వర‘ప్రసాదమే' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర‘ప్రసాదమే'

వర‘ప్రసాదమే'

Written By news on Saturday, May 3, 2014 | 5/03/2014

వర‘ప్రసాదమే’
  •     తిరుపతిలో ప్రాభవం చూపలేని కమలం
  •      ఎంపీ స్థానాన్ని విస్మరించిన టీడీపీ  
  •      ఓటు మీఇష్టం అంటున్న తెలుగుతమ్ముళ్లు
  •      చిత్తయిన టీడీపీ, బీజేపీ పొత్తు
  •      రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో కుదరని సఖ్యత
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తిరుపతి లోక్‌సభ స్థానం ఎన్నిక విషయం గురించి తెలుగుదేశం పార్టీ నేతలు మరచిపోయారు. ఈ లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు బీజేపీ పేరెత్తాలంటేనే హడలిపోతున్నారు. తమ నోటి వెంట ఆ మాట వస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు వచ్చేవి కూడా పోతాయనే భయం పట్టుకుంది. ఎమ్మెల్యే ఓటు తమకు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ తెలుగు తమ్ముళ్లు  ప్రచారం ప్రారంభించారు. రెండు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయడానికి కూడా ఇష్టపడటంలేదు. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు చిత్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిస్తున్నాయి.

రెండు పార్టీల అగ్రనాయకులు ప్రచార సభలకు వచ్చిన సమయంలో ఈ రెండు పార్టీల నేతలు, శ్రేణులు తమ జెండాలతో హాజరవుతున్నారు. ముఖ్య నేతలు వెళ్లిపోయిన మరుక్షణం నుంచే ఎవరికి వారే యమునా తీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుకు కలిసొస్తోంది.
 
సర్వేపల్లి : ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండేళ్లుగా ప్రతి ఇంటి గడప ఎక్కి దిగారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, వారిని ఓటు అభ్యర్థించడం, ఎన్నికల ప్రచారం విషయాల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి సమీపానికి కూడా రాలేక పోతున్నారు. సోమిరెడ్డి అయిష్టంగా ఇక్కడి నుంచి పోటీకి దిగారనే విషయం గ్రహించిన ఓటర్లు ఆయన్ను కూడా ఆదరించే అవకాశాలే కనిపించడం లేదు. దీంతో సోమిరెడ్డి తన సంగతి తాను చూసుకుని గట్టెక్కితే చాలనుకుంటూ ఎంపీ ఓటు గురించి అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు.

బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు స్వగ్రామం ఈ నియోజక వర్గంలోనే ఉన్నా ఆ పార్టీ బలం మాత్రం నామమాత్రమే. ఇక్కడ టీడీపీ, బీజేపీ శ్రేణులు కలసి ప్రచారం కూడా చేయలేక పోతున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
 
గూడూరు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోత్స్నలతకు ఆ పార్టీ శ్రేణుల నుంచి మనస్ఫూర్తిగా సహకారం అందడంలేదు. మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చంద్రబాబు జోక్యం తో తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే జ్యోత్స్న గెలిస్తే ఇక తమ ఆధిపత్యం లేకుండా పోతుందనే భయంతో బల్లి వర్గం జ్యోత్స్నకు ఎదురు పోట్లు పొడుస్తోంది. ఇక్కక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌తో పాటు పార్టీ విజయం కోసం సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం ఉరకలెత్తిస్తున్నారు. ఇక్కడ టీడీపీ లోనే అనేక గొడవలు ఉన్నందువల్ల బీజేపీ కేడర్‌తో వారు కలసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు.
 
వెంకటగిరి : తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి రామకృష్ణకు ఏటికి ఎదురీదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తానెలా గట్టెక్కాలనే దిశగానే ఓటర్లను కలుస్తున్నారు. ఎంపీ అభ్యర్థి గురించి పట్టించుకునే ఆలోచన, తీరిక ఆయనకు కనిపించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ వారి ఓటు మాత్రమే అడుగుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు రెండు ఓట్లు ఫ్యాన్‌కు వేయాలని జనంలోకి దూసుకుపోతున్నారు.
 
సూళ్లూరుపేట : టీడీపీ అభ్యర్థి పరసారత్నం తాను గెలిస్తే చాలనే విధంగా సైకిల్‌కు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ప్రచారంలో ఎంపీ ఓటు గురించి ప్రస్తావనే రావడంలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యతో పాటు పార్టీ నేతలు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
 
సత్యవేడు : టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య ఇప్పటి దాకా బీజేపీ కేడర్‌తో కలసి ప్రచారం చేయలేదు. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కేడర్ కూడా తక్కువ కావడంతో బీజేపీ గురించి పట్టించుకోకుండా తన ఓటు మాత్రమే అడుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంతో పాటు పార్టీ నేతలు ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు.
 
శ్రీకాళహస్తి : టీడీపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బీజేపీ ఊసే ఎత్తడం లేదు. ఆ పేరెత్తితే ముస్లింల ఓట్లు పోతాయని ఆయన చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమను సైతం తన వెంట ప్రచారానికి తీసుకువెళ్లేందుకు ఆయన ఇష్టపడటం లేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి రెండు ఓట్లూ ఫ్యాన్‌కు వేయాలని జనాన్ని అభ్యర్థిస్తున్నారు.
 
తిరుపతి : టీడీపీ అభ్యర్థి వెంకటరమణ మీద ఇక్కడ బీజేపీ నాయకులు గతంలో అవినీతి పోరాటం చేశారు. ఆయన భూ కబ్జాదారుడని బహిరంగ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తితో కలసి ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీని వాస్, చంద్రారెడ్డి, శాంతారెడ్డి ఇష్టపడటం లేదు. దీంతో బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని వేరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి వెంకటరమణ కూడా బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే తనకు దెబ్బ తగులుతుందనే ఆలోచనతో వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Share this article :

0 comments: