ఆది నుంచీ అదే మోసం..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆది నుంచీ అదే మోసం..!

ఆది నుంచీ అదే మోసం..!

Written By news on Tuesday, May 27, 2014 | 5/27/2014

ఆది నుంచీ అదే మోసం..!
* నాటి మద్య నిషేధం నుంచి నేటి రైతు రుణమాఫీ వరకూ ఈనాడు తీరిదే..
ఎన్నికలకు ముందు ఒకలా.... తర్వాత మరోలా...
బాబుకు దన్నుగా కథలు.. కథనాలు

 
 నాడు: ‘‘రైతుల రుణాలు మాఫీ చేసి చూపిస్తా. 30 ఏళ్ల అనుభవంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా.. సీమాంధ్రని స్వర్ణాంధ్రగా చేస్తా’’
 - ఏప్రిల్ 1న మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఘనంగా చెప్పిన మాటలివి...
 
 నేడు:  ‘‘పాదయాత్ర సమయంలో ప్రజల బాధలు చూసి రైతు రుణమాఫీ హామీ ఇచ్చా. అపుడు రాష్ర్తం సమైక్యంగా ఉంది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో.. ఎంత బడ్జెట్ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి’’
 - మే 17న ఈనాడు ఇంటర్వ్యూలో చంద్రబాబు
 
నచ్చినవారిని ఆకాశానికెత్తడం, అనుకూల కథనాలు వండివార్చడం, అందరూ వాటిని నమ్మితీరాలన్నట్లు పదేపదే వల్లెవేయడం ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అలాగే శత్రువులుగా తాను భావించినవారిపై కత్తిగట్టి నిజానిజాలతో నిమిత్తం లేని అసత్యాల శరసంధానంలోనూ ఆయన సిద్దహస్తుడే.  మూడున్నర దశాబ్దాలకు పైగా ఆయన చేస్తున్న అక్షరయజ్ఞం ఇదేనన్నది సగటు పాఠకులందరికీ తెలుసు. సమయానుకూలంగా పాలసీలను మార్చేసుకోవడం, దండలో దారంలా పైకి కనబడనీయకుండా వాటిని పాఠకులపై రుద్దడంలో రామోజీరావు నేర్పు మరెవరికీ సాధ్యంకాదు. ఎన్నికల ముంగిట రంగుల హంగులతో ప్రచురించిన ప్రత్యేక సంచికలో పనిగట్టుకుని మరీ ప్రత్యర్దులపై బురదజల్లిన రామోజీరావు తన సయామీ కవల చంద్రబాబు గురించి, ఆయనిచ్చిన హామీల గురించి మాత్రం పుంఖానుపుంఖాలుగా ప్రత్యేక కథనాలు వండివార్చారు.
 
 తనకు ససేమిరా నచ్చని జగన్‌మోహనరెడ్డిపై అభూతకల్పనల కథనాలకు, చివరకు ఆయన వ్యక్తిత్వ హననానికి కూడా దిగజారారు. సంపాదకీయాలలో దుర్బాషలాడారు. మరి ఇప్పుడేం జరుగుతోంది. చరిత్ర పునరావృత మవుతోంది. రామోజీ అసామాన్యులు.... ఒకప్పుడు ఆయన మద్యనిషేధం కోసం ఉద్యమించారు... అంతేనా? మద్యనిషేధాన్ని చంద్రబాబు ఎత్తేయడం ఎంత సబబో చెప్పారు కూడా.. రైతు రుణమాఫీ వంటివి చంద్రబాబు వల్లనే సాధ్యమని వందల కథనాలు వండివార్చారు...  ఇపుడు అదే రైతు రుణమాఫీ హామీ అమలు ఎంత అసాధ్యమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. అదీ రామోజీ అసలు రూపం. అటు చంద్రబాబు, ఇటు రామోజీ నమ్మిన జనాలను ఎలా వంచిస్తారో తెలిపే కథనమే ఇది...
 
 రుణమాఫీ నుంచి ఏమార్చే ప్రయత్నాలు
 రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని రామోజీరావు ఆకాశానికెత్తడం అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూలలోనూ ఇదే ప్రధానాంశం. ‘రుణమాఫీ అమలుచేసి చూపిస్తా’ అంటూ చంద్రబాబు నొక్కి చెప్పిన విషయాలను తాటికాయంత అక్షరాలతో రామోజీ అచ్చేశారు. అదేకాదు జిల్లాల టాబ్లాయిడ్‌లలోనూ పేజీలకు పేజీలు ప్రత్యేక కథనాలు వండివార్చారు. రుణమాఫీ అమలయితే 60 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది అంటూ ఆ 60 లక్షల కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేయబోతున్నారంటూ కథనాలు ప్రచురించారు. రుణమాఫీ అమలైతే అమృత వర్షమే అంటూ ఫుల్‌పేజీ కథనాలు వండివార్చారు. ఆకాశాన్నంటే స్థాయిలో రామోజీ నాయకత్వంలోని ఎల్లో మీడియా చేసిన ప్రచారం వల్లో, నిజంగా రైతులు నమ్మారో గానీ అనుకున్న లక్ష్యం నెరవేరింది. నాడు అలా అచ్చేసిన రామోజీ నేడు చేయాల్సిందేమిటి? చంద్రబాబు ఇచ్చిన హామీలలో అత్యంత కీలకమైనదీ.. రైతాంగమంతా ఎదురుచూస్తున్నదీ... రుణమాఫీ గురించే కాబట్టి దాని అమలు కోసం పోరాడాలి.
 
  క్షణం కూడా ఆలస్యం చేయకుండా రుణమాఫీని అమలు చేసి రైతుల కళ్లల్లో కాంతులు చూడాల్సిందిగా చంద్రబాబును కోరాలి. కానీ దీనిపై రామోజీరావు తీరువేరుకదా... అందుకే ఆయన ఈనాడులో కొత్త కథనాలు మొదలుపెట్టారు. రుణమాఫీ అమలు ఎంత అసాధ్యమో చెప్పేందుకు అనువైన కథనాలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు రుణమాఫీ ఎలాగూ చేయడు కాబట్టి ఆయనపై జనానికి ఎలాంటి ఆగ్రహం కలగకుండా ఉండేందుకు వీలుగా కొత్త కథలు మొదలుపెట్టారు. ‘తొలి అడుగే భారం’, ‘10వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఏపీ కార్యకలాపాలు మొదలు’ అంటూ అచ్చేసిన కథనం ఈ కోవలోనిదే. రైతులను ఏమార్చడానికి, బాబును కాపాడడానికి రామోజీ ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలుసుకునేందుకు ఇదే నిదర్శనం. అలవిమాలిన హామీ లిచ్చిన చంద్రబాబును  గండం నుంచి గట్టెక్కించేందుకు రామోజీ  చేస్తున్న ప్రయత్నాలకు అంతేలేదు.
 
 తొలి అడుగులు ఇబ్బందే అని ఒకరోజు, బాబు ముందు ఎన్నో ఇబ్బందులున్నాయని మరో రోజు కథనాలు వండివార్చారు.  గెలిచిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ రుణమాఫీపై ఎన్నో పిల్లిమొగ్గలు కనిపించాయి. దశలవారీగా అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామంటూ ఆయన లొల్లాయి కబుర్లుచెప్పారు. అంతేకాదు అపుడు ఉమ్మడి రాష్ర్టం ఉంది.. ఇపుడు రాష్ర్టం విడిపోయింది గనుక నేను నట్లు బోల్టుల దగ్గర్నుంచి అన్నీ వెతుక్కోవాలి అంటూ ఏవేవో కబుర్లు చెబుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, బడ్జెట్ ఎంతో ఎవరికీ తెలియదు అనేంత వరకు బాబుగారు వెళ్లారు. ఎన్నికలకు ముందు నోటికొచ్చినట్లల్లా వాగ్దానాల వర్షం కురిపించిన చంద్రబాబు ఇపుడు నీళ్లునములుతుండడానికి కారణమేమిటి? అపుడు ఇష్టం వచ్చినట్టల్లా హామీల వర్షం కురిపించి ఇపుడు సాకులు వెతుక్కోవడమేమిటి? ఒకవైపు అదను సమీపిస్తున్నది.రైతులు ఖరీఫ్ కోసం సమాయత్త మవుతున్నారు. బాబుగారిని నమ్ముకుని రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్తరుణాలివ్వడానికి ససేమిరా అంటున్నాయి. భవిష్యత్తుపై ఆందోళనతో అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలో అల్లాడుతుంటే అధికారపార్టీ అధినేత మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తాను చేయదలుచుకున్నదేమిటో చెప్పకుండా రైతుల్లో ఆందోళనను ఇంకా పెంచుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జరుగుతున్న జాప్యంపైనా ఎల్లోమీడియాలో అనుకూల కథనాలు ఎన్నోవస్తున్నాయి. రుణమాఫీపై ఆలోచన చేస్తున్నారని, అది తేలేవరకు ప్రమాణస్వీకారం చేయకూడదని తీర్మానించుకున్నారని ప్రచారం మొదలుపెట్టేశారు. ఎల్లో మీడియాలోని మరో తోకరాయుడు ఇప్పటికే జోలెపట్టి విరాళాలు సేకరిస్తూ, రాష్ర్టం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో తెలియజేస్తూ, జనాలను కన్నీటి పర్యంతం చేస్తూ తనవంతు ప్రయత్నం తానూ చేస్తున్నాడు. ఇలాంటి విపత్కర స్థితిలో రాష్ర్టం ఉంటే... ఆయ నే అడుక్కునే పొజిషన్లో ఉంటే ఇక మనమేం అడుగుతాంలే అని అమాయక రైతులు అన్నీ వదిలేసి తమ బాధలేవో తాము పడతారన్నది వీరి దూ(దు)రాలోచన. ఎలాగూ బాబు తానిచ్చిన హామీలను నెరవేర్చలేరు గనుక అనేకానేక సమస్యలే అందుకు కారణమంటూ రైతుల దృష్టిమరల్చడానికి ఎల్లోమీడియా పడరానిపాట్లు పడుతున్నది.
 
 మద్యనిషేధానికి ముందూ.. తర్వాతా..
 కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా మధిరాసుర మర్ధన చేయండంటూ ఈనాడు దినపత్రికలో నిత్యం ఓ కార్యక్రమంలా ప్రత్యేక పేజీలు ముద్రించి రామోజీ స్వయంగా ఉద్యమానికి అక్షరసారధ్యం వహించారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రామోజీ మద్యనిషేధ ఉద్యమం కొండెక్కింది. పనిగట్టుకుని మరీ చేసిన మద్యనిషేధ ప్రచారాన్ని రామోజీ వదిలేశారు. పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలు లిక్కర్ ద్వారా సంపాదించిన సొమ్ములో ఉన్నాయి కాబట్టి వాటిని చిదిమేయడమే లక్ష్యంగా మద్యనిషేధానికి నాడు రామోజీ ఊతమిచ్చారు. పనిలోపనిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పైనా వ్యతిరేకతను ఎగదోయడం అందులో భాగం. డజన్లకొద్దీ సంపాదకీయాలు, నిరంతరం కార్టూన్లతో ఉద్యమం నడిపిన రామోజీరావు ఒక్కసారిగా అన్నీ ఆపేశారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మద్యం ముడుపుల మత్తులో చంద్రబాబు, తన హోటళ్ల వ్యాపార అవసరాల కోసం ‘ఈనాడు’ రామోజీ కలసికట్టుగా మద్యనిషేధానికి తూట్లు పొడిచారు.
 
  సజావుగా సాగని నిషేధం అవసరమా అనే సన్నాయి నొక్కులతో సంపాదకీయాలు... కల్తీ కల్లుతో జనారోగ్యం కుదేలవు తోందంటూ పతాక శీర్షికల్లో బూటకపు వార్తలు... ఇలా నెలల తరబడి ఈనాడులో వ్యూహాత్మక కథనాల ద్వారా రామోజీ రంగం సిద్ధం చేశారు. బాబు కూడా తనవంతుగా మద్యనిషేధం కారణంగా ఖజానా బక్కచిక్కిపోతున్నదంటూ మొసలికన్నీళ్లతో ఆ నాటకాన్ని రక్తి కట్టించారు. అలా అంతా కలసి నెలలతరబడి నాటకం నడిపిన తర్వాత మద్యనిషేధాన్ని బాబు అటకెక్కించారు. అంతేకాదు ఏకంగా మద్యప్రవాహానికి గేట్లెత్తేశారు.  ఆ తర్వాత బెల్టుషాపులతో చంద్రబాబు ఊరూరా మద్యం ఏరులుగా పారించినా రామోజీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒకేదెబ్బకు రెండుపిట్టలు అన్న చందాన అటు ప్రత్యర్థిని మట్టికరిపించిన రామోజీ ఆనక నమ్మినబంటుకు అలా మేలు చేశారన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మద్యనిషేధ ఉద్యమం కోసం ఈనాడులో రోజూ రెండు పేజీలు కేటాయించిన రామోజీ తెలుగుదేశం ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేశాక ఆ విషయం ఇక తనకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు.
 
 అధికారపార్టీ అడ్డదారులు..
 హామీల అమలు కష్టమని తేలిపోవడంతో దిక్కుతోచని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇపుడు కొత్త నాటకాలకు తెరతీశారు. రాష్ర్టంలో ఏకైక బలమైన ప్రతిపక్షపార్టీగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. హామీల నుంచి జనం దృష్టిని మరల్చడం, ప్రతిపక్ష పార్టీని బలహీనపరచడం అనే జంట కుట్రలకు పదునుపెడుతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఈనాడు నాయకత్వంలోని ఎల్లోమీడియా వంతపలకడం కొత్తేమీ కాదు గానీ ప్రజాస్వామ్యాన్ని ఇంత బహిరంగంగా ఖూనీచేయడానికి తెగబడడం, ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహను వదిలేయడం విచారకరం. ఎన్నికల ఫలితాలు విడుదలై పట్టుమని పదిరోజులు కూడా కాలేదు... కనీసం ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారమైనా చేయలేదు.. కానీ అప్పుడే కుట్రపూరితంగా జరుగుతున్న ఈ వ్యవహారం చూస్తే అధికారపార్టీ భవిష్యత్తులో ఏ మార్గాన నడవబోతున్నదో తెలుస్తూనే ఉంది.
 
 ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకున్న తెలుగుదేశం నాయకుల కుటిలనీతికి... మరికొందరు కూడా వెళ్లబోతున్నారంటూ ఎల్లోమీడియా ఆడుతున్న మైండ్‌గేమ్‌కు ఎన్నికల సంఘం బ్రేక్‌వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సరిపడినన్ని స్థానాలు గెలుచుకున్న ఓ రాజకీయపార్టీ ఇంకా ప్రమాణస్వీకార కార్యక్రమాన్నయినా జరుపుకోకముందే ఎందుకిలా ప్రతిపక్షపార్టీ నేతలను ఆకర్షించే దిగజారుడు రాజకీయం చేస్తున్నదో తెలుసుకోవడానికి పెద్దగా శ్రమపడనక్కరలేదు..  ఓటేసిన రైతులు రుణమాఫీ కోసం మోరలెత్తి చూస్తున్న విషయాన్ని గ్రహించి వారి దృష్టిని మరల్చడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారంతే....
 - పి. శ్రీనివాసరావు

Share this article :

0 comments: