వైఎస్సార్‌సీపీ కుటుంబాలపై విశృంఖల దాడులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ కుటుంబాలపై విశృంఖల దాడులు

వైఎస్సార్‌సీపీ కుటుంబాలపై విశృంఖల దాడులు

Written By news on Sunday, May 25, 2014 | 5/25/2014

వైఎస్సార్‌సీపీ కుటుంబాలపై విశృంఖల దాడులు
కంచిలి, న్యూస్‌లైన్: ఇళ్లలో పురుషులెవరూ లేరు. ఇదే అదనుగా భావించారు ప్రత్యర్థులు. రాత్రి వేళ దాడులకు తెగబడ్డారు. కర్రలు, కత్తులు, రాళ్లతో ఇళ్లలోకి దూరి రెండు గంటల పాటు బీభత్సం సృష్టించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది తెలుసుకొని పరుగున వచ్చిన పురుషులపైనా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కంచిలి మండలం జాడుపూడి కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ విధ్వంసకాండలో బాధితులు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు కాగా.. దాడులకు తెగబడినవారు కాంగ్రెస్ మద్దతుదారులు. జాడుపూడి కాలనీలో ఉన్న రెండు సామాజికవర్గాలు రెండు పార్టీల మద్దతుదారులుగా విడిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య చాలాకాలంగా కక్షలు కొనసాగుతున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య  ఘర్షణ జరిగింది. స్థానిక పెద్దలు కల్పించుకొని రాజీ చేశారు. కాగా శుక్రవారం రాత్రి అంపురంలో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల కుటుం బాల్లోని పురుషులందరూ వెళ్లారు.

 ఆ కుటుం బాల్లో ఆడవాళ్లు, పిల్లలే ఇళ్లలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ మద్దతుదారులు ఆడా మగా కలిసి సుమారు 20 మంది వరకు ఒక్కసారిగా వైఎస్‌ఆర్‌సీపీ ఇళ్లపై దాడి చేశారు. రాత్రి 8.30 నుంచి 10.30 గంటల వరకు రెండు గంటలపాటు విశృంఖలంగా వ్యవహరించారు. ఇళ్లలో దూరి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఇతర సామాన్లను చిందరవందర చేశారు. ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఈ విషయం తెలుసుకుని వివాహానికి వెళ్లిన బాధిత కుటుంబాల పురుషులు హుటాహుటిన గ్రామానికి చేరుకోగా.. వారిని కూడా కత్తులు, కర్రలు, రాళ్లతో కొట్టారు. దాంతో వారు కూడా ఎదురు తిరిగారు. ఈ సంఘటనలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పది మందికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరందరినీ సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా కాంగ్రెస్ మద్దతుదారులు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు చెందిన రెండు ఇళ్లలో విధ్వంసం సృష్టించారు. ఒక ఇంట్లో ఉన్న టీవీ పగులగొట్టి, బీరువాలో ఉన్న సామాన్లను చిందరవందర చేశారు.

 బీరువాలో భద్రపర్చిన రూ.20 వేల నగదును, తన మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలు, పుస్తెల తాడును తెంచుపోయారని బాధితురాలు మక్క కుమారి ఆరోపించారు. ఈ గొడవలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మక్క కుమారి, జానకీరావు, నూకరాజు, క్రిష్ణారావు, లోలాక్షి, మక్క పుష్ప, మిర్యాల కేశవరావు, పిలక జగన్నాయకులు, రెడ్డిపల్లి పోలయ్య, నర్సమ్మలు గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అయితం వైకుంఠరావు, భార్య లక్ష్మి, అయితం లోలాక్షి, పొట్టమ్మ, గంట శివకుమార్, మిరయాల రామయ్యలు కూడా గాయాలపాలయ్యారు. సంఘటనపై ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు వర్గాలకు చెందిన 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఏఎస్‌ఐ బి.వి. రామక్రిష్ణ తెలిపారు.

 రక్షణ కల్పించాలి
 జాడుపూడి కాలనీలో నివసిస్తున్న తమ ఆరు కుటుంబాలకు రక్షణ కల్పించాలని బాధిత వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల కుటుంబాలకు చెందిన మహిళలు కోరారు. గ్రామానికి వెళ్లిన విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గానికి చెందిన సుమారు 20 కుటుంబాలవారు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఒంటరిగా దొరికితే ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే తప్ప ఊరిలో ప్రశాంతంగా నివసించలేమని అన్నారు.
Share this article :

0 comments: