వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగాపొంగులేటి నామినేషన్

Written By news on Saturday, April 5, 2014 | 4/05/2014

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొంగులేటితో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పొంగులేటి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించారు.

 అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజన్న ఆశయ సాధన కోసమే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతాయని అన్నారు. గత నెల 5న ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ నేపథ్యంలోనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ప్రజలందరూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు బానోతు మదన్‌లాల్, యడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు నిరంజన్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా జిల్లా ప్రజలందరి అండదండలతో ముందుకెళ్తానని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమని ఆయన అన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న బాటలో నడుస్తున్న తనను జిల్లా ప్రజలు మరింతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తుండడం సంతోషకరమన్నారు. వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా   తెలంగాణ నుంచే ప్రారంభించేవారన్నారు.  జగన్మోహన్‌రెడ్డి కూడా పార్టీ తరఫున మొదటి అభ్యర్థిగా ఇదే మైదానం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ప్రకటించడం  తెలంగాణ అభివృద్ధి పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ ఏమిటో తెలియచేస్తోందన్నారు. అచంచల మనస్తత్వం ఉన్న వైఎస్.. జలయజ్ఞంతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

 గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో అనేక మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. పావలా వడ్డీ, పింఛన్లు ఇతర అనేక పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా వైఎస్ కృషి చేశారన్నారు. రాజన్న స్ఫూర్తితో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభ, 10శాసనసభ స్థానాలను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. వైఎస్సార్‌సీపీ గురించి ఛలోక్తులు విసిరే పార్టీలు తమ అభ్యర్థులెవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఆరు నెలల కిందే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న వైఎస్సార్‌సీపీతో నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించిన రాజన్న పథకాలను వైఎస్సార్‌సీపీ మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందన్నారు. నవ తెలంగాణలో ఇవి అత్యంత కీలకమని పొంగులేటి అన్నారు.

 శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రి
 అవుతారు: పాయం వెంకటేశ్వర్లు
 పొంగులేటి శీనన్నను గెలిపిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ కీలక ప్రాత్ర పోషిస్తుందన్నారు. గత నెల 5వ తేదీన ఖమ్మంలో జగన్ ప్రకటించినట్లు శీనన్న తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలన్నారు.

 పొంగులేటి గెలుపుతోనే జిల్లా అభివృద్ధి: కూరాకుల నాగభూషణం
 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు పడతాయని వైఎస్‌ఆర్‌సీపీ ఖమ్మం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగ భూషణం అన్నారు.  జిల్లాకు చెందిన పొంగులేటిని గెలిపించేందుకు అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేయాలన్నారు.

 కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ: ఎడవల్లి కృష్ణ
 రాజన్న ఆశయ సాధన కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ అన్నారు.  శీనన్న గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా కృషిచేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేస్తానన్నారు.

 రైతుబిడ్డ శీనన్నను ఆదరించాలి:  తాటి వెంకటేశ్వర్లు
 రైతుబిడ్డగా జన్మించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని  పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు.  శీనన్న ఖమ్మం ప్రతినిధిగా పార్లమెంటుకు వెళితే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. జగనన్న ఆశయ సాధన కోసం శీనన్నను గెలిపించాలన్నారు. తెలంగాణ ఎంపీల్లో పొంగులేటికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా నిలబెట్టాలన్నారు.

 జగనన్నకు కానుకగా ఇవ్వాలి:  మదన్‌లాల్
 పొంగులేటి శీనన్నను ఖమ్మం ఎంపీగా గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త మదన్‌లాల్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు వైరా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు.

 శీనన్న వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు: గుగులోత్ రవిబాబు నాయక్
 సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శీనన్న వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి శక్తిగా మారారని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ గుగులోత్ రవిబాబు నాయక్ అన్నారు.   శీనన్న గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.

 అన్ని వర్గాలు శీనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి: సాధు రమేష్‌రెడ్డి
 జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ మూడు జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త సాధురమేష్‌రెడ్డి అన్నారు. శీనన్నను గెలిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో కేంద్రమంత్రి అవుతారన్నారు. వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగించాలంటే యువనాయకులు జగనన్న, శీనన్నలతోనే సాధ్యమన్నారు.  

 ఖమ్మం జిల్లా జగన్ శీనన్న:  మెండెం జయరాజ్  
 ఏ పదవి లేకున్నప్పటికీ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెద్దమనసుతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న శీనన్న మనసున్న మారాజని, ఖమ్మం జిల్లా జగన్ శీనన్న అని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్  మెండెం జయరాజ్  అన్నారు.   శీనన్న రాజకీయాల్లోకి రావడం జిల్లా అదృష్టమన్నారు.   అందరి పట్ల ఆప్యాయంగా ఉండే శీనన్న గెలుపు జిల్లాకు అత్యవసరమన్నారు.

 ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శీనన్న: సయ్యద్ అక్రం అలీ
 నిరాండబరుడు, నిగర్వి అయిన శీనన్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రం అలీ అన్నారు.  అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే  మనస్తత్వం ఉన్న పొంగులేటి శీనన్న గెలుపు జిల్లాకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమన్నారు. పొంగులేటి గెలిస్తే ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం తథ్యం అన్నారు.

 జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటి: కీసర పద్మజారెడ్డి
 రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన రాజన్న కుటుంబానికి అండగా నిలిచిన శీనన్నను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

 అఖండ మెజారిటీతో గెలిపించాలి:  కొత్తగుండ్ల శ్రీలక్ష్మి
 జిల్లా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పొంగులేటి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని   మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శీనన్న కోసం వంద చొప్పున ఓట్లు వేయించాలన్నారు.

 సర్వమత ప్రార్థనలు..
 సభ అనంతరం ప్రదర్శనకు ముందుగా పొంగులేటిని మైదానంలో బ్రాహ్మణులు, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. శీనన్న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మండుటెండలోనూ మైదానానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, వట్టికొండ జగన్మోహన్‌రావు, సంపెట వెంకటేశ్వర్లు, కొంపల్లి బాలకృష్ణ, కొండలరావు, మార్కం లింగయ్య, ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, ఆరెంపుల వీరభద్రం, వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కందిమళ్ల బుడ్డయ్య, జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 జోరుగా నామినేషన్లు...
 ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు మూడోరోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఖమ్మం ఎంపీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఆరు స్థానాల్లో నామినేషన్లు బోణీ అయ్యాయి. . భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు మూడురోజులైనా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎంపీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఖమ్మం నగరానికి చెందిన బానోతు లక్ష్మానాయక్, కాంగ్రెస్ అనుబంధ సంఘమైన గాంధీపథం నుంచి బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం శాసనసభ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి.

 వాటిలో ఖమ్మం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరపున కూరాకుల నాగభూషణం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కర్నాటి హరీష్ సక్సేనా, కొత్తగూడెం నియోజకవర్గానికి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, మధిర నియోజకవర్గానికి సీపీఎం తరఫున  లింగాల కమల్‌రాజ్, పాలేరు నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా పోతినేని సుదర్శన్, వైరా నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ నుంచి తేజావత్ నరసింహారావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున భూక్యా బూదేష్, సత్తుపల్లి నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

 9న తుది గడువు...
 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఈనెల 9 చివరి తేదీ కావడంతో ఆ రోజు నామినేషన్లు అధికంగా దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 6న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణను నిలిపివేశారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం రిటర్నింగ్ అధికారుల నుంచి ఇప్పటికే నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ముహూర్తం చూసుకుని నామినేషన్‌లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానం జాబితా ప్రకటించిన వెంటనే  రిటర్నింగ్ అధికారులకు బీఫామ్‌లు అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీ టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేలా ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు, అఫిడవిట్‌లు సిద్ధం చేసుకుంటున్నారు.
Share this article :

0 comments: