వైయస్ఆర్ సి‌పి లో చేరికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైయస్ఆర్ సి‌పి లో చేరికలు

వైయస్ఆర్ సి‌పి లో చేరికలు

Written By news on Tuesday, April 8, 2014 | 4/08/2014

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి
వైఎస్ విధానాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరా: దినేశ్
ఆర్టీసీ కార్మికుల తరఫున సంపూర్ణ మద్దతు: మహమూద్

 
హైదరాబాద్: రాష్ట్ర మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన సోమవారం పెద్ద సంఖ్యలో అనుచరులు, మిత్రబృందంతో సహా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించారు. దినేశ్‌రెడ్డికి జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం దినేష్ మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలకు ఆకర్షితుడనై ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పారు. వైఎస్ పేదలపాలిట పెన్నిధిగా సామాన్య ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేయాలని నిరంతరం తపనపడే వారని, ఆయనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని తానని తెలిపారు.

వైఎస్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. జగన్ మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకడినని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధమేనని తెలిపారు. 36 ఏళ్ల తన పోలీసుశాఖ సర్వీసులో అనేక కీలకమైన పదవులను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించానని చెప్పారు. దీర్ఘకాలంపాటు రాష్ట్ర పోలీసు అధిపతిగా పనిచేశానని, తన సర్వీసులో ఎన్నో సంస్కరణలు తేగలిగానని తెలిపారు. వైఎస్ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులను వారంలో 24 గంటలూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన విధంగానే తాను వారంలో 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు. పోలీసు సంక్షేమానికి కూడా అనేక చర్యలు తీసుకున్నానని తెలిపారు.

జగన్‌పై మోపిన అవినీతి ఆరోపణలు, కేసుల విషయంలో మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘‘జగన్‌పై మోపినవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఏమీ రుజువు కాకుండా ఆయనను అవినీతిపరుడనడం అన్యా యం. ఆరోపణలనేవి ఎవరి మీదైనా చేయొచ్చు... నీ మీద కూడా చేయొచ్చు... దారిన పోయే దానయ్య మీద కూడా చేయొచ్చు. ఒక వ్యక్తిపై ఆరోపణలు చేసినంత మాత్రాన అతను తప్పు చేసినట్లు కాదు. రుజువయ్యేంత వరకూ వాటిని పరిగణనలోకి తీసుకోకూడదు. రుజువు కాని ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని జగన్‌కు అంటగట్టడం చాలా దారుణం, గలీజైన విషయం, జగన్‌పై రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ కుట్రలతో ఈ ఆరోపణలు చేశారు’’ అని దినేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కోర్టులో ఉన్న విషయాలపై ఈ దశలో ఇంకా చర్చించడం మంచిది కాదన్నారు.

మహమూద్ చేరిక

ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ వైఎస్సార్‌సీపీలో చేరారు. దినేశ్‌రెడ్డితో పాటు ఆయన కూడా జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... నష్టాలతో చతికిల పడిన ఆర్టీసీకి జీవం పోసిన మహనీయుడు  వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఆయన మాదిరిగానే ఈ సంస్థను నిలబెడతానని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని జగన్ చెప్పారని వివరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. జగన్‌కు తాము ఆర్టీసీ కార్మికుల తరపున సంపూర్ణ మద్దతునిస్తామని చెప్పారు.
 
ఎస్ వల్ల నా కుమార్తె డాక్టరైంది

వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఫలితంగా తన కుమార్తెకు మెడిసిన్‌లో సీటు వచ్చిందని మహమూద్ చెప్పారు. తన కుమార్తె ఇపుడు ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసి గాంధీ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోందన్నారు. ఇలా ఎందరో ముస్లింలు వైఎస్ వల్ల పెద్ద చదువులు చదవగలిగారని ఆయన చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ గోపీనాథ్ వైఎస్సార్‌సీపీలో చేరిక


 చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.గోపీనాథ్, ఆయన కుమారుడు ఆర్.రూపేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్, ఆయన కుమారుడు ఇద్దరికీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. గోపీనాథ్ 1985కు ముందు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.

 జగన్‌ను కలిసిన పార్థసారథి, కారుమూరు

జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి కె.పార్థసారథి, తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు సోమవారం కలుసుకున్నారు. వీరిద్దరూ జగన్‌తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
 
మల్కాజ్‌గిరి లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దినేశ్‌రెడ్డి
 
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ డీజీపి వి.దినేష్‌రెడ్డి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఈ నెల 9వ తేదీన తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు దినేష్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
Share this article :

0 comments: