బాబూ నీది ...సవతి కాంగ్రెస్సా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ నీది ...సవతి కాంగ్రెస్సా!

బాబూ నీది ...సవతి కాంగ్రెస్సా!

Written By news on Thursday, April 3, 2014 | 4/03/2014

బాబూ  నీది ...సవతి కాంగ్రెస్సా!
కాంగ్రెస్-చంద్రబాబు కుమ్మక్కుపై వైఎస్ జగన్ ధ్వజం
 
  పార్వతీపురం: ‘‘కుమ్మక్కు రాజకీ యాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కొన్ని విషయాలడగాలనుకుంటున్నా! నాడు రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కిరణ్ సర్కారుపై ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ప్రభుత్వం నిలబడడానికి 294 ఓట్లకు 148 ఓట్లు రావాల్సి ఉండగా 146 ఓట్లు మాత్రమే వచ్చినా.. ప్రభుత్వం నిలబడిందంటే నీ వల్ల కాదా చంద్రబాబూ? అవిశ్వాసానికి మద్దతివ్వొద్దని నీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాపాడింది నువ్వు కాదా? రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు మీ పార్టీ ఎంపీలను గైర్హాజరు చేయించి కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది నీవు కాదా? కుమ్మక్కు రాజకీయాలు మీరు చేసి నన్నంటారు పిల్ల కాంగ్రెస్ అని. నా వైపు ఒక వేలెత్తి చూపితే నాలుగు వేళ్లు మీవైపే ఉంటాయి.

చంద్రబాబూ నేనడుగుతున్నా.. కాంగ్రెస్‌ను కాపాడుతూ వస్తున్న మీది సవతి కాంగ్రెస్సా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ ద్దనున్న వైఎస్సార్ కూడలిలో ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో మాట్లాడారు. పార్వతీపురం స్థానంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మాన ప్రసన్నకుమార్‌ను ప్రకటించారు. ఈ సభలో ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

 చరిత్ర మార్చే ఐదు సంతకాలు!

 మరో 36 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రానున్నాయి. ఎలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకోవాలనుకుంటున్నామో.. ఒక్కసారి ఆలోచించండి. ప్రజల మనసెరిగి.. మరణించాక కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో.. అలాంటి నేతను ఎన్నుకోవాలి. చంద్రబాబు నాయుడులా అన్నీ ఉచితంగా ఇస్తానని నేను అబద్ధాలు చెప్పలేను. మరో రెండు మాసాల్లో మన ప్రభుత్వం వస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అదే వేదికపై, అదే ఘడియలో ఐదు సంతకాలు చేస్తాను. ఆ ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మారుస్తాను.
 
మొదటి సంతకం అక్కాచెల్లెళ్ల కోసం.. ఇవాళ అక్కా చెల్లెళ్ల పరిస్థితి ఎలా ఉందంటే కూలికి వెళ్తే రూ.100-150 వస్తుంది. దాంతో మూడు రోజులు తిండి దొరుకుతుంది. నాలుగోరోజు మళ్లీ పనికి వెళ్లాల్సిన దుస్థితి. అందుకే తమతోపాటు ఆరోతరగతి, ఏడో తరగతి చదువుతున్న తమ పిల్లలను కూడా పనికి తీసుకెళ్తున్నారు. ఏ అక్కాచెల్లీ బతకడం కోసం పిల్లలను పనికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా చేస్తా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపండి. వారిని ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో తీర్చిదిద్దే బాధ్యత నాది. ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ.1,000 నేరుగా అక్కా చెల్లెళ్ల బ్యాంకు ఖాతాల్లో వేస్తా. ఆ పిల్లలు పెద్దయ్యాక వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆసరాగా నిలవాలన్నదే అమ్మ ఒడి పథకం లక్ష్యం. దీంతోపాటు ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా.

అవ్వా, తాతల కోసం రెండో సంతకం.. ఇవాళ  వయస్సు, ఆరోగ్యం సహకరించకపోయినా.. వారు పనికి వెళ్తున్నారు. వీరిని పలకరిస్తే.. ‘నాయనా మీ నాయన వల్ల రూ.200 పింఛన్ వస్తుంది. ఇది ఒక్కపూట తిండికే వస్తుంది. మూడు పూటలా తినాలంటే పనులకు వెళ్లాలి కదా’ అంటున్నారు. అందుకే అవ్వా, తాతలకు ఓ మనవడిలా భరోసా ఇచ్చేలా రెండో సంతకం పెట్టబోతున్నా. పైనున్న మహానేత గర్వపడేలా వారికిచ్చే రూ.200 పింఛను రూ.700 చేస్తా.

 మూడో సంతకం రైతన్నల కోసం పెట్టబోతున్నా. వీరు పంటలు పండించినా మద్దతు ధర, గిట్టుబాటు ధర రావట్లేదు. అందుకే వారికి భరోసా ఇచ్చేలా రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడుతున్నా. ఇకపై ఏ రైతన్నా.. గిట్టుబాటు ధర కోసం బాధపడకుండా చేస్తా.
 నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసమే.. డ్వాక్రా రుణాలకు నెలవారీ వాయిదా రూ.2 వేలు కట్టడానికి అక్కాచెల్లెళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఠంచనుగా వాయిదా చెల్లించకపోతే బ్యాంకులు వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నాయి. ఈ వాయిదాలు చెల్లించుకోలేక పిల్లల్ని పనిలో పెడుతున్నారు. అమ్మ ఒడితో అక్కాచెల్లెళ్లకు జీవితాన్నిస్తున్నా. అదే సమయంలో నాలుగో సంతకంతో వీరికి కొత్త జీవితం ఇవ్వబోతున్నా. వారు తీసుకున్న డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేయబోతున్నా.

 ఇప్పటికీ ఏ గ్రామం, ఏ వార్డులోకి వెళ్లినా అన్నా నాకు రేషన్ కార్డు లేదు.. అన్నా నాకు పెన్షన్ రావట్లేదు.. మాకు ఆరోగ్యశ్రీ కార్డులేదంటున్నారు. అలాంటి వారందరికీ భరోసా ఇచ్చేలా ఏ కార్డు కోసమూ ఏ రాజకీయ నాయకుడి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. మీ గ్రామం, వార్డులోనే ఆఫీసు పెడ్తా. అక్కడ ఒక కంప్యూటర్ పెట్టిస్తా.. రెటీనా మిషన్, ప్రింటర్, లామినేషన్ మిషన్ పెట్టి 24 గంటల్లోనే కార్డు అందించేందుకు ఐదో సంతకం పెట్టబోతున్నా.

 ఆరు పనులతో అదనపు భరోసా

 మీ కోసం ఆరో పని చేయబోతున్నా.. వైఎస్సార్ మరణించాక రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటీ కొత్త ఇల్లు కట్టలేదు. ఆయన బతికున్నపుడు కేంద్ర ప్రభుత్వం  దేశం మొత్తం మీద 47లక్షల ఇళ్లు కట్టిస్తే, ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు వైఎస్. ఆ మహానేత పైనుంచి గర్వపడేలా.. చెప్తున్నా.. ఇపుడు 2014లో ఉన్నాం. 2019 నాటికి రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లి అడిగినా.. ఇల్లు లేని పేదవాడు లేకుండా ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తా.
 
ఏడో పనిగా మహానేత కలల పథకం ఆరోగ్యశ్రీని మెరుగుపర్చే కార్యక్రమం. ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలు తొలగించారు. ఏ పేషెంట్ అయినా ఆస్పత్రికి వెళ్తే  వైద్యులు హైదరాబాద్ వెళ్లిపోమంటున్నారు. ఇలాంటి సమస్యే లేకుండా ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి కడతా. పదేళ్లలో హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరాన్ని తయారుచేసుకుని 20 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కడతా. వీటన్నింటినీ కలిపి యూనివర్సిటీగా ఏర్పాటుచేస్తా.

 గ్రామంలో ఇంటికి వె ళ్లి కరెంట్ ఆన్ చేసినా.. ఉంటుందో లేదో తెలియదు. 6-8 గంటలు కోతలే. 2019నాటికి కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. రైతన్నకు ఏడు గంటల విద్యుత్ పగటి పూటే అందించేలా ఎనిమిదో పని చేస్తా. తొమ్మిదో పనిచేయబోతున్నా. ఇది చాలా అవసరం. గ్రామాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వ్యసనాలబారిన పడేలా బెల్టుషాపులున్నాయి. దీనివల్ల పిల్లలు చెడిపోతున్నారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తా. కేవలం నియోజకవర్గానికి ఒక్కటే దుకాణం ఉండేలా చేస్తా. అదికూడా రేట్లు షాక్ కొట్టేలా చేస్తా.
 గ్రామాల్లో చిన్నచిన్న ఇళ్లకు వె ళ్లినపుడు కరెంట్ బిల్లు చూస్తే.. ఏది కరెంట్ బిల్లో.. ఏది సర్‌చార్జీయో తెలియని పరిస్థితి. ప్రతి పేదవాడూ రూ.500-రూ.600 కట్టాల్సిన పరిస్థితి. అదికట్టలేక మీటర్ డిస్‌కనెక్టయి.. దొంగ విద్యుత్ పెట్టుకొని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వీరు నిర్భయంగా ఉండేలా.. రూ.100కే టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు, 150 యూనిట్ల విద్యుత్ వాడుకునేలా పదో కార్యక్రమం చేయబోతున్నా.

 చదువుకుంటున్న, చదువుపూర్తయిన విద్యార్థులకు ఉద్యో గం విషయంలో భరోసా ఇచ్చేలా పదో పని చేయబోతున్నా. చంద్రబాబులా నేను అన్నికోట్ల ఉద్యోగాలు ఇస్తా.. ఇన్ని కోట్ల ఉద్యోగాలిస్తా అంటూ అబద్ధాలాడలేను. గత నాలుగున్నరేళ్లుగా ఎండనక.. వాననక.. రాత్రనక.. పగలనక పడ్డ కష్టం మీకు తెలుసు. ఆ కష్టంతోనే చెప్తున్నా.. ఒక అన్నలా చదువుకున్నవారందరికీ ఉద్యోగ భరోసా కల్పించేందుకు అంతే కష్టపడతా.. దీన్ని 11వ పనిగా చేస్తా.’’
 
Share this article :

0 comments: