అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు

అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు

Written By news on Wednesday, April 23, 2014 | 4/23/2014

నిస్సిగ్గుగా బాబు  వాగ్దానాలు
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు  టీడీపీ అధ్యక్షుడిని ప్రశ్నించిన షర్మిల
 
ఇప్పుడు అన్నీ అబద్ధపు హామీలిస్తున్నావు
బాబుకు ఓటడిగే హక్కు లేదు
వైఎస్సార్ జనం గుండెల్లో ఉన్నారు..
ఓటేసే ముందు ఆయనను గుర్తుచేసుకోండి
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

 
 హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్‌లా మారుస్తానని.. అన్నీ ఉచితంగా ఇస్తానంటూ నిస్సిగ్గుగా వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు. మంగళవారం మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, శాంతినగర్, ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

 వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనాకాలంలో పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూస్తే... తర్వాత కాంగ్రెస్ సర్కారు జనంపై రూ. 32 వేల కోట్ల భారం మోపిందని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వృద్ధులు ఇలా అని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. వైఎస్సార్ జనం గుండెల్లో ఉన్నారని చెప్పారు. పేదల కోసం ఆయన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. వైఎస్సార్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. చంద్రబాబునాయుడు తన పాలనాకాలంలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వైఎస్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని షర్మిల వివరించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష నేత అయి ఉండీ విప్ జారీ చేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరునే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దని మండిపడ్డారు.

 సీల్డ్ కవర్ సీఎం కొర్రీలు..

 సీల్డ్ కవర్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పాలనలో మహానేత ప్రవేశపెట్టిన జనరంజక పథకాలకు కొర్రీల మీద కొర్రీలు వేశారని, అన్ని చార్జీలు పెంచడమే అజెండాగా  పెట్టుకొని పాలన చేశారని షర్మిల విమర్శించారు.

 ఓట్లడిగే హక్కు వారికి లేదు..

 టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలపై ఏ ఒక్క పోరాటం చేయలేదని.. వారికి ఓట్లడిగే నైతిక హక్కు లేదని షర్మిల స్పష్టం చేశారు. పదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏరోజూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేయలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సుదీర్ఘపోరాటం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోవద్దని, ఓటు వేసే ముందు మహానేత వైఎస్సార్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరిని నంబర్‌వన్ పార్లమెంట్ స్థానంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎల్‌బీ నగర్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే అభ్యర్థి జి.సూర్యనారాయణ రెడ్డి, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సభల్లో మాట్లాడారు.
 
Share this article :

0 comments: