ఏ నాయకుడు ప్రజల గుండె చప్పుడు వింటాడో.. ఏ నాయకుడు ప్రజల మనసెరుగుతాడో. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఏ నాయకుడు ప్రజల గుండె చప్పుడు వింటాడో.. ఏ నాయకుడు ప్రజల మనసెరుగుతాడో.

ఏ నాయకుడు ప్రజల గుండె చప్పుడు వింటాడో.. ఏ నాయకుడు ప్రజల మనసెరుగుతాడో.

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

మీ మనసు మాటే వినండి
సాక్షి, విజయనగరం: ‘‘ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నామో, ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నామో.. మన గుండెను, మన మనసును ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడు ప్రజల గుండె చప్పుడు వింటాడో.. ఏ నాయకుడు ప్రజల మనసెరుగుతాడో.. ఏ నాయకుడు తన మరణం తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో చిరకాలం నిలవాలనుకుంటాడో.. అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడిలా నేను ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించను. ఆయనకంటే పాతికేళ్లు చిన్నవాడిని. అయినా.. ఆయనకంటే ఎక్కువ దేశాలు.. రాష్ట్రాలు తిరిగాను.
 
గత నాలుగైదేళ్లుగా ఎండనక, వాననక తిరుగుతూ మీ కష్టాలను కళ్లారా చూసిన అనుభవంతో చెప్తున్నా.. అక్కా చెల్లెళ్లకు అన్నలా, తమ్ముడిలా.. తల్లిదండ్రులకు కొడుకులా.. అవ్వా, తాతలకు ఒక మనవడిలా.. ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తానని మడమ తిప్పని నేతగా మాటిస్తున్నా’’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానున్న మూడు రోడ్ల కూడలిలో శనివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ను ప్రకటించారు. రాష్ట్ర విభజన తీరుతో రాజధాని హైదరాబాద్ దూరమైందని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. అందుకు కారకులైన సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలను జగన్ ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే చేసే ఐదు సంతకాలతోపాటు, తమ ప్రభుత్వం అమలు చేయనున్న మరో ఐదు కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆ ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మారుస్తానని, మరో ఐదు పనులతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తానని అన్నారు. ఆ పది అంశాలూ ఆయన మాటల్లోనే..
 
 1. తొలి సంతకం: అక్కా చెల్లెళ్లకు చెప్తున్నా.. మీరు మీ పిల్లల్ని బడికి పంపండి. బడికి వెళ్లే ఒక్కో బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరైతే రూ.1000 నెలనెలా మీ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ‘అమ్మ ఒడి’ పథకం తీసుకొస్తా.
 
 2. రెండో సంతకం: వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా.. వేరే గతిలేక కూలిపనులకు వెళ్తున్నవారిని చూసి నాకు బాధనిపించింది. ప్రతి అవ్వ.. తాత ఆశలు తీర్చే మనవడిగా.. మూడు పూటలా భోజనం పెట్టేలా రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతా.
 
 3. మూడో సంతకం: ఎన్ని రకాల పంటలు పండిస్తున్నా.. సరైన గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి రైతన్నది. అలాంటి రైతన్నకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా.
 4. నాలుగో సంతకం: డ్వాక్రా మహిళలు కొత్త జీవితం మొదలు పెట్టేలా.. డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తా.
 5. ఐదో సంతకం: ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్ ఇలా ఏ కార్డు కోసమూ ఎవరూ ఏ రాజకీయ నాయకుల చుట్టూ తిరగనక్కర్లేదు. మీ వార్డు, మీ గ్రామంలోనే.. ఇక ఆఫీస్ తెరిచి ఏ కార్డయినా 24 గంటల్లోనే మీకందించే ఏర్పాటు చేస్తా.
 
 6. ఆ మహానేత ఆకాశం నుంచి గర్వపడేలా చెప్తున్నా.. 2019 తిరిగేసరికి రాష్ట్రంలో  50 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాటిస్తున్నా. 2019లో ఏ గ్రామానికి వెళ్లినా.. ఇల్లులేని వాళ్లు చేతులెత్తండని అడిగితే.. ఒక్కరు కూడా చేతులెత్తకుండా.. అందరికీ సొంతిల్లు నిర్మించి ఇస్తా.
 
 7. ఇప్పటికీ ఏ పేదకైనా..గుండె జబ్బో.. న్యూరో ఆపరేషనో.. కేన్సర్‌కో వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. ఇక ఆ దుస్థితి లేకుండా ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తా. సింగపూర్‌ను మించిన నగరాన్ని రాజధానిగా రూపొందిస్తా. అక్కడ 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తా.
 
 8. రోజంతా కష్టపడి ఇంటికెళ్లి చూస్తే.. కరెంట్ ఉంటుందో.. లేదో.. తెలియని పరిస్థితి. 6-8 గంటలు కరెంట్ కోతలు. దీన్ని మార్చి చూపిస్తా. 2019 నాటికి కరెంట్ కోతల్లేని రాష్ట్రాన్ని తీసుకొస్తా. రైతులకు ఏడు గంటల విద్యుత్ రాత్రిపూట కాకుండా పగటిపూటే సరఫరా చేస్తా.
 
 9. గ్రామాల్లో ఒక్కటంటే.. ఒక్క బెల్ట్‌షాపు లేకుండా చేస్తా. అదే గ్రామం నుంచి పది మంది అక్కచెల్లెళ్లను ఆడ పోలీసులుగా నియమిస్తా. నియోజకవర్గం మొత్తానికి ఒక్కటే మద్యం షాపు ఉండేలా చూస్తా.
 
 10. చంద్రబాబులా కోట్ల ఉద్యోగాలిస్తానని నోటి మాటలు చెప్పను. ఉన్నత చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరికీ భరోసా.. ధీమా ఉండేలా చేస్తా. నాలుగైదేళ్లుగా ఎండనక, వాననక తిరిగి మీ కష్టాలు కళ్లారా చూసిన వాడిగా చెబుతున్నా.. ఒక మంచి అన్నయ్యలా.. చదువుకున్న ప్రతి పిల్లాడికీ.. నేనున్నానని ధీమా ఇస్తున్నా’’
 
 పార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతిన
 ఎమ్మెల్సీ పోతిన రామారావు శనివారం చీపురుపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈయనతోపాటు ఆర్కే రియల్ ఎస్టేట్ అధినేత కొండయ్య, ఆయన కుమారుడు అమర్‌నాథ్, పలువురు  మాజీ కార్పొరేటర్లు పార్టీలో చేరారు.
Share this article :

0 comments: