అభిమాన జనసంద్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమాన జనసంద్రం

అభిమాన జనసంద్రం

Written By news on Wednesday, April 16, 2014 | 4/16/2014

ప్రభంజనం
పులకించిన పల్లెలు
 ఎండ వాయిస్తోంది.. కనుచూపు మేర జనం.. జననేతను దగ్గర నుంచి చూడాలని కొందరు.. మాట కలపాలని మరికొందరు.. విద్యార్థులు, వృద్ధులు, యువకులు.. ఎవరి తాపత్రయం వారిది. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జననేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుత్తి మొదలు.. పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ మీదుగా ఆత్మకూరు వరకు అడుగడుగునా.. ఊరూరా మహిళలు, చిన్నారులు చేతులూపుతూ.. కేకలు వేస్తూ ఘన స్వాగతం పలికారు.
 
 ఉరవకొండ సభలో మంగళవారం రాత్రి అశేష ప్రజానీకానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ఇన్‌సెట్‌లో) వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను చూపుతున్న జగన్
 
 కన్నబిడ్డే ఇంటికి వచ్చినట్లు బాధలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టిన అమ్మలు.. బువ్వ పెట్టే మనవడు వచ్చాడని పొంగిపోయిన వృద్దులు.. పంటలకు ప్రాణం పోసే మారాజే వచ్చాడని మురిసిన రైతులు.. చదువులు చెప్పించే అన్నయ్యేనంటూ ఆప్యాయంగా చెంతకు చేరిన విద్యార్థులు.. కష్టాలు తీర్చే నేత వచ్చాడంటూ పొలాల నుంచి పరుగుపరుగున వచ్చిన కూలీలు.. ప్రాణాలకు విలువనిచ్చే ప్రజాధినేత కరస్పర్శతో పులకించిన బాధతప్త హృదయాలు.. రుణవిముక్తి ప్రదాతంటూ భావోద్వేగానికి గురైన ఐకేపి మహిళలు..నీవెంటే మేమున్నామంటూ చేయిపట్టి ముందుకు సాగిన యువతరం.. ఇలా జననేతను చూడటానికి ప్రభంజనమై కదిలిన జిల్లా ప్రజలకు భగ.. భగలాడే మండు టెండ సైతం మలయమారుతమనిపించింది.
 
 సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల  ప్రచారానికి వచ్చిన జననేత, రాజన్న ముద్దుబిడ్డ, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. జన హృదయ స్పందనను చూసి చలించిపోయిన వైఎస్ జగన్ సమయాన్ని సైతం పట్టించుకోకుండా వారితో మమేకమయ్యారు. అవ్వ.. తాతా.. అమ్మా.. నాన్న.. అక్కయ్యా.. తమ్ముడూ.. అంటూ ఆప్యాయంగా పలకరించారు.

జగనన్నా అంటూ అభిమానం చూపిన చెల్లెల్లు, తమ్ముళ్లకు అనురాగం పంచారు. వారందరికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ప్రతిగా మన పార్టీకే ఓటేస్తాం.. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం..అంటూ ప్రజలతంతా జననేత చేతిలో చేయ్యేసి ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు.
 
 అభిమాన జనసంద్రం మధ్య ఎక్కడికక్కడ ఆగి ఆత్మీయతలను అందుకున్నారు. గ్రామాల్లో పూలవర్షం కురిపించి.. భారీ పూలదండలు వేసి.. వారి అభిమానాన్ని చాటుకున్నారు. అడుగడునా పూలను చల్లుతూ పండుగ వాతావరణనాన్ని తలపించారు. ముందుగా గుత్తి పట్టణం నుంచి రోడ్‌షో మొదలైంది. తొలుత జగన్ బస చేసిన బుస్సా సుధీర్‌రెడ్డి ఇంటి నుంచి ఉదయం 10గంటలకు రోడ్డుషో ప్రారంభించారు. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న గాంధీచౌక్ సర్కిల్‌కు మధ్యాహ్నం 12.15గంటలకు చేరుకున్నారు. షెడ్యూల్ సమయాని కన్నా దాదాపు మూడు గంటల పాటు ఆలస్యంగా వచ్చినా ప్రజలు జననేత కోసం వేచి ఉన్నారు. జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారితో గుత్తి పురవీధులు జనజాతరను తలపించాయి. జగన్ ప్రసంగం కూడా వాడీ.. వేడిగా సాగింది.
 
 చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానకపాలనను గుర్తు చేస్తూ.. ఆచరణ సాధ్యమైన హామీలు ఇస్తూ ఆకట్టుకున్నారు. మధ్యలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పరిచయం చేశారు. మీ పిల్లలను బడులకు పంపండి.. వారిని ఇంజనీర్లుగానూ, డాక్టర్లుగానూ చేసే బాధ్యతను నేను చూసుకుంటానని జగన్ అన్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. సీఎం అంటే ఎలా ఉండకూడదు అని జగన్ ప్రజలను ప్రశ్నించగాచంద్రబాబు లా అని.. సీఎం అంటే ఎలా ఉండాలని ప్రశ్నించగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలా అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. అక్కచెల్లెళ్లను రుణ విముక్తులుగా చేసేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసేందుకు నాల్గో సంతకం పెడతానని జగన్ అన్నప్పుడు మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.  
 
 పోటెత్తిన పామిడి
 గుత్తి నుంచి మొదలైన రోడ్‌షో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల..రామరాజుపల్లి, మిడుతూరు, పొగరూరు, గజరాంపల్లి మీదుగా పామిడి వరకు సాగింది. దారి వెంబడి నిలుచున్న జనం విషయంపై ఎంత చెప్పినా తక్కువే. గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు జననేతను చూడగానే జై..జగన్.. జైజై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. అన్నా.. నీవే సీఎం.. నీకు తిరుగులేదు.. మా విద్యార్థుల ఓట్లు అన్నీ నీకే అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున కేకలు.. ఈలలు వేస్తూ చెప్పారు. అనంతరం జగన్‌తో కరచాలనం కోసం విద్యార్థులు ఎగబడ్డారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులను చూసిన జగన్ పులకించిపోయారు. ఆయా గ్రామాల వద్ద రోడ్లపై ప్రజలు బారులు తీరి ఘన స్వాగతం పలికారు. హారతులు పట్టేందుకు మహిళలు పోటీపడ్డారు. ఎక్కడ చూసినా జనమే ఉండడంతో పామిడికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్నారు. అప్పటికే పామిడి రోడ్లపై పోటెత్తిన జనసందోహంతో.. వీధులన్నీ కిక్కిరిసిపోయారు.
 
 మూడు కిలోమీటర్లు దాటడాడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందంటే జనం ఏమేరకు తరలివచ్చారో అర్థం చేసుకోవచ్చు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు జగన్ తన వాహనం నుంచి అభివాదం చేస్తూ..మరికొన్ని చోట్ల కిందకు దిగి..ప్రజలను ప్రేమగా పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి ఎద్దుల పల్లిమీదుగా రాత్రి 9గంటలకు ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రక రూరుకు చేరుకున్న జగన్.. సమయాభావం వల్ల ప్రజలకు అభివాదం చూస్తూ ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో వజ్రకరూరు జనజాతరను తలపించింది.
 
 ఉరవకొండలో జనహోరు
 ఉరవకొండలో జాతర జరుగుతోందా అన్న రీతిలో జన ప్రభంజనం కనిపించింది. జై జగన్ నినాదాలతో ఉరవకొండ హోరెత్తింది. తరలివచ్చిన అభిమానులతో వీధులన్నీ కిటకిటలాడాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉరవకొండలో బహిరంగ సభ జరగాల్సి ఉండగా, దాదాపు 7గంటలు ఆలస్యంగా అంటే రాత్రి 9:55 గంటలకు జగన్ ఉరవకొండ చేరుకున్నారు. అయినప్పటికి మధ్యాహ్నం 1గంటలకే ఉరవకొండకు చేరుకున్న జనం రాత్రి వరకు జననేతకు కోసం వేచిఉన్నారు.
 
 జననేత ఉరవకొండకు చేరుకోగానే వేల గొంతలు ఒక్కసారిగా జై..జగన్ అంటూ నినదించడంతో ఉరవకొండ వీధులు దద్దరిల్లిపోయాయి. ఇక జగన్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలను గెలిపించాలని జగన్ ప్రజలను అభ్యర్థించినపుడు ప్రజలు ఆ విషయం మాకొదిలేయండి.. ఇద్దరినీ గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి కూడేరు మీదుగా ఆత్మకూరు.. అక్కడి నుంచి కళ్యాణదుర్గం చేరుకున్నారు. అయితే సమయాభావం వల్ల కూడేరు, ఆత్మకూరులో జగన్ మాట్లాడలేకపోయారు.
 
కేవలం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల అభ్యర్థులు వై.వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సీఈసీ సభ్యులు పైలా నరసింహయ్య, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యూత్ నాయకుడు శ్రీనాథ్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్‌సెల్ సభ్యుడు అశోక్‌కుమార్, రిటైర్డ్ డీఎస్పీ వన్నూర్‌సాబ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయసుశీలమ్మ, నిఖిల్‌నాథ్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: