జగన్ నాయకత్వంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నాయకత్వంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయనే..

జగన్ నాయకత్వంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయనే..

Written By news on Monday, March 10, 2014 | 3/10/2014


సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందించిన పరిపాలన రాష్ట్రానికి అవసరమని.. అలాంటి పాలన అందించే శక్తి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికే ఉందని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
 
 తెలుగుజాతికి బాబు ద్రోహం చేశారు...
 టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుజాతికి తీరని ద్రోహం తలపెట్టారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఒకవైపు విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ ఇవ్వడమే కాక పార్లమెంటులో కూడా వారి ఎంపీల చేత అనుకూలంగా ఓటు వేయించారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిపాలించిన తొమ్మిదేళ్లు రాష్ట్రంలో అరాచకం కొనసాగిందన్నారు. రాష్ట్ర ప్రజలు నరకం చూశారని, మరీ ముఖ్యంగా కరువు జిల్లా అయిన అనంతపురం విలవిల్లాడిందని చెప్పారు. రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఉచితంగా కరెంటు ఇవ్వాలని వేడుకుంటే కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఉచితంగా కరెంటు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ బాబు అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్నీ ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. మోసపూరిత ధోరణి గల చంద్రబాబు లాంటి వ్యక్తుల ను అడ్డుకోవాల్సిన బాధ్యత తమలాంటి వారిపై ఉందన్నారు.
 
వైఎస్‌ది సువర్ణ పాలన: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయమని అనంత వెంకట్రామిరెడ్డి అభివర్ణించారు. కరువుకాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ప్రశాంతత అందించారని కీర్తించారు. అలాంటి పరిపాలన కావాలని ప్రజలు తపనపడుతున్నారని.. జగన్ నాయకత్వంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయనే విశ్వాసంతో పార్టీలో చేరానని వివరించారు.  
 
 వైఎస్సార్ సీపీలో చేరిన కోనేరు
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు ప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనేరు రాజేంద్రప్రసాద్‌ను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నాయకత్వం నియమించింది. ఆదివారమే విజయవాడ తిరిగివచ్చిన ఆయనకు నియోజకవర్గ కార్యకర్తలు జిల్లా సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు నుంచే ఘనస్వాగతం పలికారు. విజయవాడ వరకూ ర్యాలీ కొనసాగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తలు మొండితోక జగన్మోహనరావు, రక్షణనిధి, జోగి రమేష్, వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి తదితరులు కోనేరుతో పాటు ఉన్నారు.
Share this article :

0 comments: