‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య

‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య

Written By news on Saturday, May 17, 2014 | 5/17/2014

‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య
వి.కొత్తపాలెం (కోడూరు), న్యూస్‌లైన్ : ‘పిల్లలు భయపడుతున్నారు.. కాస్త దూరంగా టపాసులు కాల్చుకోండి’ అని అభ్యర్థించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు పైశాచికానికి తెగబడ్డారు. బాంబు అంటించి అతని తలపై వేశారు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని వి.కొత్తపాలెంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందడం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వి.కొత్తపాలెంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవం చేసుకున్నారు. టపాసులు కాలుస్తూ కొంత దూరం వెళ్లాక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ (30) టపాసులు కాల్చడం వల్ల పిల్లలు, మహిళలు భయపడుతున్నారని, కొద్దిగా దూరంగా కాల్చుకోమని కోరాడు. దీనికి ఆగ్రహించిన ఓ కార్యకర్త వంకాయ బాంబు అంటించి సురేష్ తలపై వేయడంతో తల పగిలి మెదడు బయటికొచ్చి అక్కడిక్కడే చనిపోయాడు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ హరి రాజేంద్రబాబు హుటాహుటిన గ్రామానికి వచ్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. మృతునికి రెండేళ్ల క్రితమే వివాహమైంది.
 
బాంబులతో బీభత్సం

పోలీసుల కథనం ఇలా ఉండగా ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉంది. విజయోత్సవం చేసుకునేందుకు కావాలనే కొంతమంది టీడీపీ నాయకులు బయట నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన బాంబులను తీసుకొచ్చారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ పాలనలో ఉండటంతో తొలుత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోకి రాగానే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ భవనం మీదకు బాంబులు విసిరినట్టు చెప్పారు.

ఈ పరిణామంతో కొంతమంది తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పేలిన బాంబుల అవశేషాల్లో గాజు పెంకులు, సూదులు ఉన్నాయని, వంకాయ బాంబుల్లో అయితే ఇలా ఉండవని చెబుతున్నారు. ఈ ఘటనపై మృతుని మేనమామ యలవర్తి నాగమల్లికార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన యలవర్తి వెంకటేశ్వరరావు, రేపల్లె ప్రతాప్, మరో పదిమంది అనుచరులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.
Share this article :

0 comments: