దాడులు చేస్తే సహించేది లేదు..జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దాడులు చేస్తే సహించేది లేదు..జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే..

దాడులు చేస్తే సహించేది లేదు..జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే..

Written By news on Saturday, June 14, 2014 | 6/14/2014

రుణమాఫీపై బాబుకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె, డేవిడ్‌రాజు, ముత్తుముల ధ్వజం  

 మార్కాపురం టౌన్ :  రైతుల రుణమాఫీపై సీఎం చంద్ర బాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూశానని, రుణమాఫీతో వారి కష్టాలు తీరుస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇవ్వకుండానే రైతుల రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అధికారం చేజిక్కించుకునేందుకు బాబు సాధ్యం కాని హామీలిచ్చారని, దీన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందే పసిగట్టారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిమితులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చెబుతుండగా అక్కడి టీడీపీ శాసనసభ్యులు మాత్రం రైతులపై ఉన్న రుణాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో రైతుల రుణమాఫీపై పట్టుబడతామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తామన్నారు.

దాడులు చేస్తే సహించేది లేదు
పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు న్యాయం పక్షాన నిలవాలని కోరారు. తొలుత ఆర్డీఓ కొండయ్య, డీఎస్పీ రామాంజనేయులును కలిసి పశ్చిమ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ముత్తుముల, జంకె విజ్ఞప్తి చేశారు.

విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి, దోర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, గాలి రమణారెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దప్పిలి విజయభాస్కరరెడ్డి, బి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే..
జిల్లాలో ఫ్యాను గుర్తుపై గెలుపొందిన 31 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్ సీపీలోనే ఉన్నారని, ఎవరూ టీడీపీలోకి వెళ్లలేదని మార్కాపురం, త్రిపురాంతకం జెడ్పీటీసీలు జవ్వాజి రంగారెడ్డి, చంద్రమౌళిరెడ్డి తెలిపారు. జిల్లా జెడ్పీ పీఠం తమదేనని చెప్పారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా తమ పార్టీలోకి వస్తున్నారని టీడీపీ నాయకులు దుష్ర్పచారం చేయడంపై మండిపడ్డారు.
Share this article :

0 comments: