రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం

రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

* ఖమ్మం ‘వైఎస్సార్ జనభేరి’లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగం
భూమినైతే విడగొట్టారు కానీ.. మనసుల్ని కాదు
అన్యాయం జరిగితే తెలుగువారంతా ఒక్కటవుతాం
రెండు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ ఉంటుంది..  రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం తెస్తుంది
ఓటేయండని అడిగే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా?
చంద్రన్న రాజ్యం తెస్తానని చంద్రబాబు చెప్పగలరా?
ఆ ధైర్యం లేక భావోద్వేగాలతో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారు
సమైక్యం అంటే నాకు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు కావాలని...
ఖమ్మం ఆప్యాయతను గుండెల్లో నింపుకున్నా..
ఖమ్మం వచ్చే ముందు చాలాచోట్ల ఆగుతూ వచ్చాను. అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, అవ్వా తాతలను పలకరిస్తూ వచ్చాను. అయితే, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐదారుగురు నా దగ్గరికి వచ్చి ‘అయ్యా.. మీ నాయన పుణ్యాన గుండె ఆపరేషన్ చేయించుకున్నాను.. ఆ ఆపరేషన్ వల్లనే నేను బతికున్నాను’ అని చెప్పినప్పుడు నాకు ఒళ్లు పులకరించింది. ఆ అవ్వా తాతలకు తెలంగాణ, రాయలసీమ, సీమాంధ్ర అనే తేడా లేదు. రక్తం ఒక్కటే.. భాష ఒక్కటే.. మనలో మనకు తేడాలెందుకుండాలని నేను అడుగుతున్నా.’’
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భావోద్వేగాలతో రాజకీయాలు చేసి భూమిని విడగొట్టగలిగారు కానీ తెలుగు వారి మనసులను విడదీయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘నేను సమైక్యమనే అన్నాను.. సమైక్యమంటే అర్థం నాకు తెలంగాణలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, రాయలసీమ, సీమాంధ్రలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందరూ కావాలి. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే నా స్వప్నం’’ అని స్పష్టం చేశారు. ‘‘మిగిలిన పార్టీల మాదిరిగా మీరు అలా చేయండి.. మీరు ఇలా చేయండి అని నేను ఏనాడూ ఏ ప్రాంతం వారినీ రెచ్చగొట్టలేదు. ఇటువైపు ప్రాంతం వారి వద్దకు వెళ్లి కిరోసిన్, పెట్రోల్ పోసి తగలబడండి అని చెప్పలేదు. నేను ఒక్కటే నమ్మా. అందరం తెలుగు మాట్లాడుతాం. అందరం తెలుగుబిడ్డలం.
 
 అటువైపు అవసరం ఉంటే.. ఇటువైపు తెలుగు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వస్తారని, ఇటువైపు అవసరమైతే అటువైపు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వచ్చి తోడుగా మేమున్నామని నినదిస్తారని, ఇదే మా తెలుగు జాతి అని గర్వంగా చెబుతారని నమ్మా. ఇవాళ రెండు రాష్ట్రాలైనా.. వారు భూమిని విడగొట్టగలిగారు కానీ తెలుగువారిని విడగొట్టలేరు.. తెలుగు వారి మనసులను విడగొట్టలేరు’’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. బుధవారం సాయంత్రం ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో ఆయన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లోనూ ఉంటుంది. రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం తెస్తుంది. వైఎస్సార్  కాంగ్రెస్ ప్రతి పేదవాడి గుండె చప్పుడు నుంచి బయటకు వస్తుంది. ప్రతి పేదవాడి మనసు నుంచి బయటకు వస్తుంది. వచ్చి దివంగత నేత కలలు కన్న రాజన్న రాజ్యాన్ని తెస్తుంది’’ అని ఉద్ఘాటించారు. ఈ సభకు హాజరయిన అశేషజనవాహినిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 మీ అనురాగానికి పేరుపేరునా కృతజ్ఞతలు..
 ‘‘ఇవాళ దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ఇక్కడకు వచ్చినా.. ఆలస్యం అయినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఎవరూ కారణాలు వెతుక్కోవడం లేదు. కష్టమనిపించినా, ఆలస్యమైందని తెలిసినా ఇక్కడకు వస్తూనే చిక్కటి చిరునవ్వుతో, ఇంతటి ఆప్యాయత, ఆత్మీయత , ప్రేమానురాగాలు నాపై చూపెడుతున్నారు. ఇక్కడకు తరలివచ్చిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. మీ ఆప్యాయత, ఆత్మీయత, ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
 
 వైఎస్ పేదవాడి గుండెల్లో కొలువయ్యాడు..
 ప్రాంతాలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి మంచి చేయాలని వైఎస్ తపించారు. పేదల గుండె చప్పుడు విన్నారు. వారి మనసెరిగారు. ప్రతి పేదవాడి గుండెల్లో కొలువ య్యారు. అందుకే వైఎస్ అడ్రస్ అడిగితే నేరుగా గుండెను చూపించి ‘మా గుండెల లోతుల్లో ఉన్నాడు. ఇదే ఆయన అడ్రస్ అని’ చెపుతారు. నేనైతే రాముడి రాజ్యం చూడలేదు కానీ... రాజశేఖరుడి సువర్ణయుగం చూశానని గ ర్వంగా చెప్పగలను. ఏ పేదవాడికైనా అప్పుల పాలయ్యేందుకు రెండు కారణాలుంటాయని వైఎస్ గ్రహించారు. ఒకటి పిల్లల చదువులయితే, ఇంకోటి ఆ కుటుంబంలో ఎవరికైనా హఠాత్తుగా ఏదైనా జబ్బు చేసినప్పుడు. ఆ రెండు కారణాల నుంచీ పేదలను బయటపడేయడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. ఏ పేదవాడికి బాగాలేకపోయినా 108కి ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. కుయ్‌మని 20 నిమిషాల్లో వచ్చి అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేసి ఇంటికి పంపేలా పథకాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఆయన పేదవాడి కోసం పథకాలు ప్రవేశపెట్టారు.
 
 నిజాయితీ టార్చ్‌లైట్ వేసినా కనిపించడం లేదు..
 వైఎస్ వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లో నిజాయితీ అనే పదం టార్చిలైట్ వేసినా కనిపించడం లేదు. విశ్వసనీయత అనే పదానికి అర్థం ఏమిటో తెలియని విధంగా వ్యవస్థ దిగజారింది. ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎలాగైనా పోరాడాలని, మడమ తిప్పకూడదనే సిద్ధాంతం రాజకీయాల్లో కనిపించడం లేదు. నిజంగా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈ రాాష్ర్టం ఒక్కటిగా ఉండాలని, ఒక్కటిగా ఉంచాలని, ఒక్కటిగా ఉంటేనే అందరం బాగుంటామని, దేశంలో రెండో పెద్దజాతిని కాపాడుకోవాలని, మూడోస్థానంలో ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను మొదటి స్థానానికి తేవాలని ఆరాటపడ్డాం. కానీ అలా చేయలేకపోయాం. కేవలం ఓట్లు, సీట్ల కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయి రాష్ట్రాన్ని విడగొట్టాయి. భావోద్వేగాలతో ఎన్నికలకు వెళ్లడానికి రాజకీయాలు చేస్తున్న అన్యాయమైన పరిస్థితులున్నాయి.
 
 కాంగ్రెస్, టీడీపీలకు ఆ ధైర్యముందా?
 నేను ఒక్కటే అడుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీకి ‘మేం ఫలానా మంచి చేశాం’ అని ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం ఉందా? ఆరోగ్యశ్రీ నుంచి 133 జబ్బులను తొలగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయానికి వస్తే రెండో సెమిస్టర్ పూర్తవుతున్నా ఇంతవరకు ఫీజు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి. కరెంట్ స్విచాన్ చేస్తే బిల్లు ఎంతగా షాక్ కొడుతుందో.. అసలు బిల్లెంతో.. సర్‌చార్జి ఎంతో అర్థంకాని పరిస్థితి ఉంది. అక్కాచెల్లెళ్లు గ్యాస్ కోసం డీలర్ దగ్గరకు వెళితే రూ.1240 కట్టమంటున్నారు. ఇదేంటని అడిగితే బ్యాంకర్ దగ్గరకు వెళ్లమంటారు. బ్యాంకుకు వెళితే డీలర్ దగ్గరకెళ్లమంటారు. తీరా అవసరానికి రూ.1240 కట్టాల్సిన పరిస్థితి. ఒక కొత్త ఇల్లు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త పింఛన్ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు, మద్దతిచ్చిన టీడీపీకి ‘మేం ఫలానా మంచి చేశాం.. ఓట్లేయండి’ అని అడిగే దమ్ము, ధైర్యం ఉందా? తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు తాను చంద్రన్న రాజ్యాన్ని తెస్తానని చెప్పే ధైర్యం ఉందా? ఇన్ని కోట్ల జనాభాలో సీఎం అయ్యేందుకు దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు. అప్పుడు అతను ఏ విధంగా స్పందిస్తాడు? ప్రజల గుండె చప్పుడు ఎలా వింటాడు? చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఎలా కొలువుంటాడన్నదే ముఖ్యం.
 
 భావోద్వేగాలతో ఆడుకోవడం కరెక్టేనా?
 ఇవాళ రాజకీయాలు చదరంగంగా తయారయిపోయాయి. ఎంత అన్యాయమైన స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే... రాజకీయాల్లో ఒక మనిషిని తప్పించడం కోసం దొంగకేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందుకు అన్యాయంగా జైలుపాలు జేయడం కోసం వారి మనస్సాక్షి కూడా అడ్డుపడని స్థాయిలో రాజకీయాలు చెడిపోయాయి. కేవలం ఎన్నికలకు నెల రోజుల ముందు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారే... నేను అడుగుతున్నా... భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం కరెక్టేనా? బాధనిపిస్తుంది.. నిజంగా. నేను సమైక్యమే అన్నా.. సమైక్యమంటే అర్థం నా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలోని ప్రజలందరూ నాకు కావాలి.
 
 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కేంద్రమంత్రిని చేస్తా..
 శీనన్న(పొంగులేటి శ్రీనివాసరెడ్డి) నా పక్కనే ఉన్నాడు. శీనన్నను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నా. తెలంగాణలో నా మొదటి ఎంపీ అభ్యర్థి ఈ జిల్లా నుంచే.. ఇక్కడి నుంచే అని చెప్పడానికి గర్విస్తున్నా. ఆయనకు సీటు ఇవ్వడమే కాదు.. కేంద్ర మంత్రిని చేస్తా. ఎందుకంటే ఈ జిల్లా బాగుపడాలి. నాకయితే నమ్మకం ఉంది. అక్కడ 25 ఎంపీలు, ఇక్కడ 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని నా నమ్మకం. అందరం ఒక్కటవుతాం. సీమాంధ్రకు రాజధానిని తీసేశారు. ఇదిగో ఇంత డబ్బులిస్తాం... రాజధానిని కట్టుకోండని కూడా చెప్పడం లేదు. అన్యాయం జరిగితే తెలుగుబిడ్డలందరం ఒక్కటవుతాం. ఒక్కటిగా నిలిచి పోరాటం చేస్తాం. నిజంగా ఇక్కడకు వచ్చిన తర్వాత... ఇంత మంది ఆప్యాయతలను చూసినప్పుడు గుండెల నిండా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని గుండెల్లో నింపుకొని పోతున్నా. మీరు చూపించిన ఆప్యాయత, దీవెనలు, ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’
 
 నేడు నరసరావుపేటలో ‘వైఎస్సార్ జనభేరి’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో ‘వైఎస్‌ఆర్ జనభేరి’ సభ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో బుధవారం వైఎస్‌ఆర్ జనభేరి సభ ముగించుకుని బాగా పొద్దుపోయేసరికి జగన్ గుంటూరు చేరుకున్నారు. ఆయన గురువారం గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ కన్వీనరు తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ సభలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.
Share this article :

0 comments: