హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’

హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’

Written By news on Monday, May 26, 2014 | 5/26/2014

బాబుకు ఎల్లో మీడియా వంతవీడియోకి క్లిక్ చేయండి
* బాబు హామీలను మైమరిపించడమే లక్ష్యం
హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’
 
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చంద్రబాబు ప్రజల్లో చులక కాకుండా చూసేందుకు ఎల్లో మీడియా అప్పుడే రంగంలోకి దిగింది. బాబు త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఆచరణ సాధ్యం కానీ హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ, చుట్టుముట్టబోయే అపకీర్తి బారి నుంచి ఆయనను కాపాడటానికి తనదైన రీతిలో వంచనకు తెర తీసింది. ఒక మీడియాగా ఎన్నికల హామీలను నిలుపుకోవాలంటూ ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి బాబును కాపాడే ప్రయత్నంలో నిమగ్నమైంది.

బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తూ బాబు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుంటే... ఈ ఎల్లో మీడియా అందుకు వంత పాడుతుండటం పక్కా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. చంద్రబాబు తానిచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలను ఏమార్చడమే తక్షణ కర్తవ్యంగా ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది. టీడీపీకి వంతపాడుతున్న ‘ఈనాడు’ సరిగ్గా 1997లో సంపూర్ణ మద్యనిషేధం ఎత్తివేత సందర్భంలో చేసిన మాదిరిగానే ఇప్పుడూ కథ నడుపుతోంది.

మద్య నిషేధం ఎత్తివేత తరహాలోనే..
1995లో దూబగుంటలో ఒక మహిళ ప్రారంభించిన సంపూర్ణ మద్య నిషేధ సామాజిక ఉద్యమాన్ని తన భుజానికెత్తుకున్న ‘ఈనాడు’ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్నే కొనసాగించింది. ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసేదాకా దాన్ని కొనసాగించింది. తీరా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకోగానే అదే ‘ఈనాడు’ కొత్త పాట మొదలుపెట్టింది. సంపూర్ణ మద్య నిషేధంతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ నాలుక మడతేసింది. ఆ మేరకు రోజూ పుంఖానుపుంఖాలుగా కథనాలను వండి వార్చింది. మద్య నిషేధాన్ని ఎత్తేస్తే తప్ప రాష్ట్రానికి దిక్కు లేదంటూ దిక్కుమాలిన ప్రచారంతో బాబు పనిని సులభతరంచేసింది.

‘విధిలేకే చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నారు’ అన్న దశకు తీసుకొచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం వల్ల ఖజానాకు రూ.1,400 కోట్ల లోటు ఏర్పడుతోందని, ఆ డబ్బే ఉంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చని నానా కథలూ అల్లింది. అలా సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసేదాకా తనరాతలను కొనసాగించింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే మాదిరి కథ మొదలుపెట్టింది. ఇటీవలి ఎన్నికల్లో బాబు అలవికాని హామీలెన్నో ఇచ్చినా వాటన్నింటికీ ‘ఈనాడు’ పూర్తిగా వత్తాసు పలికింది. బాబు సీఎం అయితేనే ఆ హామీలు సాధ్యమవుతాయంటూ పేజీలకు పేజీలు రాతలు రాసింది. ఆయన చెబుతున్న రైతుల రుణాల మాఫీ సాధ్యమేనంటూ రోజూ రాస్తూ వచ్చింది.

అవేగాక డ్వాక్రా మహిళల రుణాల రద్దు, నిరుద్యోగ భృతి, ఇంటింటికో ఉద్యోగం, పెన్షన్ల వంటివన్నీ బాబు అమలు చేస్తారంటూ కథనాలు వండివార్చింది. అవిఆచరణ సాధ్యం కావని ఎవరైనా అంటే అంతెత్తున లేచింది. ఏం చేసైనా సరే, బాబును అధికార పీఠం ఎక్కించడమే ఏకైక అజెండాగా, ఫక్తు టీడీపీ పత్రిక స్థాయిలో బాకా ఊదింది. ఇప్పుడు బాబు అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇదే ‘ఈనాడు’ మరోసారి అచ్చం ఆనాటి తరహాలోనే ఆయనను హామీల గండం నుంచి గట్టెక్కించే పనిలో పడింది.

‘తొలి అడుగులు ఇబ్బందే...’ అంటూ ఒక రోజు, ‘బాబు ముందు ఎన్నో ఇబ్బందులున్నాయి’ అంటూ మరో రోజు... ఇలా రోజుకోటి చొప్పున కథనాలను వండి వారుస్తోంది. అలా తన వ్యూహాన్ని మెల్లిగా తెరపైకి తీసుకొస్తోంది. బాబు ఎటూ తానిచ్చిన హామీలనూ నెరవేర్చలేరు గనుక అనేకానేక సమస్యలే అందుకు కారణమంటూ ఇప్పటి నుంచే పాఠకుల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు టీడీపీ చేస్తున్న నిస్సిగ్గు కుట్రలను కూడా అడ్డంగా సమర్థిస్తోంది. ‘వైఎస్సార్‌సీపీ నుంచి నేతలు జారుకుంటున్నారు’ అంటూ వాస్తవాలకు పచ్చ ముసుగేసి ఈనాడు సారథ్యంలోని ఎల్లో మీడియా ప్రచురిస్తోంది, చూపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తొమ్మిదో రోజునే ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బాబు తలవంపుల వ్యవహారాన్ని అదేదో గొప్ప విజయమన్నట్టుగా అభివర్ణిస్తున్నాయి. టీడీపీలోకి మరికొందరు వెళ్లనున్నారన్న ఆ పార్టీ నేతల మైండ్‌గేమ్‌కు కూడా తెగ ప్రచారం కల్పిస్తున్నాయి. హామీల అమలులో విఫలమయ్యే వేళ బాబుకు పలుగురాళ్లతో నలుగు పెట్టడానికి వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉండకూడదనే కుటిలత్వంతో, ప్రజలను నట్టేట ముంచి మరీ బాబుకు వంతపాడుతున్న ఎల్లో మీడియా తీరు అందరికీ రోత పుట్టిస్తోంది.
Share this article :

0 comments: