ఖమ్మం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

ఖమ్మం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

Written By news on Saturday, May 17, 2014 | 5/17/2014

ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా తాను సాధించిన విజయం జిల్లా ప్రజలదేనని ఖమ్మం ఎంపీగా వైఎస్‌ఆర్ సీపీ నుంచి ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. తనను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 14 నెలల పాటు తాను చేసిన ఈ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు తన పట్ల తిరుగులేని ఆదరణ చూపించారని, దీన్ని ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆశించిన విధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

కొన్ని శక్తులు వైఎస్సార్‌సీపీపై కక్ష కట్టి తనకు ఆశించిన  స్థాయిలో మెజారిటీ రాకుండా కుట్ర చేశాయని అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. రాజన్న దీవెనలు, జగనన్న సహకారం, జిల్లా ప్రజల ఆదరణతో లోక్‌సభ సీటుతో పాటు జిల్లాలో మూడు శాసనసభ స్థానాలు గెలిచామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని, సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. 2019లో సీమాంధ్ర, తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు తెచ్చిన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this article :

0 comments: