ఎడిటోరియల్ : శభాష్ వైసీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎడిటోరియల్ : శభాష్ వైసీపీ

ఎడిటోరియల్ : శభాష్ వైసీపీ

Written By news on Wednesday, May 14, 2014 | 5/14/2014

మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభంజనం వీచిందని, తెలుగుదేశం అద్భుత విజయం సాధించిందని అంటున్నారు. కానీ, ఇది వాస్తవం కాదు. నిజం చెప్పాలంటే, అద్భుత విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అరంగేట్రంలోనే ఆ పార్టీ అదరగొట్టేసింది. మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం పార్టీతో నువ్వా నేనా అన్నట్లు తలపడి ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. 

పట్టణ ప్రాంతాల్లో మూడో వంతుకే పరిమితం అయినా.. పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటా పోటీగానే ఢీకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శనను సూపర్ డూపర్ హిట్ అనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి కూడా స్థానిక ఎన్నికల ఫలితాలు ఎందుకంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అర్థం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ప్రదర్శన ఏమంత గొప్పగా ఏమీ లేదు. అయినా ఇప్పుడు ఎందుకింతగా ఉలికిపడుతున్నారో కూడా అర్థం కాదు.

 ఉదాహరణకు, తెలుగుదేశం పార్టీ అద్భుత ప్రదర్శన చేసిందని చెబుతున్న శ్రీకాకుళం జిల్లానే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన జడ్పీటీసీ సీట్లు 23. అప్పట్లో ఆ పార్టీ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2006లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుచుకన్న జడ్పీటీసీ స్థానాలు కేవలం పదంటే పది. 

ఈ ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం 22 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక, తూర్పు గోదావరి జిల్లా విషయానికే వద్దాం. 2001లో తూర్పు గోదావరిలో తెలుగుదేశం గెలుచుకున్న జడ్పీటీసీ స్థానాలు 23. 2006 ఎన్నికల్లో ఆ జిల్లాలో గెలుచుకున్న జడ్పీటీసీలు 21. ఇప్పుడక్కడ 43 జడ్పీటీసీలను గెలుచుకుని జడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. 2001లోనూ, 2006 ఎన్నికల్లోనూ టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీకొని కూడా టీడీపీ అప్పట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. మరి, ఈ ఎన్నికల పరిస్థితిని చూద్దాం. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేదు. ఆ పార్టీ టీడీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. సరికదా.. కాంగ్రెస్ పార్టీలోని అత్యధిక శాతం నాయకులు టీడీపీలోకి వచ్చేశారు. వారంతా ఈసారి టీడీపీ తరఫున పోటీ చేశారు. అంటే.. టీడీపీ కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న పార్టీ. కాంగ్రెస్ కూడా కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న పార్టీనే. ఆ రెండు పార్టీల కార్యకర్తలూ కలిసి ఈసారి ఎన్నికల బరిలోకి టీడీపీ తరఫున దిగారు. ఆ రెండు పార్టీలూ కలిసి ఎవరితో పోటీ పడ్డాయి. 

తొలిసారిగా స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్న, కార్యకర్తల బలం ఏమాత్రం లేని వైసీపీతో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పిల్లకాకి. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఉండేలుతో సమానం. ఉండేలు దెబ్బకు పిల్ల కాకి కకావికలం అయిపోయి ఉండాలి. కానీ, ఆ రెండింటినీ దీటుగా తట్టుకుని వైసీపీ నిలబడింది. నిలబడడమే కాదు కొన్నిచోట్ల విజయాలను కూడా సొంతం చేసుకుంది. మరొక్క విషయం జాగ్రత్తగా గమనించండి. 2001, 2006, 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు, సీట్లను గమనించండి. 

దీంతో ఒక విషయం అర్థమవుతుంది. అప్పటితో పోలిస్తే టీడీపీ బలం ఏమాత్రం పెరగలేదు. కానీ, కాంగ్రెస్ బలం జతకలవడం కారణంగానే ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మళ్లీ వాళ్ల పార్టీలోకి వెళ్లిపోతే టీడీపీ పరిస్థితి ఎప్పట్లాగే ఉంటుందన్నమాట. దీనినిబట్టి, అర్థం చేసుకోవచ్చు టీడీపీది వాపో.. బలుపో. మరో విషయం. సీమాంధ్రలో దుమ్ము దులిపేశామని టీడీపీ చంకలు గుద్దుకుంటే అంతకు మించిన పతనం ఆ పార్టీకి లేనే లేదు. 

ఎందుకంటే, సీమాంధ్రలో ఆ పార్టీ 2001 స్థానిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసిందంతే. కానీ, తెలంగాణలో మొత్తంగా తుడిచి పెట్టుకుపోయింది. తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకోవడం ఎలా అని ఆలోచించకుండా సీమాంధ్రలో వైసీపీ కంటే పైచేయి అని సంతోషపడితే భవిష్యత్తులో టీడీపీకి ఆ కాస్త సీట్లు కూడా ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. అయితే, ఇక్కడ మరొక్క విషయం కూడా చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో కనక టీడీపీ ఈ ఫలితాలను సాధించకుండా ఉండి ఉంటే. ఈ ఎన్నికల్లో టీడీపీ సాధారణ ఫలితాలనే సాధించి ఉంటే.. ఆ పార్టీ మటాష్ అయిపోయి ఉండేది.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నిజంగా అద్భుత ఫలితాలను సాధించింది. వైసీపీ ఏర్పడిన తర్వాత ఏవో కొన్ని ఉప ఎన్నికల్లో మినహా ఆ పార్టీ నేరుగా తలపడింది లేదు. ప్రజా తీర్పు కోరింది లేదు. వైసీపీ ప్రత్యక్షంగా ప్రజా తీర్పు కోరిన తొలి ఎన్నిక మున్సిపల్ ఎన్నికగానే చెప్పుకోవచ్చు. రెండో ఎన్నిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. దీనికితోడు ఫ్యాను గుర్తుపై జరిగిన తొలి ఎన్నికలు కూడా ఇవే. అయినా, వైసీపీ నాలుగు జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుంది.

 మిగిలిన వాటిలో ఎంతో కొంత పోటీ ఇచ్చింది. మొత్తంగా టీడీపీ 374 జడ్పీటీసీలను కైవసం చేసుకుంటే వైసీపీ 274 జడ్పీటీసీలను దక్కించుకుంది. ఎంపీటీసీల్లోనూ నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చి టీడీపీ కంటే వెయ్యి తక్కువ సాధించింది. ఒకవేళ, రాష్ట్ర విభజన జరగకుండా కాంగ్రెస్ కూడా బరిలో ఉండి ఉంటే టీడీపీకి ఇన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీలు వచ్చి ఉండేవే కావు. టీడీపీకి వచ్చిన సీట్లను కాంగ్రెస్ కూడా పంచుకుని ఉండి ఉండేది. 

వైసీపీకి మాత్రం కాస్త అటూ ఇటుగా ఇవే సీట్లు వచ్చి ఉండేవి. అందువల్ల, ఏ విధంగా చూసుకున్నా వైసీపీ మంచి ఫలితాలను సాధించినట్లే కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు ఎటువంటి సంబంధం ఉండకపోయినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాలను చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా వైసీపీకి జైకొట్టాయి. అయితే, చివర్లో చంద్రబాబు తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా వదిలి జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అందుకే, అసెంబ్లీ ఫలితాలపై అందరిలోనూ అంత ఉత్కంఠ.
http://www.apherald.com/Politics/ViewArticle/56511/Muncipal-Elections-2014-YSRCP-Jagan-Sharmila-ZPTC-/

Share this article :

0 comments: