ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌

ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌

Written By news on Tuesday, June 24, 2014 | 6/24/2014

జాప్యమేల బాబూ?
ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి
వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
కమిటీలతో కాలయాపన చేస్తే మరింత నష్టం ,గవర్నర్ ప్రసంగంలో గత పదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు
కానీ చంద్రబాబు హయాంతో పోలిస్తే గత పదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని గణాంకాలే చెబుతున్నాయి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రభుత్వం తీరును ఎండగట్టిన జగన్
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు మీరిచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ హామీలు నెరవేరుస్తారని కోట్లాది మంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా చెల్లెమ్మలు రుణాలు మాఫీ అవుతాయని ఆశగా ఉన్నారు. మీరేమో కమిటీలంటూ కాలయాపన చేయడం సమంజసంగా లేదు..’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ల పెంపు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, 9 గంటలపాటు ఉచిత కరెంటు వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అడుగూ ముందుకుపడటం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
 
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో దాదాపు 2 గంటలపాటు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అయితే ప్రతిపక్ష సభ్యులపై ముందే దాడికి సిద్ధమైన రీతిలో 17 సార్లు అధికారపక్ష టీడీపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘మీరు మాట్లాడినప్పుడు మేం శ్రద్ధగా విన్నాం. మీరు కూడా మా ప్రసంగం పూర్తయ్యాక స్పందించవచ్చు. అంతేకానీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేది వినడానికి కూడా ఓపిక లేదంటే ఎలా?’ అంటూ జగన్ ప్రశ్నిస్తూ, అక్కడక్కడా అధికారపక్షానికి చురకలంటిస్తూ తన ప్రసంగం కొనసాగించారు.
 
 ఇంకా అధ్యయనం దేనికి?
 
 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం కోటయ్య కమిటీ, ఆ కమిటీ ఈ కమిటీ అంటూ జాప్యం చేస్తుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ‘‘సీజన్ వచ్చినందున వెంటనే పంట రుణాలివ్వాలి. పాత రుణాలను కడితేగానీ కొత్త రుణాలివ్వలేమని బ్యాంకులు అంటున్నాయి. పైగా రుణాలను చెల్లించాలని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. (ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో జూన్ 17న ఓ రైతుకు ఎస్‌బీఐ బ్యాంకు ఇచ్చిన నోటీసును సభలో చూపించారు.) రైతుల రుణమాఫీపై అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ) సమావేశంలో రూ.87వేల కోట్లకుపైగా రైతుల రుణాలు ఉన్నాయని, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. మరి ఇంకా అధ్యయనం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. రుణాల మాఫీ జాప్యం జరిగితే రైతులు పంట బీమాను కోల్పోయే ప్రమాదం ఉంటుందని జగన్ అన్నారు. ఆయన శాసనసభలో అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే..
 
 కోతతో విలవిల..
 
 నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గ్రామాల్లో ఇప్పటికీ 15 గంటలపైనే కోత సాగుతోంది. అధికారికంగానే 12 గంటలు కోత విధిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో రైతులు నరకం అనుభవిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలూ మూతపడుతున్నాయి. చాలామంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాదు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్న మీరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సీమాంధ్ర పదమూడు జిల్లాల్లో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కళాశాలలు ఫీజులు కట్టాలని నోటీసులు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు. కానీ ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు చెల్లించనిదే విద్యార్థులను చేర్చుకోని పరిస్థితి. మరోవైపు సీమాంధ్రలో పెద్దాసుపత్రులు లేవు. ఆరోగ్యశ్రీ పేషెంట్లందరూ హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితి. ఆస్పత్రి యాజమాన్యాలు వెనక్కు పంపిస్తున్నాయి. వైద్య ఖర్చులు ఎవరు చెల్లిస్తారో చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. సంతకం పెట్టిన రోజునుంచే వెయ్యి రూపాయలు పింఛన్ వస్తుందని అవ్వాతాతలు సంబరపడ్డారు. కానీ అక్టోబర్ 2 నుంచి అమలుచేస్తామని మీరు అంటున్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సింది పోయిమిన్నకున్నారు.
 
 లీడర్ అంటే..
 
 నాయకుడనేవాడు ప్రజలను నిరాశా నిస్పృహలకు గురిచేయడం కాకుండా.. ముందుండి నడిపించాలి. హైదరాబాద్ లేకపోయినా మనం పుంజుకునే అవకాశాలున్నాయి. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నాగార్జున, కోరమాండల్ వంటి కంపెనీలున్నాయి, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది, హెచ్‌పీసీఎల్ వంటి రిఫైనరీలున్నాయి, ఫార్మా రంగం ఉంది. గంగవరం, కృష్ణపట్నం వంటి భారీ ఓడరేవులున్నాయి. పారిశ్రామిక వేత్తలున్నారు, భూములున్నాయి, వీటన్నిటినీ వినియోగించుకోవాలి. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో విమానాశ్రాయాలున్నాయి.. వాటిని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. మనకున్న బలం వ్యవసాయం, పరిశ్రమలే. ఇక్కడ ఒక్క ఐటీ పరిశ్రమ లేదు.. గుజరాత్‌లో కూడా ఐటీ పరిశ్రమ లేకపోయినా ముందంజ వేశారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణలోనూ ఐదు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. సీమాంధ్రలో ఆరు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.
 విభజించిన వారికి వంతపాడారు..
 
 రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తీరని అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా వినలేదు. నాడు విభజనకు లేఖ ఇచ్చారు.. పార్లమెంటులో మద్దతు పలికారు(టీడీపీని ఉద్దేశించి). కనీసం అన్యాయం జరిగిందని గవర్నర్ ప్రసంగంలోనైనా ఆ నష్టాన్ని గుర్తించారు.. సంతోషం. (దీనిపై టీడీపీ సభ్యులు అడ్డుపడగా..)అసలు మీరు విభజనకు వంతపాడిన పార్టీ(బీజేపీ) పంచనే చేరారు కదా? ఎవరివల్ల రాష్ట్ర విభజన జరిగిందో అందరికీ తెలిసిందే కదా!
 
 వైఎస్ స్ఫూర్తితోనే..
 
 మా పార్టీ పేరులోనే రైతు ఉన్నాడు.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే రైతుల పక్షాన నిలబడతాం. వైఎస్ హయాంలో ప్రతి పేదవాడికీ లబ్ధి జరిగింది. అంత వరకూ 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వస్తుంటే.. వైఎస్ హయాంలో 71 లక్షలకు వర్తింపచేశారు. అప్పటి వరకూ ఏడాదికి 2.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టిస్తే వైఎస్ వచ్చిన తర్వాత ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్ రాకముందు 1.2 కోట్లు రేషన్ కార్డులుఉంటే.. ఆయన వచ్చాక 2 కోట్లకు చేరాయి.
 
 ప్రతిపక్ష పార్టీ అంటే అన్నీ వ్యతిరేకించేది కాదు..
 
 ప్రతిపక్ష పార్టీగా కొత్త సాంప్రదాయానికి తెర తీస్తాం. ప్రతిపక్ష పార్టీ అంటే అన్నీ వ్యతిరేకించేది కాదు. ఆ ఆలోచన నుంచి అధికార పక్షం కూడా బయటకు రావాలి. రైతులకు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందంటే అధికార పక్షానికి ప్రతిపక్షంగా సహకరించే విషయంలో ముందుంటాం. అంతేగానీ ప్రతిదాన్నీ రాజకీయం చేయడం తగదు.
 
 హామీలపై చర్చించాకే మేనిఫెస్టో..
 
 హామీలు ఇచ్చేముందు అమలు చేయగలమా లేదా అని ఆలోచించే మేం ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాం. బాబు హామీలు ఇచ్చి అమలు చేస్తానని చెబుతున్నారు మరి మనమెందుకు చెయ్యలేమని, ఆర్థిక సలహాదారులతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరితో సుదీర్ఘంగా చర్చించాను. కానీ హామీలు ఇచ్చాక అమలు చేయకపోతే అభాసుపాలవుతామని అందరూ చెప్పారు. హామీలు అధికారంలోకి తీసుకువచ్చేందుకే కాదు, ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలి. అందరి నిర్ణయం మేరకే నాడు సాధ్యంకాని హామీలివ్వలేదు.. అంతేగానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కమిటీలంటూ కాల యాపన చేసేందు కు కాదు.
 
 సింగపూర్ సిటీ వస్తోందని ఆశగా ఉంది..
 
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపదే పదే రాజధాని సింగపూర్ సిటీ కన్నా అద్భుతంగా చేస్తామని అన్నారు. అంతకంటే మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. కేపిటల్ సిటీ అంటే అసెంబ్లీ, హైకోర్టులే కాదు.. అందరికీ అందుబాటులో, రాష్ట్రానికి మధ్యలో ఉండేటట్టు చేయాలి. రాజధాని అంటే విస్తారంగా నీళ్లు ఉండాలి.. స్థలాభావం లేకుండా ఉండాలి.. పేదవారినికూడా దృష్టిలో ఉంచుకుని రాజధాని ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
 
 బాబొచ్చె జాబు పోయే పరిస్థితి వద్దు..
 
 ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉపాధి లభించే వరకూ నిరుద్యోగ భృతి అన్నారు. టీవీల్లో పదే పదే ప్రకటనలు ఇచ్చారు. ఇది నిజమేననుకుని ప్రజలు ఓట్లేశారు. కానీ ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. 24 వేల మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ నోటీసులు ఇచ్చారు. గృహనిర్మాణ సంస్థలో 3,600 మంది, వైద్య ఆరోగ్యశాఖలో 4 వేల మంది, జలయజ్ఞంలో 7 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇలా వివిధ విభాగాల్లో వేలాది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇంటికో జాబు అన్న మీరు ఉన్న జాబు పోయే పరిస్థితి తీసుకురావద్దు. హామీ ఇచ్చినట్లుగా ఇంటికొక ఉద్యోగం కల్పించండి.
 
 
 అన్నీ తెలిసే హామీలిచ్చారు
 మీరు హామీలిచ్చే నాటికి రాష్ట్రం విడిపోతుందని తెలుసు, అన్నీ తెలిసే హామీలిచ్చారని చంద్రబాబుని జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా విమర్శించారు.  ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లును లోక్‌సభలో  ప్రవేశపెట్టారు, 18న బిల్లు ఆమోదించారు.. ఇన్ని జరిగాక మీకు రాష్ట్రం విడిపోతుందని తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 2న అపాయింటెడ్ డే ఇచ్చారనీ మీకు తెలుసని,  రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా ఎంతగా నష్టపోవాల్సి ఉంటుంది, రాజధాని లేకపోతే పరిస్థితి ఏమిటి ఇవన్నీ మీకు తెలియని కావు. ఇవన్నీ తెలిశాకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు మీరు మార్చి 31న మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు మీకు రాష్ట్ర పరిస్థితులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.  గవర్నర్ ప్రసంగంలో రూ.15 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందని రాశారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాక రూ.15 వేల కోట్లా, లేదా ముందే అంత లోటు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీకు ముందే రెవెన్యూ లోటు ఉందని తెలిసి ఇన్నిహామీలు ఎలా ఇచ్చారు. హామీలు ఇస్తే ఎలా నెరవేరుస్తామని అనుకుంటున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2014 ఏప్రిల్ 11న ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారని, రెవెన్యూ వివరాలన్నీ తెలుసుకునే లేఖ రాశారని, హామీలన్నీ ఎలా నెరవేర్చేది కూడా ఇచ్చారని, మరి ఇప్పుడెందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో పేజీ నంబర్6లో ఓవైపు విభజనతో అన్యాయం జరిగింది అంటూనే, మరోవైపు చాలా బాగుంది అంటూ వివరాలు ఎలా ఇచ్చారు.. మళ్లీ రెవెన్యూ డెఫ్షిట్ అంటున్నారు ఇది ఎలా సాధ్యమో చెప్పాలని అన్నారు.
 
 పదేళ్లలో ఏం జరిగిందో మీకు తెలియదా?
 
 ‘‘గవర్నర్ ప్రసంగంలో గడిచిన పదేళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయినట్టు పొందుపరిచారు, కానీ అధికారపక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముంది. మామూలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందీ అని చెప్పడానికి కొన్ని పరామితులుంటాయి. వీటిలో జీడీపీ, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ వంటివాటిని ప్రధాన కొలమానాలుగా తీసుకోవచ్చు.
 
  గడిచిన మూడు దశాబ్దాల్లో జీడీపీ (వార్షిక వృద్ధి రేటు) చూస్తే, 1984-94 మధ్య దేశంలో అది 5 శాతం ఉంటే రాష్ట్రంలో 5.38 ఉంది.. చంద్రబాబు పాలించిన 1994-2004 మధ్య దేశంలో జీడీపీ 6 శాతం ఉంటే, రాష్ట్రంలో వృద్ధిరేటు 5.72 శాతంగా ఉంది. అదే 2004-2014 మధ్య దేశంలో వృద్ధి రేటు 7.56 శాతం ఉంటే రాష్ట్రంలో 8.23 శాతం ఉంది. ఈ లెక్కన చంద్రబాబుకు 57 మార్కులు వస్తే, ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి 82 మార్కులు వచ్చాయి.
 
  ఇక రెండో కొలమానం తలసరి ఆదాయం.. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ.25,321 ఉంటే, 2013-14లో తలసరి ఆదాయం రూ.89,214 ఉంది.. రెండింటికీ పొంతన ఉందా? ఇవి ఇక్కడ తీసిన లెక్కలు కూడా కావు.. కేంద్ర గణాంక సంస్థ ఇచ్చిన అధికారిక డాక్యుమెంట్లు. అభివృద్ధి అంటే ముందుకు పోవడం.. కానీ వెనక్కు వెళ్లడం కాదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుంచుకోవాలి.
 
  మూడోది జీఎస్‌డీపీ.. చంద్రబాబు పాలన ముగిసిన ఏడాది 2004-2005లో జీఎస్‌డీపీ రూ.2,24,713 కోట్లు అయితే.. 2013-14లో అది రూ.8,57,364 కోట్లకు చేరింది. ఇది గర్వించదగిన అంశం. ఇక్కడ దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.
 
  ఇక నాలుగోది జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి... చంద్రబాబు సీఎంగా వచ్చినప్పడు జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి 20.5 శాతం అయితే చంద్రబాబు దిగిపోయేనాటికి దాన్ని 32.4 శాతానికి తీసుకుపోయారు. అంటే అప్పులు పెంచేశారు. 2004-2014 కాలంలో అది 22.4 శాతానికి తగ్గింది.
 
 భారం మోపింది మీరు కాదా..
 
  1994 నుంచి 2004 వరకూ చంద్రబాబు సామాన్యులపై వేయని పన్నులంటూ ఏమైనా ఉన్నాయా? రూ.2 కిలో బియ్యం ధరను పెంచేశారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు, హార్స్‌పవర్ రేటును పెంచారు, రవాణా చార్జీలు పెంచారు, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీరు అమలు చేయలేదు. అయినా రూ.21,994 కోట్ల రెవెన్యూ లోటును చూపించారు. మీరు దిగిపోయాక అంటే 2004-2014 మధ్య కాలంలో రూ.10,329 కోట్ల రెవెన్యూ సర్‌ప్లస్ వచ్చింది. హెచ్‌డీఐ (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్) ఇచ్చిన వివరాల ప్రకారం 1981-1991 మధ్య దేశంలో రాష్ట్రానిది 9వ స్థానం, అదే చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయింది. దీన్నిబట్టి రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?’’
Share this article :

0 comments: