సాలూరు జనహోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సాలూరు జనహోరు

సాలూరు జనహోరు

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

సాలూరు జనహోరు
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లన్నీ రోడ్లపైకొచ్చాయి. చిన్నా- పెద్దా, మహిళా-యువత ఏకమై వచ్చి ఆపూర్వ ఆదరణ చూపించారు.  రహదారులన్నీ జనదారులయ్యాయి. రాజన్న తనయుడ్ని చూసేందుకు గ్రామాలు పరితపించాయి. మిద్దెలు, మేడలు ఎక్కాయి. జననేత జగన్ కోసం వచ్చిన  జన ప్రభంజనాన్ని చూసి భానుడు సైతం చిన్నబోయాడు. ప్రజాభిమానం పూలవానై కురిసింది. అభిమాన జనం తడిసి ముద్దయ్యింది. జనప్రవాహం మధ్య బొబ్బిలి నియోజకవర్గ రోడ్ షో సాగింది. తరలివచ్చిన అశేష జనంతో సాలూరు జనసంద్రమయ్యింది. జై జగన్ నినాదాలతో సాలూరు పట్టణం హోరెత్తింది. చంద్రబాబుపై సంధించిన విమర్శనాస్త్రాలతో వైఎస్‌ఆర్ జనభేరి బహిరంగ సభా ప్రాంగణం మార్మోగింది. ప్రజామోదమైన హామీలతో వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాకు జన స్పందన వెల్లువెత్తింది.
 
 ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల  వరకూ లెక్కచేయలేదు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చి, నుదుట కుంకుం దిద్ది, పూల వర్షం కురిపించి ముందుకు నడిపించారు. ఊరి పొలిమేరలో ఎదురేగి స్వాగతం పలికి సరిహద్దు గ్రామం వరకు వెంట సాగారు. కేరింతలు కొడుతూ వైఎస్సార్ పతాకాలతో ముందుకు సాగారు. జననేత రాకతో అభిమానుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. డప్పుల మోతలు, నేల డ్యాన్సులు,  బాణసంచా కాల్పులతో తమ అభిమాన నేతకు నీరాజనం పలికారు. గంటల తరబడి వేచి చూసి చివరకు  ఆప్యాయతలను అందించారు. వైఎస్‌ఆర్ జనభేరి ఎన్నికల ప్రచారంలో  భాగంగా మంగళవారం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో  వైఎస్ జగన్‌మోహన్‌రెడి రోడ్ షో నిర్వహించారు.
 
 అభిమాన జనసంద్రం మధ్య ఎక్కడికక్కడ ఆగి ఆత్మీయతలను అందుకున్నారు. గ్రామాల్లో పూలవర్షం కురిపించి, భారీ పూల దండలు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. అడుగడుగునా పూలను జల్లుతూ, జగన్ నడిచే దారిలో వేస్తూ పండగ వాతావరణాన్ని తలపించారు. ముందుగా బొబ్బిలి కోట నుంచి రోడ్‌షో మొదలైంది. కోట ప్రాంగణానికే వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం గ్రోత్‌సెంట రు, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, పారాది వరకు రోడ్‌షో సాగింది. దారి పొడవునా అభిమాన నేతకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారితో ఆయా ప్రాంతాలన్నీ జాతరను తలపింప జేశా యి. ఇక   శిష్టిసీతారాంపురం, రొంపల్లిలోనైతే ఎంత చెప్పినా తక్కువే. గ్రామం పొడవునా ప్రజలు బారులు తీరి  చెక్కు చెదరని ఆదరణతో  అక్కున చేర్చుకున్నారు. అడుగు కూడా వేయలేని విధంగా జనాలు రోడ్డుపైకొచ్చారు. 
 
 జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. హారతులు పట్టేందుకు మహిళలు పోటీ పడ్డారు.   ఇక రామభద్రపురమైతే కిక్కిరిసిపోయింది. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్‌కు వచ్చిన దానికన్న ఎక్కువ జనం వచ్చారని చర్చించుకోవడం కన్పించింది. విజయనగరం,  పార్వతీపురం, సాలూరు రోడ్లన్నీ జనంతో పోటెత్తాయి. ఎక్కడా చూసినా జనమే ఉండడంతో రామభద్రపురం దాటడానికి రెండు గంటల సమయం పట్టేసింది.  ఇక బొబ్బిలి నుంచి రామభద్రపురం చేరేలోపు అనేకమంది జగన్‌ను కలిసి  తమ అభిమానాన్ని చూపించారు. అలాగే తమ గోడును వెళ్లగక్కారు. బొబ్బిలి కోటలో  స్వప్న అనే యువతి జగన్‌కు రాఖీ కట్టి సోదరి ప్రేమను చాటుకున్నారు. ఇదే యువతి బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద మరోసారి తన కుమారుడు మోనీష్‌తో పాటు జగన్‌ను కలిశారు. ‘ కాబోయే సీఎం ఎవరు, మన గుర్తు ఏమిటి ’ అని అడిగి  జగన్‌కు ఎదురుగా తన కొడుకుతో చెప్పించారు. మెట్టవలస గ్రామం వద్ద వైఎస్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె చికిత్స చేయించుకున్న కృష్ణారావు జగన్‌ను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. రొంపల్లి గ్రామంలో పువ్వల వెంకటరమణ భారీ పూలమాలను వేశారు. ఆయా గ్రామల్లో  కాబోయే సీఎం జగన్ అంటూ యువత నినాదాలు చేశారు. 
 
 కొంత మంది క్రైస్తవులు వచ్చి ప్రార్థనలు నిర్వహించారు. పారాది వంతెన దాటాక హైస్కూలు విద్యార్థులు జగన్‌తో కరచాలనం చేయడానికి క్యూ కట్టారు. జగన్ ఆత్మీయ స్పర్శ తగిలిన తరువాత చాలా మంది వృద్ధులు కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను సుజయ్, బేబీనాయనలు పరిచయం చేశారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డి ముఖంపై చెమట పట్టడంతో శిష్టిసీతారాంపురంలో ఓ మహిళ చెంగుతో చెమటను తుడిచింది. ఇక్కడే కొద్ది నెలల క్రితం జరిగిన దాడిలో తీవ్రంగా గాయాలపాలైన  వైఎస్సార్ సీపీ కార్యకర్తలను దగ్గరకు తీసుకుని, బాసటగా నిలిచి, మనోధైర్యాన్నిచ్చారు.  అలాగే పారాది వద్ద గేదెల సింహాచలం  అనే మహిళ జగన్‌ను కలిసి బెల్ట్‌షాపులను తీసేయమని కోరింది.   ఆతర్వాత  తారాపురం, కొట్టక్కి మీదుగా రోడ్‌షో సాగింది. తామేమీ తక్కువ కాదన్నట్లు ఈ గ్రామాల ప్రజలు కూడా రోడ్డుపైకొచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలికి, అభిమానాన్ని చూపించారు.
 
 జనహోరు సాలూరు 
 పదేళ్లకొకసారి జరగనున్న శ్యామలాంబ జాతర ముందే వచ్చిందా అన్నట్టు మంగళవారం జన ప్రభంజనం సాగింది. నేల ఈనిందా అన్నట్టు పోటెత్తిన జనజాతరలో జై జగన్ నినాదాలతో  పట్టణమంతా హోరెత్తింది. తరలివచ్చిన అభిమానులతో   వీధులన్నీ కిటకిటలాడాయి. రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారితో అడుగు కూడా పక్కకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సాలూరులో జగన్ ప్రవేశించిన దగ్గరి నుంచి వైఎస్సార్ జనభేరి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు మూడు గంటలు సమయం పట్టిందంటే జనసమ్మర్థం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ ప్రసంగం కూడా వాడీవేడిగా సాగింది.  చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలనను గుర్తు చేస్తూ,ఆచరణ సాధ్యమైన హామీలు ఇస్తూ ఆకట్టుకున్నారు.  మధ్యలో వైఎస్సార్ సేవలను కొనియాడారు. మొత్తానికి ప్రసంగం అద్యంతం కరతాళ ధ్వనులతో సాలూరు హోరెత్తింది. 
 
 కాగా, సభలో చివరిగా అరుకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక రాజన్నదొరను జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రచార యాత్రలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు, విజయనగరం, అరుకు పార్లమెంట్ అభ్యర్థులు బేబీనాయన, కొత్తపల్లి గీత, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర, పార్టీ సమన్వయకర్తలు గురాన అయ్యలు, జమ్మాన ప్రసన్నకుమార్, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, పార్టీ నాయకులు గొర్లె మధుసూదనరావు, జర్జాపు ఈశ్వరరావు, జర్జాపు సూరిబాబు,  పక్క జిల్లాల నేతలు వరుదు కళ్యాణి, బల్లాడ హేమమాలినిరెడ్డి, బల్లాడ జనార్దన్‌రెడ్డి,  గండి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.  
 
Share this article :

0 comments: