తెలంగాణ ప్రజలను మరువను: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ ప్రజలను మరువను: జగన్

తెలంగాణ ప్రజలను మరువను: జగన్

Written By news on Monday, April 28, 2014 | 4/28/2014

* సీమాంధ్రలో సీఎం అయినా.. తెలంగాణను వీడను
* ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే ప్రతి పథకాన్నీ ఇక్కడా అమలు చేయించడానికి కృషి చేస్తా
* నాడు ఓదార్పు చేయొద్దని సోనియా అన్నారు
* కేంద్ర మంత్రి పదవి, సీఎం పదవి ఇస్తానన్నారు
* కానీ మాట కోసం నిలబడి ఓదార్పు యాత్ర ప్రారంభించా..
* తెలంగాణ జిల్లాల్లో వైఎస్ జగన్ విసృ్తత ప్రచారం.. అడుగడుగునా ప్రజల అపూర్వ ఆదరణ
 
సాక్షి ప్రతినిధి, వరంగల్/ఖమ్మం/హైదరాబాద్: ప్రతి పేదవాడి గుండెల్లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా తాను ఓదార్పు యాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గరగా చూశానని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని, పేదోడి గుండె చప్పుడు వినే పార్టీ మేనిఫెస్టో రూపొందించానని చెప్పారు.

‘‘సీమాంధ్రకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచిపోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయించడానికి కృషి చేస్తాం. తెలంగాణలో ఆగిపోయిన ఓదార్పుయాత్రను నా చెల్లి షర్మిలమ్మ పూర్తి చేస్తారు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పెద్ద కుటుంబంలో భాగమైన తెలంగాణ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించం’’ అని పునరుద్ఘాటించారు.

‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ, పలు చోట్ల రోడ్ షో, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట, శేరిలింగంపల్లి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమాన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

పేదల గుండె చప్పుడే.. మా మేనిఫెస్టో
‘‘కొన్ని పార్టీలు ఏసీ రూముల్లో కూర్చుని మేనిఫెస్టోను రాసుకుంటే, నేను మాత్రం పేద ప్రజల గుండె చప్పుడుతో రాశాను. ఓదార్పుయాత్రలో భాగంగా ఇప్పటి వరకు 800 పూరిగుడిసెలకు వెళ్లి పేదల కష్టాలను తెలుసుకున్నాను. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశాను. నేను చూసింది, విన్నది, తెలుసుకున్నది, అర్థం చేసుకున్నదే మేనిఫెస్టోలో పెట్టాను. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ పంపిన సీల్డు కవర్ సీఎంలకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి? సీల్డు కవర్ సీఎం కావాలో.. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలి.

విశ్వసనీయత గల నేత కావాలో...
ఈ ఎన్నికల్లో నిజాయితీ, విశ్వసనీయత ఒకవైపు, కుట్రలు, కుతంత్రాలు మరొకవైపు పోటీపడుతున్నాయి. విశ్వసనీయతతో కూడిన వ్యక్తులకు ఓటేస్తారో.. లేక వెన్నుపోటుదారులను ఎన్నుకుంటారో ప్రజలే తేల్చుకోవాలి. దివంగత మహానేత వైఎస్సార్ మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నాడు. వారు పడుతున్న కష్టాలను స్వయంగా చూశాడు. పేదలకు ఏం కావాలో సీఎంగా ఆయన అదే చేశారు.

ఒకప్పుడు పేదవాడికి క్యాన్సరో.. గుండె నొప్పో వస్తే వైద్యం కోసం రెండు, మూడు లక్షలు అప్పు చేయాల్సి వచ్చేది.. ఆ తర్వాత వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది. అదే  వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఆగ్యోశ్రీ పథకంతో పాటు 108 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

కుటుంబంలో కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అయితే పేదరికం పోతుందనే ఆలోచనతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఏ సీఎం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు కేవలం 24 వేల మందికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఉండగా, వైఎస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇప్పించారు. 72 వేల మందికి కార్డులు ఇప్పించిన ఘనత వైఎస్‌దే.

చంద్రబాబుదో భయానక పాలన..
ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటున్న చంద్రబాబు ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో పేదల గురించి ఎందుకు ఆలోచించలేదు. ఏరోజూ పేదల జీవితాలు పట్టని చంద్రబాబు రాజకీయాలను దిగజార్చి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకోమాట, పూటకో అబద్ధం చెప్పి పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. వైఎస్ కన్నా ముందు చంద్రబాబు పాలన చేశారు. అదొకభయానక పాలన. ఏ రోజూ ఆయన పేదల పరిస్థితి గురించి ఆలోచించలేదు. కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థులు వేల రూపాయల ఫీజులు ఎలా కడుతున్నారని, ప్రతి సంవత్సరం ఏవో ఆస్తులు అమ్మితే తప్పించి చదువుకోలేకపోతున్నారని ఆలోచించలేదు.

కనీసం ఒక్కరోజయినా కాలేజీలకు వెళ్లి విద్యార్థులను విచారించలేదు. ఆ రోజుల్లో గ్రామానికి వెళితే ఎవరైనా పేదవాడికి గుండెపోటు వస్తేనో, ప్రమాదం జరిగితేనో ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడేవారు. ఆసుపత్రిలో చేర్పిస్తే రెండు లక్షలో, మూడు లక్షలో కట్టాలని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ డబ్బుల కోసం 2 నుంచి 5 రూపాయల వడ్డీకైనా తెచ్చుకునేందుకు పరుగెత్తిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు చాలా కీలకమైనవి. మీ తలరాతను మార్చే ఎన్నికలివి.. మీరు వేసే ప్రతి ఓటు ఎటువంటి పార్టీకి వేస్తున్నారు.. ఎటువంటి నాయకత్వానికి వేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ప్రశ్నించుకోవాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసి.. మళ్లీ వైఎస్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకుందాం.’’
 
మాట కోసమే ఇన్ని కష్టాలు, నష్టాలు..
‘‘నాన్న చనిపోయిన 20 రోజుల తర్వాత ఆ స్థలానికి వెళ్లా. అక్కడ పడి ఉన్న హెలికాప్టర్ ముక్కలు ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నాన్న కోసం చనిపోయిన వారి కోసం ఆలోచించా. మహా నేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తానని, ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తానని అక్కడే మాటిచ్చా. ఈ మాట కోసమే ఇప్పుడు ఇన్ని కష్టాలు, నష్టాలు.
 
సోనియా మంత్రి, సీఎం పదవులిస్తానన్నారు
అప్పుడు నేను, అమ్మ కలిసి సోనియాగాంధీ దగ్గరికి వెళ్లాం. ఓదార్పు యాత్ర వద్దన్నారు. అవసరమైతే జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం పెట్టి ఒకే చోట చేయమన్నారు. సోనియాగాంధీ కేంద్ర మంత్రి పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు. అప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి సోనియాగాంధీ చెప్పినట్లు చేయడం, రెండోది ఇచ్చిన మాట. అప్పుడు నా గుండెలో అనిపించినట్లు రెండో మార్గంలోనే పయనించా.
 
ప్రజల బాధలు దగ్గరగా చూశా
మహానేత కోసం మరణించిన వారిని పలకరించేందుకు బయలుదేరాను. నెలలో 25 రోజులు ఇంటి బయటే గడిపాను. ఏ నాయకుడూ వెళ్లని ఇళ్లకు వెళ్లాను. ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశాను. తిండికి లేని వారు ఉన్నారు. ఒక్కపూట మాత్రమే తినేవారు ఉన్నారు. వృద్ధాప్యంలో పూట గడిచేందుకు కూలీకి వెళ్లేవారిని గమనించా. గర్వంగా చెబుతున్నా.. ప్రజల బాధలు దగ్గరగా చూశా. పేదలు ఎంత అన్యాయమైన స్థితిలో ఉన్నారో గమనించా. పుట్టిన ఎవరైనా చనిపోక తప్పదు. ఇది జరిగే ముందు ప్రతి పేదవాడి గుండెల్లో నా ఫొటో ఉండాలి.
 
ఇంకా 400 కుటుంబాలకు వెళ్లలేకపోయా..
గిట్టని వారి కుట్రలతో జైలుకు వెళ్లడం, తెలంగాణ వంటి రకరకాల కారణాలతో ఓదార్పు పూర్తి చేయలేకపోయా. తెలంగాణలో ఖమ్మంలో మాత్రమే పూర్తి చేశా. ఇంకా 400 కుటుంబాలకు వెళ్లలేకపోయా. వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థులను, సాక్షి కుటుంబ సభ్యులను పంపించా. నా సోదరి షర్మిల ఓదార్పును పూర్తి చేస్తారు. మహానేత వైఎస్సార్ మృతి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబం దగ్గరికి నా సోదరి వస్తుంది. ఎన్నికల తర్వాత ఇది జరుగుతుంది. వైఎస్సార్ చనిపోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. మీకు అండగా ఉంటాం.’’
Share this article :

0 comments: