కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ

కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ

Written By news on Friday, June 20, 2014 | 6/20/2014

కొలువుదీరిన ఏపీ తొలి అసెంబ్లీ
ముహూర్తం ప్రకారమే సభ ఆరంభం
చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి పరస్పర అభివాదాలు
సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
ముందు చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం

సాక్షి, హైదరాబాద్: 
కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ గురువారం కొలువు దీరింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న పాత అసెంబ్లీ హాలు ఇందుకు వేదికైంది. మెడలో పార్టీ కండువాలు, ఆత్మీయ కరచాలనాలు, ఉభయ కుశలోపరి పలకరింపుల మధ్య ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు సభ ప్రారంభమైంది. సీనియర్ సభ్యుడైన పతివాడ నారాయణ స్వామి నాయుడు ఈ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్ సభలోకి అడుగిడగానే అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, నూతన ప్రజాప్రతినిధులు గౌరవసూచకంగా లేచి నిలబడి సాదర స్వాగతం పలికారు. అనంతరం సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూర్చున్న చోటుకు వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురూ పరస్పర అభివాదాలు, కరచాలనం చేసుకున్నారు. సభా మర్యాదలను చదివి వినిపించిన అనంతరం సభ్యులతో ప్రొటెం స్పీకర్ పతివాడ ప్రమాణ స్వీకారాలు చేయించారు.

 ప్రమాణ స్వీకారం మొదలైందిలా..
 తొలుత సభా నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దైవం పేరిట శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పేరు పిలిచినప్పుడు పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ ముకుళిత హస్తాలతో ప్రొటెం స్పీకర్‌కు, సభికులకు, సిబ్బందికి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులయిన కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పతోపాటు సీహెచ్ అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.సునీత తదితర మంత్రులు ప్రమాణం చేశారు. మంత్రుల్లో కామినేని శ్రీనివాసరావు ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగతా వారందరూ తెలుగులో చేశారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి కె.మృణాళిని పేర్లు పిలిచినప్పుడు సభలో లేకపోవడంతో వారు ఆ తర్వాత ప్రమాణం చేశారు.

 అక్షర క్రమంలో మహిళా సభ్యులు..
 మంత్రులవంతు పూర్తయిన తర్వాత మహిళా శాసన సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో జి.ఈశ్వరి పవిత్ర హృదయం సాక్షిగా ప్రతిజ్ఞ చేయగా మిగతా వారు దైవసాక్షిగా చేశారు. పురుషుల్లో తొలుత వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరు పిలిచినప్పటికీ సభలోనే ఉన్న ఆయన తన ప్రమాణాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. 72 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో అరగంట పాటు మధ్యాహ్న భోజన విరామాన్ని ప్రకటించారు. సభ తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన వెంటనే.. అంతకుముందు పిలిచినప్పుడు సభలో లేని స్వతంత్ర సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చి ప్రమాణం చేశారు.

 166 మంది ప్రమాణ స్వీకారం..
 మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కూడా రాలేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం టీ విరామ సమయానికి 151 మంది సభ్యులు ప్రమాణం చేయగా మిగతా వారితో ఆ తర్వాత చేయించారు. సభ ముగిసే సమయానికి మొత్తం 175 మంది సభ్యుల్లో 166 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అప్పటికే పతివాడతో గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. వివిధ కారణాలతో ఆరుగురు సభ్యులు-రవీంద్రారెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, వి.సత్యనారాయణ మూర్తి, శ్యాంసుందర్ శివాజీ, జీవీ ఆంజనేయులు ప్రమాణం చేయలేదు. ప్రమాణానికి ముందే తంగిరాల ప్రభాకర్(నందిగామ), శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ) మృతి చెందిన విషయం విదితమే. వీరిద్దరికీ సంతాపం తెలిపే తీర్మానాలు ప్రవేశపెట్టాక పలువురు వారి సేవలను కొనియాడారు.అనంతరం సభా శుక్రవారానికి వాయిదా పడింది. ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో శుక్రవారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది.
Share this article :

0 comments: