హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు

హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు

Written By news on Monday, June 30, 2014 | 6/30/2014

హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు
  •      రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
  •       రైతులను మభ్యపెట్టడానికే  రుణమాఫీపై కమిటీ
  •      బాబు వచ్చె.. ఉన్న ఉద్యోగాలు పోయే
  •      ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి
పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి పర్యటించారు. తలపులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి సంతకం రుణమాఫీపైనే అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికి కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
 
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులకు సరైన సమయంలో విత్తనాలు అందక, మరోవైపు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరం అన్ని రకాల రుణాలను ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

బాబొస్తారు..జాబొస్తుందని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓ విధంగా, అధికారం వచ్చాక మరోవిధంగా ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, కేశవరెడ్డి, ఆనంద్, మస్తాన్, మదనమోహన్‌నాయుడు, ఉదయ్‌కుమార్, స్టాంపుల మస్తాన్, ఎస్.హబీబ్‌బాషా, మస్తాన్, సర్పంచ్‌లు రజియాబేగం, రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మల్లికార్జునగుప్తా తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: