ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటా

ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటా

Written By news on Saturday, May 3, 2014 | 5/03/2014

ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటా
‘సాక్షి’తో వైఎస్ విజయమ్మ
కొన ఊపిరి దాకా విశాఖ ప్రజల పక్షమే
ఇక్కడే, ప్రజల మధ్యే ఉంటా.. వైఎస్ కుటుంబానికి ముఖం చాటేసే చరిత్ర ఉందా?
మాట తప్పని, మడమ తిప్పని
వైఎస్ అడుగుజాడలే ఆదర్శం
అభిమానంతోనే ఓటు తీసుకుంటాం..బాబులా నోటు, మద్యంతో కాదు
వైఎస్ కలలన్నింటినీ సాకారం చేస్తా..సంకల్పమే మా బలం


 ‘మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచినదాన్ని. నాలో కొనఊపిరి ఉన్నంత వరకూ నన్ను అభిమానిస్తున్న విశాఖ ప్రజల వెంటే ఉంటాను. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. దేశంలోనే మోడల్ నగరంగా విశాఖను తీర్చిదిద్ది చూపిస్తాను. విశ్వాసంతో ఓటేసే ప్రతి ఓటరుకూ నేనిస్తున్న హామీ ఇది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. కుట్రలు, కుయుక్తులతో మోసపోతున్న ఉత్తరాంధ్రకు అండగా నిలవడమే తన
 లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉప్పొంగుతున్న జనసంద్రంతో మమేకమవుతున్న విజయమ్మ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. వివరాలు...
 
 ‘‘నిజానికి రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకసలు రాజకీయాలు తెలియవు. జనం కోసమే బతకాలన్న వైఎస్ ఆలోచనలకు విఘాతం కలుగుతుంటే అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశాను. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల వారికి వైఎస్‌లా విశ్వాసం కలిగించే నాయకత్వం కావాలని జగన్ కోరారు. ఆ ప్రతిపాదనకు యావత్ విశాఖ జిల్లా ప్రజలూ మద్దతిచ్చారు. అంతేకాదు, విశాఖ అభివృద్ధి కోసం మహానేత ఎన్నో ఆలోచనలు చేశారు. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని తపించారు. ఆ ఆశయాలు నెరవేర్చేందుకు, అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకే వచ్చాను. జగన్‌ను ఇబ్బందులు పాలు చేసినప్పుడు, తప్పుడు కేసులు బనాయించినప్పుడు పార్టీని భుజాలకెత్తుకున్నాను. రాజకీయాలు తెలియకుండానే జనం సమస్యలు తెలుసుకున్నా. వారి పక్షాన పోరాటాలు చేశాను. ఈ పోరాటాల నేపథ్యంలో విశాఖ జిల్లా ప్రజల సమస్యలు నన్ను కలిచివేశాయి. భద్రత లేని కార్మికుల కన్నీటి గాథలు తెలుసు. మురికివాడల్లో నివసిస్తున్న బడుగు జీవుల దుస్థితిని స్వయంగా చూశాను. వనరులుండీ అభివృద్ధికి నోచుకోని పాలకుల నిర్లక్ష్యం, అవకాశాలుండీ ఉపాధి లేని నిరుద్యోగుల వ్యథలన్నీ స్వయంగా చూశాను. వాళ్ల కన్నీటిని కొంతయినా తుడవాలనే కాంక్ష నాలో బలంగా ఉంది. వాళ్ల మధ్యే, వాళ్ల ప్రతినిధిగానే ఉంటేనే అది సాధ్యమని భావించాను.

అది దుష్ర్పచారమే...
ఎన్నికల తర్వాత నేను అందుబాటులో ఉండనన్నది దుష్ర్పచారం. ఓటమి భయంతో ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర. విశాఖ జనం అడుగడుగునా నన్ను ఆదరిస్తుంటే తట్టుకోలేని దుష్టశక్తులు పన్నిన కుయుక్తి. ఓటు తీసుకుని ముఖం చాటేసే చరిత్ర వైఎస్ కుటుంబంలో ఉందా? అదే నిజమైతే జగన్ ఇన్ని కష్టాలెందుకు పడేవాడు? కన్నీళ్లను కొంగుతో తుడుచుకుని మేం జనం మధ్యే ఎందుకు ఉండేవాళ్లం? ఇలాంటి ప్రచారం గతంలోనూ చేశారు. నేను పులివెందులకు ప్రాతినిధ్యం వహించాను. ఐదేళ్లలో ఏ ఒక్కరి నుంచైనా ఎలాంటి ఫిర్యాదులైనా వచ్చాయా? ఆ నియోజకవర్గంలో ఏ ఊరికైనా వెళ్లి అడగండి. ఏ వ్యక్తినైనా కనుక్కోండి. వాళ్లకు అండగా నిలబడ్డాను. ఏ చిన్న సమస్య వచ్చినా వెళ్లాను. ఎలాంటి అన్యాయం జరిగినా పోరాడాను. వైఎస్ ఆశయ సాధన కోసం అనుక్షణం కష్టపడ్డాను. మా ప్రభుత్వం లేకున్నా, పులివెందుల ప్రజలకు అవసరమైనవన్నీ తీర్చేందుకు శాయశక్తులా కృషి చేశాను.
 
విశాఖలోనే ఉంటా...
విశాఖ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విజయమ్మను నేరుగా కలవచ్చు. ఇక్కడే కార్యాలయం ఉంటుంది. ఏ అవసరమొచ్చినా చెప్పొచ్చు. అది వెంటనే నా దగ్గరకు వస్తుంది. అంతేకాదు, నెలకు కనీసం రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటిస్తాను. ఇప్పటికే అనేక సమస్యలు గుర్తించాను. వైఎస్ ప్రతిపాదించిన పథకాలు కార్యరూపం దాల్చేందుకు ప్రణాళిక రూపొందించాను. ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఈ కుటుంబం జనం కోసం బతుకుతోంది. ఆ మహానేత జనం మధ్యే తిరిగారు. జగన్ కూడా అంతే. షర్మిల సైతం అనుక్షణం ప్రజల సమస్యలపైనే పోరాటం చేసింది. ఢిల్లీలో కూర్చుని ఐదేళ్లకోసారి వచ్చే అలవాటు లేనేలేదు. అభిమానంతో ఓట్లు తీసుకుంటాం తప్ప మద్యం సీసాలతోనో, కరెన్సీ కట్టలతోనూ చంద్రబాబులా చేయనే చేయం.

మోడీ, బాబులను చూసి మోసపోరు
మోడీని చూసో, చంద్రబాబు జిమ్మిక్కులు చూసో మోసపోయే అమాయకులు కాదు విశాఖ ప్రజలు. అదే నిజమైతే నన్నింతగా ఆదరించేవాళ్లే కాదు. పట్టణ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వాళ్లు నాకు ఓటేస్తున్నారని నేననుకోను. వైఎస్ అభివృద్ధికి ఓటేస్తున్నారు. వైఎస్ తరహా నమ్మకం మళ్లీ జగన్ ద్వారా సాధ్యమని భావిస్తున్నారు. ఆ నమ్మకం ముందు మోడీలు, బాబు ఏమాత్రం ప్రభావం చూపలేరు.

పల్లెపల్లెనా వైఎస్సే

ఉత్తరాంధ్రలో ప్రతి మండలాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడచూసినా జనం గుండెల్లో వైఎస్ గూడుకట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా ‘అమ్మా... ఆ మహా నేత పెన్షన్ ఇచ్చాడు. ఆరోగ్యశ్రీతో ప్రాణం కాపాడాడు.  నా అప్పులు మాఫీ చేయించాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆయనే మా దగ్గరకు వచ్చినట్టు ఉంది’ అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఇంతగా ఆరాదిస్తున్నారు. వాళ్లు నిర్ణయించుకున్నారు. వైఎస్‌కు కృతజ్ఞతలు చూపాలనుకుంటున్నారు. ఓటు రూపంలో రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ నమ్మకాన్ని చూశాక నాకు అన్పిస్తుంది ఒక్కటే... ఇక్కడ ఓటడిగే హక్కు కేవలం వైఎస్సార్‌సీపీకే ఉంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా పార్టీపైనే ఉంది.

అన్నివిధాలా అభివృద్ధి చేస్తా
విశాఖకే కాదు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకూ నేను ప్రతినిధిని. బీడు పడ్డ భూములకు నీళ్లివ్వాలని ఉంది. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఉంది. నీటి కోసం అలమటించే జనానికి రక్షిత మంచినీరు ఇవ్వాలని ఉంది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలనుంది. స్టీల్ ప్లాంట్‌ను విస్తరించాలని ఉంది. విశాఖలో రిఫైనరీ యూనిట్ పెట్టే ఆలోచన ఉంది. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ ఆసుపత్రి, మెట్రోరైలు ప్రాజెక్టు తేవాలని ఉంది. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలన్న వైఎస్ ఆలోచనను నిజం చేస్త్తా. నగరంలోని వం దల కొద్దీ మురికివాడల్లో ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తా.

స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాం
దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉంటుంది. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే అసాధ్యమన్నది దరిదాపుల్లోకే రాదు. మాకందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పిన పాఠమిది. ఆ విశ్వాసంతోనే ఆయన బతికారు. అప్పులపాలైన ఈ రాష్ట్రంలో కుప్పల కొద్దీ పంటలు ఎలా ఉండాయి. పడి లేచే రాష్ట్ర బడ్జెట్‌ను లక్ష కోట్లకు వైఎస్ ఎలా తీసుకెళ్లారు? నెర్రెలుబారిన భూములకు నీళ్లెలా ఇచ్చారు. సాధ్యమే! జనం కోసం ఏదైనా సాధ్యమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రావాలన్నది జనం ఆకాంక్ష. అది నిజమైన రోజు ప్రజల ఆశలూ, ఆకాంక్షలు ఎంతమాత్రం భారం కాబోవు. ఆర్థిక వనరులను పెంచే విధానాలున్నాయి. జనం మెచ్చేలా పాలించే సత్తా వైఎస్సార్‌సీపీకి ఉంది. దేవుడి ఆశీర్వాదం మాకెప్పుడూ ఉంటుంది. ప్రకృతీ సహకరిస్తుంది. అందుకే వైఎస్ కాలంలో ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారు.
 
జగన్‌పై నమ్మకంతో ఓటేస్తారు
నేను, జగన్, షర్మిల ఇంతవరకూ పెద్దగా ఏమీ చేయలేదనే అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఏం చేసినా మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైంది. సంక్షేమం ఆగిపోతే పేదవాడి బతుకే కష్టమవుతుంది. ఆయన తర్వాత అలాంటి పరిస్థితులొచ్చాయి! దానిపైనే మేం పోరాడాం. అందుకే జనం మాకు మద్దతిస్తున్నారు. ఆయన సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. జగన్ మాత్రమే వైఎస్ ఆశయాలు నెరవేరుస్తాడని భావిస్తున్నారు. అందుకే మాకు పట్టం కట్టబోతున్నారు. వైఎస్‌పై కృతజ్ఞతతో, జగన్‌పై నమ్మకంతో ఓటేస్తారనేది మా విశ్వాసం.
 
వారికి ఓటమి భయం...
ఓటమి భయంతో ప్రత్యర్థులు ఏం చేసినా, ఏమేం పంచినా ఫలితముండదు. మహా నేత కుటుంబానికి అండగా నిలబడాలన్న విశాఖ ఓటరు నిర్ణయాన్ని ఏ శక్తులూ మార్చలేవు. బాబు హయాంలో అనుభవించిన కష్టాలను, వైఎస్ కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పూసగుచ్చినట్టు చెబుతున్నారు. వారి మనోబలాన్ని డబ్బులతో, మద్యం సీసాలతో కొనడం ఎవరివల్లా కాదు’’
Share this article :

0 comments: