ప్రజలు ఏకపక్షంగా తీర్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు ఏకపక్షంగా తీర్పు

ప్రజలు ఏకపక్షంగా తీర్పు

Written By news on Thursday, May 8, 2014 | 5/08/2014

కెరటంలా తీర్పు
 ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు: జగన్
 చంద్రబాబు మోడీ కోసం ఓటడిగారు..
 నేను సీమాంధ్ర భవిష్యత్తు కోసం ఓటడిగాను
 కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మనమిచ్చే
 ఆక్సిజన్‌పైనే బతికే పరిస్థితి రాబోతోంది
 రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే వారికే కేంద్రంలో మద్దతిస్తాం
 కక్షగట్టిన వారితో నాలుగున్నరేళ్లుగా ఒంటరి పోరాటం చేశా.. ఆ పోరాటానికి
 ఈ ఎన్నికల్లో తీర్పు రాబోతోంది

 
 సాక్షి, కడప: ‘‘దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఈ రెండూ మెండుగా నాకున్నాయి. సీమాంధ్రలో తీర్పు ఓ కెరటంలా ఉండబోతోంది. ఏకపక్షంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ‘‘నేను మొదటి నుంచీ బహిరంగ సభల్లో చెబుతున్నాను. ఢిల్లీకి సాగిలపడేలా చంద్రబాబు నరేంద్ర మోడీకి ఓట్లు వేయాలని అడిగారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఓట్లు వేయాలని అడిగాను. ఢిల్లీలో మనం అడిగిన పనులు చేసే వారికే మద్దతు ఉంటుంది. కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా మన దగ్గరకు రాక తప్పదు.. ఆ సంఖ్య మనకు వస్తుంది. మనమిచ్చే ఆక్సిజన్‌పైనే కేంద్ర ప్రభుత్వం బతికే పరిస్థితి ఉంటుంది’’ అని స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం పులివెందులలోని స్వగృహంలో జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా బయటకొచ్చి ఓటేయడంతో 75 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందన్నారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాలుగున్నరేళ్లపాటు నాతో నడిచిన ప్రతి కార్యకర్త, నాయకులు, అక్క, అవ్వ, చెల్లి, సోదరులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా పోరాటానికి ఈ ఎన్నికల్లో తీర్పు రాబోతోంది. నా వెంట నడిచిన మీకందరికీ చేతులు జోడించి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’’ అని అన్నారు.
 
 చంద్రబాబు అదే పనిగా గొడవలు సృష్టించారు..
 
 ‘‘చంద్రబాబు నాయుడు పోలింగ్ శాతం తగ్గించేందుకు అదే పనిగా గొడవలు సృష్టించారు. జమ్మలమడుగు ప్రాంతంలో దేశం నాయకులను ప్రోత్సహించారు. అక్కడ టీడీపీ నిబంధనలు ఉల్లంఘించింది. ఆ ఊరిలోని వ్యక్తినే ఏజెంట్లుగా ఉంచాలని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ బలవంతంగా అక్కడికి వేరే వ్యక్తులను తీసుకుపోవడం వల్లనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. మైదుకూరులో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే దాన్ని ఆపేందుకు వెళ్లిన అభ్యర్థి రఘురామిరెడ్డి కారుపై రాళ్లు వేసి అద్దాలు పగులగొట్టారు’’ అని జగన్ టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. ‘‘చంద్రబాబు కావాలనే ఈ ప్రయత్నం చేశారు. రెండు నెలలుగా ‘ఈనాడు’ దారుణంగా రాతలు రాస్తోంది. దీంతోపాటు నాపై ఎందరో కక్షగట్టి వే ధించారు. అందరితో ఒంటరి పోరాటం చేశాను. ఇంతమంది ఒకవైపు, నేను ఒక్కడిని మరోవైపు నిలిచాను. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రజలు కెరటంలా లేశారు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు నాకు అండగా ఉన్నాయి’’ అని అన్నారు.
 
 మన రాష్ట్రంతో ఆటలాడుకున్నారు..
 
 రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అతి దారుణంగా విభజన బిల్లు తీసుకొచ్చింది. దారుణమని తెలిసి టీడీపీ, బీజేపీ నేతలు మద్దతిచ్చారు. మన రాష్ట్రంతో ఆడుకున్నారు. కొన్ని రోజుల్లో పదవి దిగిపోయే ప్రధాని ఓ లెటర్ చదివి వినిపించారు. ఆ లేఖలో అంశాలు కనీసం బిల్లులోకి రాలేదు. హైదరాబాదును సీమాంధ్ర నుంచి వేరు చేశారు. కొత్త రాజధానికి ఇంత డబ్బు ఇస్తామని చెప్పలేదు. హైదరాబాదు నుంచే 75 శాతం వ్యాట్‌తోపాటు రాష్ర్ట ఆదాయంలో 60 శాతానికి పైగా అక్కడి నుంచే వస్తుంది. అలాంటి హైదరాబాద్‌ను మనకు కాకుండా చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అది ఏరకంగా ఉంటుందో? దాని ప్రయోజనాలేంటి? ఎన్ని సంవత్సరాలు ఉంటుందో స్పష్టంగా చెప్పలేదు’’ అని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా, కేంద్రం దిగివచ్చేలా, మనకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చేలా ఏకపక్షంగా తీర్పు ఉండబోతోందన్నారు.
Share this article :

0 comments: