సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా

సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా

Written By news on Wednesday, May 14, 2014 | 5/14/2014

సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషించిన పార్టీ నేతలు
గ్రామీణ ప్రాంతాలపై పార్టీ పట్టు సాధించిందని వెల్లడి
ఈ ఫలితాలను చూస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా

 
 సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఓటర్లలో కనిపించిన మార్పు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడానికి చిహ్నమని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే గ్రామీణ ఓటర్ల ప్రభావం ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మంచి ఫలితాలను సాధించడంతో మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలోని 92 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.
 
 ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ నేతలు సమావేశమై మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఈ ఫలితాల సరళిని విశ్లేషించిన తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందన్న అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు ఫలితాలు రానప్పటికీ, ప్రాదేశిక ఫలితాలు అనుకూలంగా రావడాన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు సాధించినట్టు ప్రాదేశిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషించారు. కీలకమైన గ్రామీణ ఓటర్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి వైఎస్సార్‌సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తేల్చుతున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలో మొత్తం 3.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు (కార్పొరేషన్లు మినహా) 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.
 
 
 ఈ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది 45 లక్షల మంది ఓటర్లే. మిగతా 1.40 కోట్ల మంది మున్సిపాలిటీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మున్సిపాలిటీలతో సంబంధం లేని మిగతా 76 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో 1.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మిగతా ఓటర్లు మిగిలిన 12 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2.94 కోట్ల మంది (80 శాతం) ఓటు వేశారు. మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయని తేటతెల్లమవుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. పైగా, సీమాంధ్రలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గతనెల 12న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు  ముందే మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రెండు రోజులకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి పేరుతో విస్తృత ప్రచారం నిర్వహించారు.
 
 పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సాధారణ ఎన్నికల పోలింగ్‌నకు దాదాపు నెల గడువు ఉంది. ఈ 30 రోజుల్లో సీమాంధ్రలోని అనేక జిల్లాల  ప్రజల్లో ఎంతో మార్పు కనిపించిందని, ప్రతి జిల్లాలోనూ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని నేతలు పేర్కొన్నారు. ఈ సమయంలో 5 నుంచి 6 శాతం ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఊహించని విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క, ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు, అభ్యర్థి ప్రభావమే ఉంటుంది తప్ప రాష్ట్ర, జాతీయ అంశాల ప్రభావం ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు ముడిపెట్టలేమని, ప్రజల్లో ఈ విషయంలో చాలా స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు తేడా కొన్ని జిల్లాల్లో కొట్టొచ్చినట్లు కనిపించిందని నేతలు విశ్లేషించారు.
 
  ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగింటిలో టీడీపీ, రెండింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. మంగళవారం నాటి ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం చేజిక్కించుకోవడానికి అవసరమైన జెడ్పీటీసీ స్థానాలను గెల్చుకుంది. వైఎస్సార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ మూడింటిలోనే గెలుపొందింది. నాలుగు చోట్ల టీడీపీ ఎక్కువ వార్డులను గెల్చుకుంది. అయితే, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని నేతలు విశ్లేషించారు.
Share this article :

0 comments: