ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం

ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం

Written By news on Saturday, June 21, 2014 | 6/21/2014

రైలు చార్జీల మోత
 ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే ప్రయాణికులపై చార్జీల బాంబు పేలింది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్‌డీఏ సర్కారు నెల తిరగకముందే రైల్వే చార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరిపైనా చార్జీల భారం మోపింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టటానికి కొద్ది రోజుల ముందుగా అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ, సరకు రవాణా చార్జీలనూ పెంచేసింది. రైలు ప్రయాణ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచగా.. రైల్వే రవాణా చార్జీలను 6.5 శాతం పెంచింది. తద్వారా ఏటా రూ.8వేల కోట్ల మేర ప్రజ లపై నేరుగా భారం మోపింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
 
  ప్రయాణ చార్జీల పెంపు ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుండగా.. రవాణా చార్జీల పెంపు ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు.. అన్ని రకాల నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీయటం ద్వారా పరోక్షంగా భారాన్ని మరింత పెంచనుంది. రైలు చార్జీల పెంపును ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత భారీగా చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపటం నేరపూరితమని ఎన్‌డీఏ సర్కారుపై మండిపడ్డాయి. చార్జీలను పెంచే ముందుగా పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదని ప్రశ్నించాయి. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రకటించాక.. చార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకోవటంలో ఔచిత్యమేమిటని నిలదీశాయి. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి.
 
 దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్న వారం రోజుల్లోనే రైల్వే చార్జీల పెంపును ప్రకటించటం గమనార్హం. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 16వ తేదీనే రైల్వేశాఖ చార్జీల పెంపును ప్రకటించింది. పెంపు అదే నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో పెంపు ప్రకటన చేయటం పట్ల తీవ్ర విమర్శలు రావటంతో.. చార్జీల పెంపు అమలుపై రైల్వేబోర్డు వెనక్కు తగ్గింది. చార్జీల పెంపుకు సంబంధించిన వ్యవహారాన్ని తర్వాత రాబోయే ప్రభుత్వానికే అప్పగించాలని రైల్వేబోర్డుకు నిర్దేశిస్తూ నాటి యూపీఏ సర్కారులోని రైల్వేమంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రకటన జారీచేశారు. ఈ మేరకు చార్జీల పెంపును నిలిపివేస్తున్నట్లు రైల్వేబోర్డు ఆ వెంటనే అధికారికంగా ప్రకటించింది.
 
 ‘నిలిపివేత’ను ఉపసంహరిస్తున్నానంతే...
 తాజాగా శుక్రవారం రైలు చార్జీల పెంపును ఢిల్లీలో ప్రకటించిన కొత్త రైల్వే మంత్రి సదానంద్‌గౌడ.. ‘‘మా ముందరి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేయక తప్పని పరిస్థితి. చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే నేను ఉపసంహరిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. గత (యూపీఏ) ప్రభుత్వం సమర్పించిన తాత్కాలిక బడ్జెట్‌లో.. మే 16వ తేదీన ప్రకటించిన చార్జీల పెంపు ప్రాతిపదికగా ఆదాయాన్ని అంచనా వేసిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఖరారు చేసిన చార్జీలను పెంచనిదే వార్షిక వ్యయాన్ని పూర్తిచేయటం సాధ్యం కాదన్నారు. కాబట్టి.. సవరించిన ప్రయాణ చార్జీలు, రవాణా చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్లు వివరించారు. దీంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు అమలులోకి వస్తాయని తెలిపారు. రైల్వేకు ప్రయాణ విభాగంలో ఏటా 900 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
 
 చమురు ధరలు తగ్గితే ఎఫ్‌ఏసీని సమీక్షిస్తాం: రైల్వేశాఖ
 చార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు రావటంతో రైల్వేశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తాజా పెంపుపై వివరణ ఇచ్చింది. రైల్వే ప్రయాణ చార్జీలను 10 శాతం, రవాణా చార్జీలను 5 శాతం చొప్పున పెంచామని.. అయితే ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఏసీ) కూడా కలవటంతో ఈ పెంపు 14.2 శాతానికి, 6.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల ప్రకారం రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ ధరలను సవరించినట్లు.. ప్రతి ఆరు నెలలకోసారి రైల్వే కూడా ఎఫ్‌ఏసీని సవరిస్తుందని వివరించింది. చమురు ధరల కారణంగా పెంచిన ఎఫ్‌ఏసీని.. చమురు ధరలు తగ్గిన పక్షంలో సమీక్షించటం జరుగుతుందని తెలిపింది. గత ప్రభుత్వం కూడా రెండు పర్యాయాలు ఎఫ్‌ఏసీని అమలు చేసిందని.. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో దీనిని అమలు చేసిందని ఉటంకించింది.
 
 ముందే తీసుకున్న టికెట్లకూ పెరిగిన చార్జీలు వర్తిస్తాయి
 ప్రయాణ చార్జీలను అన్ని తరగతుల్లోనూ 10 శాతం మేర పెంచగా.. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఏసీ) రూపంలో అదనంగా మరో 4.2 శాతం పెంచారు. మొత్తంగా 14.2 శాతం మేర అన్ని తరగతుల చార్జీలూ భారం కానున్నాయి. లోకల్ రైలు టిక్కెట్‌లు, నెలవారీ పాస్‌ల పైన కూడా చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 25 (బుధవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.
25వ తేదీ అర్ధరాత్రి తర్వాత ప్రయాణం చేయటం కోసం.. పెరిగిన చార్జీల కన్నా ముందే ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను తీసుకుని ఉంటే.. పెరిగిన చార్జీల మేరకు తేడాను టికెట్ కౌంటర్లలో కానీ, ప్రయాణ సమయంలో రైళ్లలో టీటీఈలకు గానీ చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలను పెంచలేదు.

 ఇదా మీ సానుభూతి?: కాంగ్రెస్

 ‘‘ప్రభుత్వంలోకి వచ్చాక.. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా.. శ్వేతపత్రం విడుదల చేయకుండా.. రైల్వే బడ్జెట్ కోసం ఆగకుండా.. రైల్వే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదం టూ.. చార్జీలను పెంచేశారు. నిన్నటివరకూ సామాన్యుడి ఆందోళనలను ఎలా పరిష్కరించాలనే దానిగురించి మాట్లాడిన వీరు.. తమకు ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చిన అదే సామాన్యుడిపై ఇప్పుడు భారం మోపటం మొదలుపెట్టారు.. సామాన్యుడిపై చూపుతున్న సానుభూతి ఇదా?’’ అని కాంగ్రెస్ నేత మనీశ్‌తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నేరపూరితం.. ఉపసంహరించాలి: సీపీఎం
 ‘‘రైల్వే చార్జీల అనూహ్య పెంపును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అదుపులేని ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై రైలు చార్జీల పెంపు పెను భారంగా మారుతుంది. ఇది నేరపూరితం. చార్జీల పెంపును ఉపసంహరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అసలీ ప్రభుత్వ కపటత్వాన్ని చూడండి.. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల మధ్య, బడ్జెట్‌కు ముందు చార్జీలు పెంచితే.. ఎంత అప్రజాస్వామికమోనని వారు అంటారు. మోడీ సర్కారు సరిగ్గా అదే అప్రజాస్వామికంగా పార్లమెంటును అధిగమించి చార్జీలు పెంచింది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు.
 
 సరకు రవాణా చార్జీలు 6.5%
 సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచగా.. ఇందులో 1.4 శాతం ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఏసీ)గా రైల్వే పేర్కొంది. సరకుల వర్గీకరణను కూడా 4 తరగతుల నుంచి 3 తరగతులకు తగ్గించారు. ఇప్పటి వరకు సరకు రవాణాకు కనీస దూరం 100 కిలోమీటర్లు కాగా.. దీనిని ఇప్పుడు 125 కిలోమీటర్లకు పెంచారు. సరకు రవాణా చార్జీల పెంపు పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా ఉక్కు, సిమెంటు, విద్యుత్, ఎరువులు, రసాయనాలు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ధరలూ పెరగనున్నాయి.
 
 పెరిగిన రైల్వే చార్జీలు ఇవీ..
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ/విశాఖపట్నం/తిరుపతి: రైల్వే చార్జీల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడనుంది. ఆర్‌టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను తట్టుకోలేక రైళ్లను ఆశ్రయిస్తున్న జనానికి.. ఇప్పుడు ఆ చార్జీలు కూడా భారీగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతినిత్యం 709 రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీరందరిపైనా చార్జీల ప్రభావం ఉండనుంది. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే సుమారు రెండు లక్షల మంది నిత్యం రాకపోకాలు సాగిస్తారని అంచనా. 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి స్లీపర్ క్లాస్ అయితే సుమారు రూ. 30 నుంచి రూ. 50 మేర చార్జీ పెరిగింది. ఏసీ త్రీ టైర్, టు టైర్ అయితే రూ. 50 నుంచి రూ. 100 మధ్య పెరిగింది.
 
 వరుసగా రెండేళ్లు భారీ వడ్డనలు..
యూపీఏ హయాంలో గతేడాది రైల్వే చార్జీలు భారీగా పెరిగాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మరోసారి చార్జీల భారం మోపింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రజలపై రెండు సార్లు రైల్వే చార్జీల భారం పిడుగుపాటులా పడడం గమనార్హం. అంతకుముందు పదేళ్ల పాటు రైల్వే చార్జీల్లో ఎగువ స్థాయి తరగతుల్లో ఒకటీ అరా పెంపు తప్ప ఎలాంటి మార్పులూ లేవు.
అయితే.. 2012 ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్‌త్రివేది రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రూ. 4000 కోట్ల మేర చార్జీల పెంపు ప్రకటించారు. కానీ తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో త్రివేది మంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. కానీ ఆ మరుసటి ఏడాది.. అంటే గత ఏడాది 2013 జనవరి 21న అప్పటి రైల్వే మంత్రి బన్సల్ చార్జీలు పెంచారు. యూపీఏ-2 పాలనా కాలం పూర్తయ్యే వరకు కూడా చార్జీలు పెంచొద్దని భావించినప్పటికీ నష్టాలు, నిర్వహణ భారం దృష్ట్యా చార్జీల పెంపు అనివార్యమైందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఏడాది ప్రజలపైన రూ. 6,600 కోట్ల మేర భారం పడింది.
Share this article :

0 comments: