమయంలో నేను గ్రామాలకు వెళ్లినప్పుడు దయనీయమైన పరిస్థితులు కనిపించేవి. అవ్వాతాతలకు ముష్టి వేసినట్టు రూ.70 పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా గ్రామానికి 15 మందికో, 20 మందికో  ఇచ్చేవారు. వేరే ఎవరికైనా పెన్షన్ కావాలని అడిగితే.. ఆ గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్న ఎవరో ఒకరు చనిపోతేగాని ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్పేవారు.
 
 అప్పట్లో పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుగారు ఆ పిల్లల దగ్గరకెళ్లి ఎలా చదువుతున్నారని అడిగిన పాపానపోలేదు. అంతేకాదు.. గ్రామాల్లో ఎవరికైనా జబ్బు చేసి వైద్యానికి ఏ లక్షో, రెండు లక్షలో కావాల్సి వస్తే.. పాపం అక్కాచెల్లెళ్లు ఎంత వడ్డీ అయినాసరే డబ్బు తీసుకురావటానికి పరిగెత్తేవారు. రూ.2 లక్షలతో ఆ పెద్దాయన ప్రాణాలు నిలబెట్టుకున్నా అప్పు తీర్చడం కోసం జీవితాంతం ఊడిగం చేసే దుస్థితి. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.
 
 రెండ్రూపాయలని చెప్పి.. ఐదుంపావలా చేశారు..
 చంద్రబాబు డ్వాక్రా మహిళలను ఓట్ల కోసం, సీట్ల కోసం ఉపయోగించుకునేవారు. ఎన్నికల వేళ చంద్రబాబు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని అబద్ధాలు చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రెండు రూపాయల బియ్యాన్ని ఐదు రూపాయల పావలా చేయడం నాకింకా గుర్తుంది. చంద్రబాబు భయానక పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ‘ఉచితంగా కరెంటు’ ఇచ్చి ఆదుకోవాలని ఉద్యమాలు జరిగాయి. అప్పుడు చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని చెప్పేవారు.
 
 బాబు సింగపూర్ అంటే.. శ్మశానానికే
 రాజశేఖరరెడ్డి చనిపోయాక ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ ప్రాంతంలోని ప్రజలను అమ్మేయటానికి సిద్ధపడిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఒక పక్క విభజన బిల్లు చాలా అన్యాయంగా ఉందని ఆయనే అంటారు..  ఇదే చంద్రబాబు పార్లమెంటులో తన ఎంపీలతో బిల్లుకు అనుకూలంగా ఓటేయిస్తారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తానని చెబుతున్నారు. ఆయ్యా చంద్రబాబూ.. నువ్వు కత్తి తీసుకుని ఒక మనిషిని పొడిచేశావ్. ఆ తర్వాత ఆ వ్యక్తిని మళ్లీ శ్మశానానికి నేనే తీసుకెళతానని చెబుతున్నావ్’’.
 
 సింగపూర్‌కంటే అగ్రగామిగా చేస్తాం
 కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలోని చంద్రబాబు పార్టీ కలిసిపోయాయి. కలిసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాయి. వీరందరూ చేస్తున్న అన్యాయాన్ని పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎన్నికలు వస్తున్నాయి.. ఆ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. చంద్రబాబూ ఒక్కటి చెబుతున్నా ప్రజలమంతా కలిసి ఒక్కటవుతాం.. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుంటాం. గెలుచుకున్న తర్వాత మా వల్లే కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించేలా చేస్తాం. రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చుకుంటాం. అప్పుడు సింగపూర్ కాదుకదా షాంఘై, దుబాయ్, వాషింగ్టన్‌ల స్థాయిలో అభివృద్ధి చేస్తాం. చంద్రబాబూ నువ్వు పాతతరం మనిషివి. నేను నీకన్నా 25 ఏళ్ల చిన్నవాడిని. మేమంతా యువకులం. నీకన్నా మెరుగ్గా మా రాష్ట్రాన్ని పాలించుకుంటాం. యువతరాన్ని ఎదిరిస్తే, మోసాలు చేస్తే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం.’
 
 జనభేరికి నీరాజనం
 జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగి ఏలూరు బయలుదేరారు. మధ్యలో హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగి, అక్కడి నుంచి రోడ్‌షోగా ఏలూరు బయలుదేరారు. దారిపొడవునా జనం నీరాజనాలు పలికారు. కలపర్రు, వట్లూరు ప్రాంతాల్లో తండోపతండాలుగా జనం తరలివచ్చారు. వట్లూరు గేటు, సత్రంపాడు మీదుగా సాయంత్రం 5.15కి అల్లూరి సీతారామరాజు స్టేడియానికి చేరుకున్నారు. అప్పటికే స్టేడియం మొత్తం నిండిపోయింది. బయట రోడ్లపైనా జనం భారీ ఎత్తున నిలుచుని ఉన్నారు.
 
  ఏలూరులో ఎక్కడ చూసినా జనమే. రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. జనభేరి సభలో మాజీ మంత్రి మరడాని రంగారావుకు పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. సభలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, సమన్వయకర్తలు దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్ అప్పారావు, అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసు తదితరులు పాల్గొన్నారు.
 
 నేడు నిడదవోలులో జనభేరి
 జగన్ మంగళవారం వైఎస్సార్ జనభేరి సభను పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించనున్నారు
Share this article :

0 comments: