గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ!

గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ!

Written By news on Friday, May 23, 2014 | 5/23/2014

గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ!
ఈ విషయమై ఢిల్లీకి పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం  
పార్టీకి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది లోక్‌సభ సభ్యులను గెలుచుకోవడమే కాకుండా 45 శాతం మేరకు ఓట్లు సాధించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది. పార్టీకి లభించిన ఓట్లు, సీట్ల వివరాలను తెలియజేస్తూ రాజకీయ పార్టీగా గుర్తింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోందని, అతి త్వరలోనే పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనున్నట్టు అధికారులు తెలిపారు.
 
 
 గుర్తింపునివ్వడాన్ని మరింత వేగవంతం చేయాలని కోరడానికి పార్టీకి చెందిన ఎంపీల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ బయలుదేరి వెళుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వారు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. పార్టీకి త్వరలోనే గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల ఎన్నికల్లో విప్ జారీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించనుండటంతో తమ పార్టీ నేతలపై దుష్ర్పచారం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల నోళ్లు మూతపడతాయని ఆ వర్గాలు చెప్పాయి.
 
 తమ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్దఎత్తున టీడీపీలోకి వెళ్లడానికి చూస్తున్నారంటూ టీడీపీ దుర్మార్గమైన ప్రచారం సాగిస్తోందని పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. గుర్తింపు ఉన్నా లేకున్నా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థి మరోపార్టీలోకి వెళ్లడానికి చట్టం అనుమతించదని, దానికి రాజకీయ పార్టీకి గుర్తింపు ఉండాల్సిన అవసరం కూడా లేదని ప్రజా ప్రాతినిథ్య చట్టం చాలా స్పష్టంగా చెబుతోందని ఆయన చెప్పారు. అలా వెళితే అనర్హత వేటు పడి వెంటనే తమ పదవుల కోల్పోతారన్న విషయం టీడీపీ నేతలకు తెలిసినా కావాలని ఒక గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 ఇడుపులపాయలో జరిగిన శాసనసభా పక్షం సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైనే నిలబడిన విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు అర్థమైందని, అయితే అధికారంలోకి వచ్చాం కదా అనే మిడిసిపాటుతో తమ పార్టీ ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. పార్టీకి గుర్తింపు లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎటువైపైనా వెళ్లొచ్చన్న దుర్మార్గమైన తప్పుడు ప్రచారం చేసిందని, అది సాగకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
 
 ప్రత్యర్థి రాజకీయ పక్షాన్ని మట్టుపెట్టాలనే దుర్మార్గపు ఆలోచనతో వారీ దుష్ర్పచారం చేస్తున్నప్పటికీ, నిజానికి తమ పార్టీలో ఏ స్థాయి నాయకులకు కూడా పార్టీ మారే ఉద్దేశం లేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగుదేశం పార్టీ కుయుక్తుల్ని దుష్ర్పచారాన్ని అడ్డుకోవడంతో పాటు స్థానిక సంస్థల చైర్‌పర్సన్ ఎన్నికల్లో తమ పార్టీ నిలిపే అభ్యర్థులకే ఓటు వేయాలని పార్టీ తరఫున ఎన్నికైన ప్రతినిధులందరికీ విప్ జారీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి
Share this article :

0 comments: