నల్లగొండ జగన్ పర్యటన వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నల్లగొండ జగన్ పర్యటన వాయిదా

నల్లగొండ జగన్ పర్యటన వాయిదా

Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014

‘ఎన్నికల వ్యూహరచన కోసం ముఖ్యనేతలతో సమావేశం కావాల్సిన అత్యవసర పరిస్థితి వల్ల వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన రాక కోసం మా పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం...’  అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఆదివారం  హుజూర్‌నగర్ నియోజవర్గం నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటనను మొదలు పెట్టాల్సి ఉంది. దీనికోసం పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూలు విడుదల అయ్యింది.
 
 సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు కూడా విడుదలైంది. ఇంకోవైపు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడం, రెండు రోజుల్లో షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండడంతో ఒకేసారి మూడు ఎన్నికలు జరగనున్నాయి. అతి కీలకమైన ఈ ఎన్నికలలో విజయాలతో అగ్రభాగాన నిలిచేందుకు పార్టీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహరచనలో భాగంగానే ముఖ్యనేతలతో సమావేశమయ్యేందుకు వైఎస్ జగన్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడం వల్లే ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారని పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే త్వరలోనే ఆయన జిల్లా పర్యటనకు వస్తారని పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. ఆదివారం నుంచే జగన్ పర్యటన ఉండడంతో శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మిర్యాలగూడలో భేటీ ఆయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, సీఈసీ సభ్యులు బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, కోఆర్డినేటర్లు ఎర్నేని వెంకటరత్నం బాబు, మల్లు రవీందర్‌రెడ్డి, అనుంబంధ సంఘాల నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, మహ్మద్ సలీం , ఇంజం నర్సిరెడ్డి తదితర నేతలు ఈ భేటీలో ఉన్నారు. తమ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలిపారు. అయితే, శుక్రవారం సాయంత్రం అధినేత పర్యటన వాయిదా పడినట్లు సమాచారం అందుకున్నామని పార్టీ నేతలు తెలిపారు.
 
 అన్ని ఎన్నికలూ ఒకేసారి కలిసి రావడంతో ఈ సమయంలో జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన జరిగితే తమకు లాభిస్తుందని ఆశించారు. తాత్కాలికంగా వాయిదా పడినా, తిరిగి త్వరలోనే తేదీ ప్రకటిస్తామని నాయకత్వం ప్రకటించి, తమ కార్యకర్తలకూ, కిందికి స్థాయి వరకూ సమాచారం ఇచ్చారు. అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, జగన్ పర్యటన ఎపుడు పెట్టుకున్నా విజయవంతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: