అభ్యర్థుల ఎంపికకు కమిటీల ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభ్యర్థుల ఎంపికకు కమిటీల ఏర్పాటు

అభ్యర్థుల ఎంపికకు కమిటీల ఏర్పాటు

Written By news on Sunday, March 9, 2014 | 3/09/2014

స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై పార్టీ నేతలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు
సర్వశక్తులూ ఒడ్డి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడాన్ని సానుకూలంగా మలచుకోవాలి
ఉభయ ప్రాంతాల్లోని అన్ని స్థానాలకూ పోటీ చేసేలా సన్నద్ధం కావాలి
* ప్రజలకు అధికారమిచ్చే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో గెలిచి పార్టీ పునాదుల్ని పటిష్టం చేసుకోవాలి
ఎన్నికల వ్యూహంపై వైఎస్సార్ సీపీ సమావేశం
అభ్యర్థుల ఎంపికకు కమిటీల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డి కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి ముఖ్య నేతల సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు రావడాన్ని పార్టీ నేతలు సానుకూలంగా మల్చుకోవాలని, గెలుపు గుర్రాలను జాగ్రత్తగా ఎంపిక చేయాలని సూచించారు.
 
 తెలంగాణ, సీమాంధ్ర ఉభయ ప్రాంతాల్లోని అన్ని స్థానాలకూ పోటీ చేసే విధంగా అభ్యర్థులను సన్నద్ధం చేయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీకి మంచి ఆదరణ ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు వాటిని ఓట్ల రూపంలోకి మలుచుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆయన ప్రస్తావిస్తూ ప్రజలకు అధికారమిచ్చే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ పునాదులను పటిష్టం చేసుకోవాలని కోరారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
 మన గుర్తు ‘ఫ్యాన్’..
 లోక్‌సభ, శాసనసభ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నింటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ‘ఫ్యాన్’ ఉమ్మడి గుర్తుగా ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నింటిలోనూ ఒకటీ రెండు చోట్ల మినహా ఫ్యాన్ గుర్తుపై పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ దీనిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు ఎన్నికల్లో దూసుకెళ్లాలని చెప్పారు. జగన్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాకు వివరించారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ఏర్పాటయ్యే కమిటీల వివరాలను ఆయా జిల్లాలకు ఆదివారం పంపుతామన్నారు.
 
రాష్ట్రం నుంచి వెళ్లే పార్టీ పరిశీలకులు, జిల్లా కన్వీనర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సంప్రదింపులు జరిపి అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ సూచించారన్నారు. ఈ నెల 9న(ఆదివారం) అన్ని జిల్లాల్లోనూ స్థానిక ఎన్నికలపై సమావేశాలు జరుగుతాయన్నారు. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు సమాయత్తం కావాలని జగన్ ఆదేశించారన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక 99 శాతం ఇప్పటికే పూర్తయిందని, రాజకీయంగా సరైన సమయంలో పార్టీ ప్రకటిస్తుందని రామకృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాలుగేళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు కావాలనే ఉత్సాహంతో ఉంటారని, తమ పార్టీ పునాదులు పటిష్టం చేసుకోవడానికి వారిలో ఉత్తమమైన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని చెప్పారు.
 
  వేలసంఖ్యలో ఎంపీటీసీ, మున్సిపల్ వార్డులు, వందల సంఖ్యలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, మరిన్ని మున్సిపల్ కార్పొరేషన్ పదవులున్నందున కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా ఉత్సహంతో ముందుకెళ్లేలా పార్టీ శ్రేణులను సర్వసన్నద్ధం చేస్తున్నామన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా తప్పనిసరిగా నియమిత కాలానికి స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా చట్టం తెచ్చినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతతో నిర్వహించలేకపోయిందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజల అభివృద్ధికి దక్కాల్సిన రూ.2500 నుంచి 3000 కోట్లు రాకుండా పోయాయన్నారు. ఈ ఐదేళ్లూ కాంగ్రెస్ నాయకులు తమ కుర్చీని కాపాడుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చారని, ప్రజలన గాలికొదిలేశారని ఆయన విమర్శించారు.
 
 ఎన్నికల ప్రచారానికి జగన్, విజయమ్మ, షర్మిల
 జగన్, విజయమ్మ, షర్మిల ముగ్గురూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ విసృ్తతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారని, ఎవరు ఏ ప్రాంతంలో పర్యటిస్తారనే కార్యక్రమం వివరాలను త్వరలో విడుదల చేస్తామని కొణతాల తెలిపారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైనందు వల్ల నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర రద్దయిందని, ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చాక అక్కడ కూడా చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ పార్టీల ప్రభావం వైఎస్సార్ సీపీపై ఏ మాత్రం ఉండదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సినపుడు ఏమీ చేయకుండా ఇపుడేదో చేస్తానని కిరణ్ చెప్పడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. తన చేతిలో అస్త్రం ఉన్నపుడు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించే అవకాశం ఉన్నా కిరణ్ చేయలేదని, అలాగే తీర్మానం చేయాల్సిన తరుణంలో కూడా చేయలేక పోయారని చెప్పారు. పలువురు మాజీ మంత్రులు, కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్న విషయాన్ని ప్రస్తావించగా తమ పార్టీలో చేరడానికి వారికి అవకాశం ఇవ్వలేదు కనుకనే వారటు వెళుతున్నారన్నారు
Share this article :

0 comments: