నెల రోజుల్లో సాధించిందేమిటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల రోజుల్లో సాధించిందేమిటి?

నెల రోజుల్లో సాధించిందేమిటి?

Written By news on Wednesday, June 25, 2014 | 6/25/2014

నెల రోజుల్లో సాధించిందేమిటి?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింపు
టీడీపీ దాడుల్లో 17మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల మృతి
 అధికారంలో ఎవరున్నా ఈ తరహా దాడుల్ని ఖండించాలి
 మేము సూచనలు, సలహాలిస్తాం.. వాటిపై ధ్యాస పెట్టాలి
 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ గెలిచి నెల రోజులైందని,  ఈ కాలంలో సాధించిన ప్రగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ సర్కారును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలదీశారు. ఈ నెల రోజుల కాలంలో ఏమి జరిగిందో గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో చర్చను జగన్ కొనసాగించారు. రైతుల సమస్యలు, ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్న తీరును ప్రధానంగా ప్రస్తావించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గాలు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు 17 మంది చనిపోయారని, 110మంది గాయపడ్డారని వివరించారు. అయినా పోలీసులు కేసులు నమోదు చేయడంలేదని చెప్పారు. నిమ్మ, నారింజ వంటి తోటల్ని ధ్వంసం చేస్తున్నారని, చెట్ల పాదుల్లో కిరోసిన్ పోసే దుర్మార్గ స్థితికి చేరుకున్నారని వివరించారు. ‘అధికారంలో ఈవేళ మీరు ఉండొచ్చు.
 
రేపు మేము ఉండొచ్చు. ఎవరున్నా ఈ తరహా దాడుల్ని ఆయా పార్టీల నాయకత్వాలు ఖండించాలి. పోలీసులు చర్య తీసుకుంటారనే నమ్మకాన్ని కలిగించాలి’ అని సలహా ఇచ్చారు. మరోపక్క ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభ పెడుతూ వేరే పార్టీల బీ ఫారాలపై గెలిచిన వారిని లాగేస్తున్నారని, శాసన మండలిలో ఏడుగురు ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి లాగేసుకున్నారని చెప్పారు. ఇలా చేస్తే ప్రతిపక్షం గొంతు నొక్కవచ్చునేమో గానీ నిజమైన ప్రతిపక్షం ప్రజలేనని అన్నారు. ఈ దశలో అధికారపక్ష సభ్యులు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. ప్రతిపక్షంలో ఉన్న తమను ఖండించండి గానీ బండలేయడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని జగన్ అధికారపక్షానికి సలహా ఇచ్చారు. వ్యవస్థలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకోమని కోరితే ఓపికతో వినడం మాని విమర్శలకు దిగడం సరికాదని అన్నారు. ఎవరేమన్నా తాము నిర్మాణాత్మక సూచనలు, సలహాలే ఇస్తామని, వాటిపై ధ్యాస పెట్టాలని హితవు పలుకుతూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంకెల గారడీ, అనవసరపు అపోహలతో కేంద్రం నుంచి అదనపు సహాయం రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభలో మరోసారి గందరగోళం చెలరేగింది.
 
 గోరంట్ల వ్యాఖ్య.. భగ్గుమన్న సభ
 
 ఈ దశలో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని జగన్ మీద విమర్శలు చేశారు. చంద్రబాబుపై ఎన్ని కేసులున్నాయో ఆయన మామగారే (ఎన్టీఆర్) చెప్పారన్న జగన్ వ్యాఖ్యను ఆక్షేపించారు. ‘ఆపరేషన్ ఆకర్ష్ వైఎస్ రాజశేఖరరెడ్డే చేపట్టారు. 16 నెలలు జైల్లో ఉన్న వాళ్లు ఇక్కడెవ్వరూ లేరు. మీ తల్లిగారైన విజయమ్మ గారు ఢిల్లీ వెళ్లి మీపై ఉన్న కేసుల గురించి మంతనాలు చేయలేదా’ అని అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కుమ్మడిగా సభ మధ్యలోకి దూసుకెళ్లారు. సభలో లేని వారి ప్రస్తావన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్ మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. సభను అదుపులో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జగన్ మాట్లాడేందుకు అనుమతిచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ‘విజయమ్మ, రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడటంవల్ల ఏమి ఉపయోగం? వాళ్లు ఇక్కడ లేరు, సమాధానం చెప్పుకోలేరు. ఎన్టీఆర్ గురించి మేమేమీ చెడ్డగా మాట్లాడలేదు. మాట్లాడం కూడా. వాళ్లంతట వాళ్లే ఏదేదో ఊహించుకుని అభాండాలు వేయడం మంచిది కాదు.
 
 దయచేసి సభలో ఉన్న వాళ్ల గురించి మాట్లాడుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది’ అని చెప్పారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తరఫున జగన్ వకాల్తా పుచ్చుకున్నారు. ఎవరెవరికో ఉద్యోగాలు పోతున్నాయని బాధ పడుతున్నారు. జగన్ తీరు చూస్తుంటే బెల్ట్ షాపులు నడిపేవారికి, ఎర్రచందనం స్మగ్లర్లకు కూడా ఉపాధి పోతుందేమోనని భయపడేటట్టున్నారు. ఆద ర్శ రైతు వ్యవస్థ పోతున్నందుకు రైతులు సంతోషపడుతుంటే జగన్‌కు బాధ ఎందుకు? హత్యా రాజకీయాలు, అరాచకాలకు ఎవరు బాధ్యులో ప్రపంచానికి తెలుసు’ అని అన్నా రు. దీనిపై భూమా నాగిరెడ్డి తీవ్ర అభ్యంతరం చెబుతూ ప్రస్తుతం ఆ హంతకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. జరిగే హత్యల్ని ఖండించమని చెపితే ఈ గొడవేమిటని అన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, ఎస్సీ వర్గాలు ఉన్నాయని, వాళ్లను రక్షించే బాధ్యత తీసుకోవాలని సలహా ఇచ్చారు.
 
 అంకెల గారడని నిరూపిస్తారా?: జగన్
 
 తన ప్రసంగంలో పేర్కొన్న సంఖ్యలను అంకె ల గారడీ అనడాన్ని జగన్ తీవ్రంగా ఖండిం చారు. తాను సీఎస్‌వో, కాగ్, ఆర్‌బీఐ డాక్యుమెంట్ల నుంచి ఆ వివరాలు తీసుకున్నానని, అవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. ఒకవేళ అధికార పక్షం దాన్ని నిరూపించకపోతే రాజీనామా చేసి ఇళ్లకు పోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దాన్ని తోసిపుచ్చిన కాలువ శ్రీనివాసులు.. జగన్‌కు అంత సరదా ఉంటే రాజీనామా చేయమనండి అన్నారు. ఆ తర్వాత అధికారపక్ష సభ్యులు జయ నాగేశ్వర్‌రెడ్డి, మీసాల గీత మాట్లాడారు.
 
 కృష్ణా డెల్టాకు నీరు వదలండి
 
 కృష్ణా డెల్టాకు నీరు వదిలేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సాగర్ నుంచి తక్షణమే 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆయన అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: