నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను..

నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను..

Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014

* 4 సంక్షేమ సంతకాలతోపాటు ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం: వైఎస్ జగన్
తెలుగుజాతి మొత్తం ఒక్కటవుదాం.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం
ఇటు సమస్య వస్తే అక్కడి తెలుగు బిడ్డలు.. అటు సమస్య వస్తే ఇక్కడి తెలుగు బిడ్డలు అండగా నిలుద్దాం
మనకు అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం
మన రాష్ట్రానికి మంచి చేసేవారిని, డబ్బులిచ్చేవారినే ప్రధానిని చేద్దాం
రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారు
అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు
మన బడ్జెట్ రూ. లక్షా 25 వేల కోట్లయితే.. ఆయన మాఫీల లెక్క రూ. లక్షా 60 వేల కోట్లు
నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను..

 
సాక్షి, గుంటూరు: ‘‘నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర చరిత్రను మార్చే నాలుగు సంతకాలను చేయడంతోపాటు మనమంతా కలిసి ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఇందుకు తెలుగు జాతి మొత్తం ఒక్కటవుదాం. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్న తెలుగు బిడ్డలు తోడుగా రావాలి. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు బిడ్డలు వారికి అండగా నిలబడాలి. ఐదో పని కోసం మనమంతా ఒక్కటవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తెలుగుజాతి ప్రజలంతా ఒక్కటై 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం.. అప్పుడు మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారో..మేలు చేస్తారో.. డబ్బులిస్తారో.. వారినే ప్రధాన మంత్రి సీటులో కూర్చోబెడదాం. చంద్రబాబు చెబుతున్న సింగపూర్ కంటే మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అందరి గుండెలూ ఒక్కటై అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం’’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటలకు మాచర్ల పట్టణంలోని అంబేద్కర్‌పార్కు సెంటర్‌లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఇవాళ్టికీ బాబు భయానక పాలన గుర్తుంది..
 ‘‘వైఎస్ సువర్ణ యుగానికి ముందు రాష్ట్రంలో భయానక పరిపాలన సాగుతుండేది. అది చంద్రబాబు నాయుడి పాలన. అవ్వా తాతలకు ముష్టేసినట్లు రూ. 70 పెన్షన్ ఇచ్చే రోజులవి. గ్రామాల్లో అప్పటికే పెన్షన్ పొందుతున్న ఒకరు చనిపోతే తప్ప కొత్తవారికి పెన్షన్ ఇవ్వని రోజులవి. గ్రామాల్లో పిల్లల్ని పెద్ద చదువులు చదివించడానికి తల్లిదండ్రులు ఉన్న అర ఎకరా, ఎకరా భూమి అమ్మేయక తప్పని భయానక రోజులు ఇవాళ్టికీ గుర్తున్నాయి. రూ. 2కే కిలో బియ్యం ఇస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక బియ్యాన్ని రూ. 5.25 పైసలు చేశారు ఇదే చంద్రబాబు. అక్కాచెల్లెళ్ళను మోసం చేసేందుకు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా అని ప్రతి అక్కా చెల్లెమ్మ ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నికలు అయిపోయాక, మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా అతలాకుతలమైపోతుందంటూ ‘ఈనాడు’లో పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయించారు. అలా రాయించిన మూడో రోజుకే గ్రామ గ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు సాగించిన భయానక పరిపాలనలో రైతన్నలు ఎంత దారుణంగా బతికేవారంటే కరువు కాటకాలతో అలమటిస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రైతన్నలను ఆదుకోండి... వడ్డీ మాఫీ చేయండి... కరెంటు ఉచితంగా ఇవ్వండి అని అడిగితే వడ్డీ మాఫీ దేవుడెరుగు.. కరెంటు తీగలు చూపించి అవహేళన చేశారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండని అడిగితే వారిని ఆదుకుంటే ఇంకా ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారని, తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిన పరిస్థితిని చంద్రబాబులోనే చూశాను.
 
 బిల్లు అన్యాయంగా ఉంటే ఎందుకు ఓటేశావు?
 అధికారం పోయినా చంద్రబాబు మనసులో ఎటువంటి మార్పూ లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎవరినైనా అమ్మేయగలడు.. వెన్నుపోటు పొడవగలడు. విభజన బిల్లు అన్యాయంగా ఉందని ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు తన పార్టీ ఎంపీలచేత అదే బిల్లుకు ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా... బిల్లు ఇంత అన్యాయంగా ఉంటే ఎందుకయ్యా ఓటేసి మద్దతు తెలిపావు? సమాధానం రాదు. చంద్రబాబు ఎంత దిగజారిపోయారంటే ఓట్ల కోసం, సీట్ల కోసం మన రాష్ట్ర ప్రజలను అమ్మేయడానికి కూడా వెనకాడలేదు.
 
బాబు ఎన్ని అబద్ధాలైనా  ఆడతారు:  చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆశ్చర్యం కలిగించే మాట ఒకటి చెప్తున్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తానని చెప్తున్నారు. అయ్యా.. చంద్రబాబూ ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తూ మాట్లాడుతున్నావు! ఇవాళ రాష్ట్రంలో రైతన్నలు తీసుకున్న రుణాలు ఎంతో తెలుసా? ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు. వీటితోపాటు డ్వాక్రా మహిళలకు మరో రూ. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నావు. ఉచితంగా ఫీజులు ఇస్తానంటున్నావు. ఉచితంగా కరెంటు ఇస్తానంటున్నావు..  ఎవ్వరు పోయి అడిగినా ఏం కావాలో చెప్పండి అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నావు. 2008లో పూర్తిగా రుణాలు కట్టలేక చేతులెత్తేసిన రైతన్నలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం 28 రాష్ట్రాల్లో రూ. 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రానికి రూ. 12 వేల కోట్లు వచ్చి ఆ మేరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 65 వేల కోట్లు మాఫీ చేస్తే చంద్రబాబు మన రాష్ట్రంలోనే రూ. లక్షా 27 వేల కోట్లు మాఫీ చేస్తానని అబద్ధాలు చెబుతున్నారు. బడ్జెట్‌లో మనకున్న ఆదాయమే రూ. లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు ఎంత అంటే రూ. లక్షా 60 వేల కోట్ల వరకు ఉన్నాయి.
 
 కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పేలా లీడర్ ఉండాలి..
 ఎన్నికలకు పోతున్న ఈ తరుణంలో మీరు కూడా హామీలు చెప్పండంటూ నన్ను చాలా మంది అడిగారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు ఆడే వ్యక్తిని కాను. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు మళ్లీ కనిపించరు. ఆయన పార్టీ కూడా ఉండదు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడే పరిస్థితిలో ఆయన ఉన్నారు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం మళ్లీ రావాలి. ప్రతి గుండె చప్పుడు వైఎస్సార్‌ను కోరుకుంటోంది.’’
 
 అక్కాచెల్లెమ్మల కోసం రెండు సంతకాలు
 ‘‘బహుశా ఏ రాజకీయ నాయకుడూ నాలా పూరిగుడిసెల్లోకి వెళ్లి అక్కాచెల్లెమ్మల కష్టాలు తెలుసుకోలేదు. అక్కాచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారని ఏ ఒక్కరికీ అవగాహన లేదు. అక్కాచెల్లెమ్మల కోసమే నేను మొదటి సంతకం పెడతా. పిల్లలను బడికి పంపించినందుకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలోనే నేరుగా డబ్బులు వేస్తాం. రెండో సంతకం అవ్వా, తాతల కోసం పెన్షన్‌ను రూ.700 చేసేందుకు పెడతా. మూడో సంతకం రైతన్నల కోసం రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి కోసం చేస్తా. నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెమ్మల కోసమే.. డ్వాక్రా రుణాల మాఫీపై చేస్తా.’’
 
 నాలుగు కుటుంబాలకు జగన్ ఓదార్పు
 గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏడాదిన్నర కిందట ఓదార్పు యాత్రను నిలిపేసిన జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్ళీ మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి యాత్ర పునఃప్రారంభించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక తనువు చాలించిన గాదెవారిపల్లెలో చల్లా రామరాజు, మాచర్ల పట్టణంలో కందుకూరి యేసుదానం, మంజుల అర్జునరావు, వంకాయలపాటి మేరమ్మ కుటుంబాల్ని పరామర్శించారు. కారంపూడి మీదుగా పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, భట్టువారిపల్లె, అడిగొప్పుల, దుర్గి, పోలేపల్లి జంక్షన్, రాయవరం జంక్షన్ మీదుగా జగన్ రోడ్ షో సాగింది. రోడ్ షోలో అడుగడుగునా జగన్‌కు జనం నీరాజనం పలికారు. తమ గ్రామాలకు రావాలంటూ ప్రతి చోటా జగన్‌పై ఆప్యాయత కురిపించారు. అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో మాచర్లలో ‘వైఎస్సార్ జనభేరి’ సభ ప్రకటించిన సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా మొదలైంది. శనివారం పార్టీ నేతలతో భేటీ నేపథ్యంలో సభ ముగియగానే జగన్ హైదరాబాద్ బయల్దేరారు.
 
 పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్
 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్(కాంగ్రెస్) శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయన మెడలో కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనభేరి సభలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, గుదిబండి చిన వెంకటరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డిని ఆశీర్వదించండి. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చక్రం తిప్పాలని కోరుతున్నా’’ అని జగన్ సభలో పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: