ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని ..

ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని ..

Written By news on Monday, March 24, 2014 | 3/24/2014

కరెంట్ కోతల్లేని రాష్ర్టంగా చేస్తా
 సీమాంధ్రలో హైదరాబాద్‌ను మించిన మహా నగరాన్ని నిర్మిస్తా: జగన్
 పేదల కష్టాలు తీర్చేలా ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తా
వాటిలో అన్ని రకాల వైద్యులూ ఉండేలా చర్యలు
అ ఆస్పత్రులన్నింటినీ ఒక యూనివర్సిటీ పరిధిలోకి తెస్తా
ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని మాటిస్తున్న
చంద్రబాబులాగా మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని అబద్ధపు హామీలివ్వను
  ప్రతి పిల్లాడికి ఉద్యోగమివ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా
.
  ‘‘రాష్ర్టంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో చెప్పలేని విధంగా ఉంది. నాలుగైదు గంటలకు మించి కరెంట్ ఉండడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం ఎక్కువైతే ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుంది. ఇక రైతులకు ఉచిత విద్యుత్ పేరుకే ఏడుగంటలు. వాస్తవానికి నాలుగైదు గంటలకు కూడా మించి ఇవ్వడం లేదు. అది కూడా రాత్రి పూట రెండు గంటలకొకసారి ఇస్తున్నారు. మోటారు వేసుకునేందుకు ఆ రాత్రిపూట వెళ్లే రైతన్నలను తేలుకుట్టడమో.. పాము కరవడమో మనం చూస్తూనే ఉన్నాం.

మన కళ్లెదుటే అన్నీ జరుగుతున్నా చూడాల్సిన పరిస్థితి. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా.. 2019 ఎన్నికల్లోగా ఈ రాష్ట్రాన్ని కరెంట్ కోతల్లేని రాష్ర్టంగా చేస్తాను.  రైతన్నల కోసం భారమైనప్పటికీ ఏడు గంటలు ఉచిత కరెంట్ ఇస్తాను. రైతులకు ఇబ్బంది కలగని రీతిలో పూర్తిగా పగటి పూటే ఇస్తాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏడో రోజు ఆదివారం పిఠాపురం పట్టణంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం గొల్లప్రోలు పాతబస్టాండ్ సెంటర్‌లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’కి హాజరైన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పెండెం దొరబాబు ను ప్రకటించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

ఆస్పత్రిలో రెండేళ్ల వరకు ఖాళీ లేదంట

 ‘‘రోడ్‌షోలో ఒకరిద్దరు కన్పించినా ఆగి వారి బాగోగులు తెలుసుకోవడం నాకు అలవాటు. మొన్న తిరుపతికి వెళ్లాను.. ఆ సమయంలో ఒక పిల్లాడు నా దగ్గరకు వచ్చాడు. ఆ పిల్లాడి పేరు భాస్కరరెడ్డి.. ఆ పిల్లాడికి 24 ఏళ్లు. ‘అన్నా..నా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.. డయాలసిస్ చేయించుకోవాలన్నా అన్నాడు. అక్కడ స్విమ్స్ ఉంది. అది తిరుపతిలో ప్రఖ్యాత సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి. ఆ ఆస్పత్రిలో డయాలసిస్ ఉంది కదా అని అన్నా. అక్కడకు వెళ్తే రెండేళ్ల వరకు ఖాళీ లేదని చెప్పారన్నా అని ఆ పిల్లాడు చె ప్పినప్పుడు నా మనసుకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లాడు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ప్రతిసారీ రూ.2 వేలు ఖర్చు చేయాలి. అంటే వారానికి రూ.6 వేలు, ఆ లెక్కన నెలకు 24 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిజంగా నా మనసు చాలా బాధపడింది.

 ఎక్కడ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా వైద్యులు వెళ్లేలా..

ఆ ఆస్పత్రిలో మెడికల్ కోర్సు చదువుతున్న మా బంధువుల పిల్లాడ్ని రమ్మని పిలిచాను. ఆ పిల్లాడు తమ నలుగురు స్నేహితులతో వచ్చాడు. ఎందుకు జరుగుతుందిలా అని వారిని అడిగాను. ‘ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. సామాన్లు ఉన్నాయి. వైద్యులే లేరన్నా’ అని వారు చెప్పారు. నిజంగా ఆశ్చర్యమేసింది. ఈ పరిస్థితి మారాలి. అందుకే నేను చెబుతున్నా. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తాను. అలాగే మనకు కాకుండా పోయిన హైదరాబాద్ నగరానికి మించిన మహానగరాన్ని సీమాంధ్రలో నిర్మిస్తా. ఆ మహానగరంలో 15 నుంచి 17 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాను.


అది కూడా అన్ని రకాల వైద్యులూ ఉండేటట్టు చేస్తా. అంతేకాకుండా ఆ వైద్యులు ఏ జిల్లాలో ఎవరికిఏ ఇబ్బంది వచ్చినా.. ఎక్కడ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా వెళ్లేటట్టు రోటేషన్ పద్ధతిని తీసుకొస్తా. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులన్నింటినీ కలిపి ఒక యూనివర్సిటీ పరిధిలోకి తెస్త్తా. ఈ వ్యవస్థను మార్చబోయే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా.

నాడు ప్రభుత్వ సంస్థల్ని మూయించేశారు.. నేడు..

 పైనున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దేవుని దయతో చదువుకున్న ప్రతీ పిల్లాడికి ఉద్యోగం తీసుకురావడం కోసం ముందుండి పనిచేస్తానని మాటిస్తున్నా. కానీ చంద్రబాబు మాదిరిగా అన్ని ఉద్యోగాలు ఇస్తాను.. ఇన్ని ఉద్యోగాలు ఇస్తానంటూ అబద్ధాలు ఆడలేను. అబద్ధాలు ఒకటికి వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే చంద్రబాబు నైజం ప్రజలకు తెలియంది కాదు. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానంటూ హామీ ఇస్తున్న బాబు కొత్తగా ఇంటికొక ఉద్యోగం ఇస్తానంటున్నారు. ఇదే చంద్రబాబు తన హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీయించి మూయించి వేశారు. 20వేల మంది ఉద్యోగులను రోడ్ల పాల్జేశారు. ఇప్పుడు మళ్లీ ఉద్యోగాలిస్తానంటూ యువతను మోసగిస్తున్నారు.
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు

 అధికారం కోసం చంద్రబాబు పట్టపగలు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. దానికి ఒక హద్దూ.. పద్దూ ఉండాలి. ఆ రెండూ ఆయనకు లేవు. బాబుకు విశ్వసనీయత అంటే అర్థం తెలియదు. బాబు రోజూ అంటుంటారు.. ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని. బాబు నైజం తెలియందికాదు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేయరని గ్యారెంటీ ఎక్కడ ఉందని నేను ప్రశిస్తున్నా.

 ఏలేరు ఆధునీకరణ పూర్తిచేస్తా..

 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఏలేరు ఆధునీకరణ నేను పూర్తి చేస్తాను. ఈ మెట్ట ప్రాంత రైతుల కడగండ్లు తీర్చేందుకు రాజశేఖరరెడ్డి వంద కోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పాలకులు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రైతు నోట్లో మట్టికొట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏలేరు ఆధునీకరణ పనులను చేపట్టి ప్రతి ఎకరాకూ నీరందిస్తాను.

పిఠాపురం జనహోరు

 ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటలవరకు పిఠాపురం పురవీధుల్లో వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వస్పందన లభించింది. వీధులన్నీ జనంతో హోరెత్తాయి. అడుగడుగునా ప్రజలు జగన్‌కు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. త్వరలోనే అన్ని సమస్యలూ పరిష్కారమయ్యే రోజు వస్తోందని జగన్ వారికి ధైర్యం చెప్పారు. పర్యటనలో జగన్ వెంట ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు గండేపల్లి రామారావు(బాబి), తెడ్లపు చిన్నారావు, చేనేత విభాగం కన్వీనర్ పంపన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లాలోని ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో రోడ్‌షో, సాయంత్రం తునిలో ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్ పాల్గొననున్నారు.
 మనల్ని మనం ప్రశ్నించుకోవాలి...
 
వచ్చే 45 రోజులూ వార్డు మెంబర్ నుంచి మన తలరాతలు మార్చే ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల వరకు అన్ని ఎన్నికలూ జరుగబోతున్నాయి. ఓటు వేసే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు ప్రజల మనసెరిగి పాలిస్తారో... ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో.. చనిపోయిన తర్వాత కూడా ఎవరు ప్రజల గుండెల్లో బతికే ఉండేలా పాలించగలరో.. అటువంటి నాయకుణ్ణి మనం ఎన్నుకోవాలి. అలా పాలించాడు కాబట్టే ఆ దివంగత మహానేత వైఎస్సార్ ఇవాళ్టికీ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు. విశ్వసనీయత, నిజాయితీ.. నేను ఆయన నుంచి నేర్చుకున్నవే. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమొక్కటే నాకు తెలుసు. విశ్వసనీయత, విలువలు ఒక వైపు ఉంటే.. కుళ్లు, కుతంత్రాలు మరొకవైపు ఉండగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో మీరంతా ఒక్కటిగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలి.’’
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
Share this article :

0 comments: