ఇది ఎన్నికల డబ్బే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ఎన్నికల డబ్బే..

ఇది ఎన్నికల డబ్బే..

Written By news on Tuesday, April 29, 2014 | 4/29/2014

పుట్టా బందువు మిల్లులో నోట్లకట్టలు
  • కాటన్ మిల్లులో రూ. 46లక్షలకు పైగా నగదు పట్టివేత
  •   ఎన్నికల డబ్బేనని నిర్ధారించిన ఆర్‌ఓ
  •   రూ. 5 లక్షలు ఇస్తా.. వదిలి వెళ్లాలని బేరం
 ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రజల్లో  తెలుగుదేశం పార్టీకి ఆదరణ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు నోట్ల కట్టలను నమ్ముకున్నారు. డబ్బును వెదజల్లి ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమీప బంధువైన రమణయ్య కాటన్ మిల్లులో పెద్ద మొత్తంలో నగదును దాచారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ డబ్బును ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయత్నాలకు పోలీసులు గండి కొట్టారు. సమాచారం అందడంతో మిల్లుపై దాడి చేశారు. అక్కడ ఉన్న రూ. 46,19,200 నగదును సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
 
 పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు
మైదుకూరు నియోజక వర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమీప బంధువైన రమణయ్యకు చెందిన శ్రీవెంకటేశ్వరా ఇండస్ట్రీస్ ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉంది. ఈ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోనే శ్రీకర్ కాటన్ ట్రేడర్స్‌తో పాటు మరో రెండు మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఒకే వ్యక్తికి చెందినప్పటికీ పేర్లు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. కాగా పుట్టా సుధాకర్ యాదవ్ మేనల్లుడు మేకల శ్రీనివాసులు యాదవ్ ఇక్కడ డబ్బు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధాకర్ యాదవ్‌కు పూర్తిగా ఇతనే డబ్బును సమకూర్చుతుంటాడు.
 
ఇతని చేతుల మీదుగానే రూ. కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు ఎన్నికల కోసం శ్రీనివాసులుయాదవ్ ఇక్కడ డబ్బు దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ మిల్లులో పెద్ద మొత్తంలో నగదు దాచివుంచారని సోమవారం 11.50 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి మిల్లులోకి చేరుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు వహీద్, చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డిలు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందుగా పోలీసులు ప్రాంగణంలో ఉన్న మిల్లుల్లో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా డబ్బు కనిపించలేదు. శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ సమీపంలో ఉన్న ఒక గదికి తాళం వేసి ఉంది. దానిని తెరవమని చెప్పగా అక్కడ ఉన్న సిబ్బంది తాళాలు లేవని చెప్పారు. సంబంధిత మిల్లు యజమాని రమణయ్యకు ఫోన్ చేసిన సీఐ ఇక్కడికి వచ్చి తాళం తీయాలని చెప్పగా  అతను సెల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో పోలీసులు, స్క్వాడ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అర్బన్ సీఐ సత్యనారాయణ సంబంధిత మిల్లు యజమానికి 20 సార్లు పైగా ఫోన్ చేశారు. అయినప్పటికీ అతను రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి  బాలసుబ్రమణ్యం, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇన్‌కంట్యాక్స్ అధికారి కృష్ణకుమార్‌ల సమక్షంలో గది తాళాన్ని పగులకొట్టారు. బీరువాలో చూడగా అందులో సుమారు రూ. 46,19,200 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం నగదును ఈ నెల 19, 24, 25 తేదీలలో పట్టణంలోని ఐడీబీఐ, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్‌ల నుంచి డ్రా చేసినట్టు నోట్ల కట్టల లేబుల్‌పై ఉంది. ఈ మొత్తాన్ని పోలీసు అధికారులు ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించారు.
 
 ఇది ఎన్నికల డబ్బే..
 రమణయ్యకు చెందిన శ్రీకర్ కాటన్ ట్రేడర్స్‌లో దొరికిన నగదు ఎన్నికల కోసం దాచి ఉంచినదే నని ఆర్‌ఓ బాలసుబ్రమణ్యం అన్నారు. ఎక్కడైనా డబ్బు దాచి ఉంచారని సమాచారమిస్తే వెంటనే దాడి చేస్తాన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అందరూ సహకరించాలన్నారు.
     
 రూ. 5 లక్షలు ఇస్తా.. వదిలి వెళ్లండి
 మిల్లు వద్దకు వచ్చి తాళం తీయాలని మధ్యాహ్నం నుంచి పోలీసులు రమణయ్యకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అతను రాలేదు. పక్కా సమాచారంతో దాడి చేశారని భావించిన రమణయ్య ఓ పోలీసు అధికారికి ఎర వేశాడు. రూ. 5 లక్షలు ఇస్తాను.. అక్కడి నుంచి వెళ్లిపోండి అని అతను పోలీసు అధికారితో అన్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ అధికారి దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అర్బన్ సీఐ టివి సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఐడీబీఐ, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్‌లలో డబ్బు ఎవరు డ్రా చేశారు, ఎవరి అకౌంట్‌లో నుంచి డ్రా చేశారన్న విషయమై పోలీసు, ఇన్‌కంట్యాక్స్ అధికారులు  మంగళవారం విచారించనున్నారు. విచారణ తర్వాత సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Share this article :

0 comments: