కేవలం వంద రూపాయలకే ఆ విద్యుత్ ఇస్తానని మాటిస్తున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేవలం వంద రూపాయలకే ఆ విద్యుత్ ఇస్తానని మాటిస్తున్నా

కేవలం వంద రూపాయలకే ఆ విద్యుత్ ఇస్తానని మాటిస్తున్నా

Written By news on Thursday, April 3, 2014 | 4/03/2014

వెలుగుల వందనాలు
*   150 యూనిట్లలోపు విద్యుత్‌కు రూ.100 మాత్రమే
*   మిగతా భారం తామే భరిస్తామని    వైఎస్ జగన్  హామీ
*    1,75,86,000 కుటుంబాల్లో విద్యుత్ కాంతులు
*   పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారీగా తగ్గనున్న భారం
*  గత ఐదే ళ్లుగా ఎడాపెడా కరెంటు చార్జీలు పెంచేసిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు

 
 వందల్లో బిల్లు అయినా.. వందే చాలు...
 మేము అధికారంలోకి వచ్చాక ఏ పేద వ్యక్తీ ఇబ్బందులు పడక్కర్లేదు. రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు, ఒక టివి వాడితే 150 యూనిట్లు ఖర్చు అవుతుంది.
కేవలం వంద రూపాయలకే ఆ విద్యుత్ ఇస్తానని మాటిస్తున్నా.
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 కె.జి.రాఘవేంద్రారెడ్డి: కరెంటు బిల్లు లొల్లిని మర్చిపోయి ఇక నిశ్చింతగా ఉండొచ్చు! నెలనెలా వచ్చే బిల్లును చూసి గుండెలు గుభేల్ అనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు!! రాష్ట్రంలో విద్యుత్‌ను వాడే నూటికి తొంభై శాతం కుటుంబాలకు పెద్ద ఊరట కలగబోతోంది. రెండు ఫ్యాన్లు, ఒక టీవీ, మూడు లైట్లు, ఓ ఫ్రిజ్ ఉండే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఒక నెలలో 150 యూనిట్లలోపు కరెంటు వాడినట్లయితే రూ.100 చెల్లిస్తే చాలు.. మిగిలిన కరెంటు బిల్లు అంతా తామే భరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిస్తున్నారు.
 
 అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వందకే విద్యుత్’ పథకాన్ని అమలు చేస్తానని ఉద్ఘాటించారు. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారులందరూ ఇందులోకి రానున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా వారి కరెంటు బిల్లు బడ్జెట్ భారీగా తగ్గనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఎడాపెడా విద్యుత్ చార్జీలను పెంచారు. గతంలో చంద్రబాబు హయాంలో తొమ్మిదేళ్లలో ఏకంగా 8 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. నాటి బాబును స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ మరణం తర్వాతి ప్రభుత్వాలు వరుసగా ఐదేళ్లు ఐదుసార్లు విద్యుత్ చార్జీలను బాదేశారు.
 
88.32 % కుటుంబాలకు బేఫికర్!
 గత ఐదేళ్లుగా బాదుతున్న రెగ్యులర్ విద్యుత్ చార్జీలు, సర్దుబాటు చార్జీలతో రాష్ట్రంలో గృహ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఐదారు వందల వరకూ వస్తున్న నెలవారీ కరెంటు బిల్లును చెల్లిం చేందుకు వారం రోజులపాటు చేసిన రెక్కల కష్టాన్ని ధారపోయాల్సిన  పరిస్థితి నెలకొంది. అందుకే వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వందకే విద్యుత్’ పథకాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 1.99 కోట్లకుపైగా ఉంది. ఇందులో నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారుల సంఖ్య కోటి 75 లక్షల 86 వేలు. అంటే మొత్తం గృహ వినియోగదారుల్లో వీరి శాతం ఏకంగా 88.32 అన్నమాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ కేవలం రూ.100కే నెలవారీ కరెంటు లభించనుంది.
 
 రూ.611 ప్రస్తుతం కట్టాల్సి వస్తున్న మొత్తం
 ‘గత ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచలేదు... వచ్చే ఐదేళ్లూ పెంచబోం..’ 2009 ఎన్నికల ముందు వైఎస్ ఇచ్చిన హామీ ఇది. కానీ ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ హామీని తుంగలోకి తొక్కి చార్జీలు ఎడాపెడా పెంచేశాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా భారీగా చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్‌సీ కసరత్తు పూర్తి చేసింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. మే 20న కోడ్ ముగిసిన వెంటనే బాదుడు షురూ కానుంది. ఈ పెరగనున్న విద్యుత్ చార్జీల వల్ల నెలకు 150 యూనిట్లు వాడితే ఏకంగా రూ.611.50 (మొదటి 50 యూనిట్లకు రూ.3.10 చొప్పున రూ.155, 51-100 మధ్యలో యూనిట్‌కు రూ.3.75 చొప్పున రూ.187.50, 101 నుంచి 150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున రూ.269.. అంటే మొత్తం రూ.611.50) చెల్లించాల్సి రానుంది. జగన్ ప్రకటించిన ‘వందకే విద్యుత్’ పథకంతో ఇందులో కేవలం రూ.100 చెల్లిస్తే చాలు!!
 
 వైఎస్ స్ఫూర్తితో...
 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు 25 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఒక్క రైతులకే కాదు... గృహ, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపైనా వైఎస్ ఏనాడూ చార్జీలు పెంచలేదు. పైగా పరిశ్రమలకు చార్జీల భారాన్ని తగ్గించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారులపై విద్యుత్ సంస్థలు రూ.542 కోట్ల మేర సర్దుబాటు చార్జీలు మోపేందుకు ప్రయత్నించగా... అందుకు వైఎస్ ససేమిరా అన్నారు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా భరిస్తానని హామీనిచ్చారు. నాటి వైఎస్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సగటు గృహ వినియోగదారుడి కరెంటు భారాన్ని తామే భరిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు.
Share this article :

0 comments: