ప్రబల శక్తిగా ఆవిర్భవించాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రబల శక్తిగా ఆవిర్భవించాం

ప్రబల శక్తిగా ఆవిర్భవించాం

Written By news on Wednesday, May 21, 2014 | 5/21/2014

ప్రబల శక్తిగా ఆవిర్భవించాంవీడియోకి క్లిక్ చేయండి
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే నిలిచారు: పార్టీ సీనియర్ నేతల విశ్లేషణ

గెలుపుపై పార్టీ నేతల్లో అతివిశ్వాసం అనేక చోట్ల దెబ్బతీసింది
పార్టీ నిర్మాణం ఉండివుంటే ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చేవి
పట్టణ ప్రాంతాల్లో మోడీ హవా టీడీపీకి కలిసివచ్చింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 1.96 శాతం మాత్రమే
జాతీయంగా టీడీపీ - వైఎస్సార్ సీపీ మధ్య తేడా లక్ష ఓట్లే
ఈ ఎన్నికల్లో అధికారం రాకపోయినా.. మంచి భవిష్యత్ ఉంది
పరాజయంపై వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సమీక్షలు
స్వల్ప ఓట్ల తేడాతో ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న నేతలు

 
 హైదరాబాద్: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో అధికారం దక్కించుకోవడానికి అవసరమైన అసెంబ్లీ సీట్లు గెలవలేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రబల శక్తిగా ఆవిర్భవించింది. సుదీర్ఘ కాలం రాజకీయ మనుగడ సాగిస్తున్న అనేక పార్టీలను మట్టికరిపించింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతి ఎన్నికల్లోనూ తమ రాజకీయ ఉనికిని చాటుకునే అనేక పార్టీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా కొట్టుకుపోయాయి. అధికారానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయినా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా కీలక బాధ్యతలను ఆ పార్టీ చేపట్టబోతోంది. అనేక ఆటుపోట్ల మధ్య.. పార్టీ పరంగా ఎలాంటి నిర్మాణం లేకుండానే.. తొలిసారి ఎదుర్కొన్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఏకంగా 45 శాతం ఓట్లను సాధించడం ఆ పార్టీకి సానుకూల అంశంగా మారింది. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినప్పటికీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అంచనాకు ఆ పార్టీ నేతలొచ్చారు. గత నాలుగు రోజులుగా ఎన్నికల ఫలితాలను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేతల్లో నెలకొన్న అతి విశ్వాసం, పార్టీకి నిర్మాణం లేకపోవడం, పొత్తుల వల్ల టీడీపీకి ఓట్లు పెరగడం, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హవా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయడం, కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేయడం, ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు లేనప్పటికీ రుణమాఫీ, ఇంటింటికో ఉద్యోగం వంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తదితర అంశాలు పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. చంద్రబాబు రుణమాఫీ హామీ అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్న అంచనాకొచ్చారు. దీనికి తోడు 30 ఏళ్ల కిందట ఏర్పడిన టీడీపీకి సంస్థాగత నిర్మాణం ఉండటంతో మిగతా అంశాలన్నీ ఆ పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషించారు. ప్రత్యర్థులు అనేక అస్త్రాలతో ఎన్నికల్లో దిగినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ 45 శాతం ఓట్లు సాధించడం మామూలు రాజకీయ పార్టీలకు సాధ్యం కాదని, సంఖ్యాపరంగా ఓడిపోయామే తప్ప తమ పార్టీకొచ్చిన ఫలితాలు భవిష్యత్తుకు మంచి సంకేతంగా భావిస్తున్నామని సీజీసీ సభ్యుడొకరు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో 90 శాతం స్థానాల్లో ఓడినా, టీడీపీకి వచ్చిన ఓట్లతో పోల్చితే పెద్ద తేడా లేకపోగా మరికొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని సీనియర్లు తేల్చారు.

అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు...

1994 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాల్లో మాత్రమే గెలిచి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ తర్వాత కోలుకున్న కాంగ్రెస్ దేశంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో గెలిచిన ఎంపీలే కారణమయ్యేలా 33 మంది సభ్యులను గెలుచుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో ఊసు లేకుండా పోగా కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా దక్కని దయనీయస్థితికి పడిపోయింది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడగా, మార్పు కోరుకున్న ప్రజలు కేంద్రంలో నరేంద్రమోడీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మోడీ గాలిలో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, వామపక్ష పార్టీలు సైతం దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాది కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం కావలసి వచ్చింది.  బీహార్‌లో బీజేపీ పొత్తును వదులుకొని ఎన్నికల్లో పోటీచేసిన అధికార జనతాదళ్ (యూ)కి ఈ ఎన్నికల్లో తలబొప్పికట్టింది. ఆ రాష్ట్రంలోని 40 స్థానాల్లో కేవలం రెండే సీట్లు దక్కాయి. ఈ పరిణామం ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ రాజీనామాకు దారితీసింది. మహారాష్ట్రలో కూడా అధికార కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు అక్కడి 48 స్థానాలకు గాను కేవలం 6 స్థానాలనే దక్కించుకున్నాయి. తక్కినవన్నీ బీజేపీ, శివసేన కూటమికే దక్కాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగేజరగ్గా పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో మాత్రమే ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు నరేంద్రమోడీ గాలిని తట్టుకొని నిలబడ్డాయి. అదే పరిస్థితి సీమాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అక్కడ ఆ పార్టీలు అధికార పార్టీలుగా ఉండటంతో పాటు.. క్షేత్రస్థాయిలో బలమైన పునాదులతో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉండడంతో మెరుగైన ఫలితాలు సాధిం చాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీల మాదిరి నిర్మాణం లేనేలేదు. పార్టీ ఏర్పాటైనది మొదలు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితంగా దాన్ని అణచేసేందుకు ప్రయత్నించాయి. అయినా వాటన్నిటినీ తట్టుకొని పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లింది. బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీకి దిగిన టీడీపీకి ఆర్థిక, అంగబలాలతో పాటు మోడీ గాలి కలసి వచ్చాయి.

ఏమాత్రం తీసిపోని ప్రజాదరణ...

 వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన ఓట్ల శాతాలు చూస్తే ప్రజాదరణలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పార్టీతో ఏమాత్రం తీసిపోనిదిగా నిలిచింది. టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా రెండు శాతం కూడా లే దు. కేవలం సీట్ల సంఖ్యలో ఆధిక్యతను సాధించి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అనేక సానుకూలాంశాలు కలసి వచ్చినప్పటికీ ఆ పార్టీ సాధించిన ఓట్లను బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్సే గట్టిపోటీ ద్వారా ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఎన్నికల్లో జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే టీడీపీతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ 2.5 శాతం ఓట్లు సాధించింది. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయస్థాయిలో పదో స్థానంలో నిలిచింది. టీడీపీ 1,40,94,545 ఓట్లు రాబడితే వైఎస్సార్ కాంగ్రెస్ 1,39,91,280 ఓట్లు సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం లక్ష మాత్రమేనని ఎన్నికల సంఘం తేల్చింది. జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం చూస్తే టీడీపీకి 14, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 14 స్థానాలు రావలసి ఉందని ‘ద హిందూ’ పత్రికలో విశ్లేషణలు వచ్చాయి.

కొంచెం జాగ్రత్త పడి ఉంటే...

రాష్ట్రంలో పార్టీ ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలనే సాధించినట్లు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంటులో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలను చాపకిందనీరులా చక్కబెట్టడంలో కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధహస్తులు కావడంతో అది ఈ ఎన్నికల్లో వారికి కలసివచ్చింది. పార్టీకి ప్రజాదరణ ఉందని, ఎట్టిపరిస్థితుల్లో తమదే గెలుపు అని చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతలు ఒకింత అతివిశ్వాసంతో వ్యవహరించడంతో ఆ స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశానికి వదులుకోవలసి వచ్చింది. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 30కి పైగా ఉన్నాయని గుర్తించారు. ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఒకింత అప్రమత్తతతో వ్యవహరించి ఉంటే ఓట్లలోనే కాకుండా సీట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
 
Share this article :

0 comments: