గ్రామబాట పడదాం..ఇంటింటికీ వెళదాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామబాట పడదాం..ఇంటింటికీ వెళదాం!

గ్రామబాట పడదాం..ఇంటింటికీ వెళదాం!

Written By news on Sunday, June 15, 2014 | 6/15/2014

గ్రామబాట పడదాం..ఇంటింటికీ వెళదాం!
సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేద్దాం
కృష్ణా జిల్లా నియోజకవర్గాల సమీక్షలో జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
 
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలనే నమ్ముకుందని, మళ్లీ ప్రజల దగ్గరికే వెళుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో వార్డు బాట, గ్రామ బాట పడదామని, ప్రతి ఇంటికీ వెళదామని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అబద్ధపు హామీలను ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి వివరించే పనిని చేపడదామన్నారు. విజయవాడ శివారు కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా శనివారం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అధికారంలో ఉన్న చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న మనకు ఈ ఎన్నికల్లో తేడా కేవలం 5 లక్షల 60 వేల ఓట్లు. దాదాపు కోటీ 30 లక్షల మంది మనల్ని ఆశీర్వదించారు. చంద్రబాబు కూటమికి కోటీ 35  లక్షల మంది ఓటేశారు. ఐదు లక్షలు పెద్ద తేడా కాదు. మూడు లక్షల ఓట్లు అటు నుంచి ఇటువైపు వచ్చి ఉంటే మనం అధికారంలో, వాళ్లు ప్రతిపక్షంలో ఉండేవాళ్లు. ఈ ఐదు లక్షల ఓట్లు తేడా రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
 
 
 అందులో ఒకటి నరేంద్రమోడీ గాలి. రెండోది చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు హామీలు. సాధ్యం కాదని తెలిసినా 88 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీని కాస్తోకూస్తో ప్రజలు నమ్మారు. అదే అబద్ధాన్ని మనం కూడా చెబితే మూడు లక్షల ఓట్లో, అంతకన్నా ఎక్కువ ఓట్లో మన వైపు పడేవి. అప్పుడు మనం అధికారపక్షంలో ఉండేవాళ్లం. బహుశా అటువంటి అబద్ధం చెప్పి ఉంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉండేవాడినేమో!!. కానీ రాష్ట్రంలో ప్రతి రైతు మనల్ని తిట్టుకునేవాడు. మూడు నెలల్లోనే మీరంతా నా దగ్గరకు వచ్చి ఉండేవారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక అందరిలోనూ ఉంటుంది. చంద్రబాబులోనూ ఉంటుంది. మనలోనూ ఉంటుంది. కానీ అందుకోసం ఎన్ని అబద్ధాలయినా ఆడడానికి, ఎన్ని మోసాలైనా చేయడానికి, ఏ గడ్డయినా తినడానికి చంద్రబాబు వెనుకాడలేదు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
 
 కాలేజీలనూ ఉపయోగించుకున్నారు..
 
 ‘చంద్రబాబు ఇన్ని మోసాలు చేయగలిగాడంటే అది ఆయన ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఏకమై మోసం చేయగలిగారు. ఇంతమంది  నీచ రాజకీయాలు చేశారు. అమ్మ బైబిల్ చేతిలో పెట్టుకున్నా రాజకీయం చేశారు. అంత నీచ స్థాయికి రాజకీయాలను దిగజార్చారు. మొదటిసారి అమ్మ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గొంతు వణికింది. బయటకు వెళ్లినప్పుడు భయం పోగొట్టుకోవడానికి కొంతమంది తాయెత్తులు కట్టుకుంటారు, కొందరు దేవుడి ఫొటోలు దగ్గర పెట్టుకుంటారు. అలాగే అమ్మ బైబిల్ చేతిలో పెట్టుకుంది. దాన్ని రాజకీయం చేశారు. చివరికి యువత, కాలేజీలను కూడా వాడుకున్నారు. కాలేజీ యాజమాన్యాలను ఉపయోగించుకున్నారు. పిల్లల్లో విషాన్ని నింపారు. నా మీద కేసులు పెట్టించారు.  ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి మోపినప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాసాన్ని పెట్టాయి. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ అప్పటి ప్రభుత్వాన్ని కాపాడారు. ఇంత దారుణమైన రాజకీయాలను చేశారు’ అని వివరించారు.
 
 బాబును వెనకేసుకొస్తారు జాగ్రత్త!!
 
 ‘వర్షాలు పడ్డాక రైతులంతా పంటలు వేసుకోవడానికి ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకులకు వెళతారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెబుతారు. అలా చెప్పిన వెంటనే రైతులు చంద్రబాబును తిడతారు. ఈ మోసం బయటకు రాక తప్పదు. మరో 15 రోజుల్లో ఇది బయటపడుతుంది. ఈ మోసం బయటకు వచ్చినా కూడా మళ్లీ చంద్రబాబును కాపాడేందుకు అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఏకమవుతాయి. చంద్రబాబు మంచోడు. ఆయనవన్నీ సదుద్దేశాలే. ఆర్‌బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదని చెబుతారు. ప్రజావ్యతిరేక ఓటుతో కాంగ్రెస్ ఎగిరిపోయింది. మనపై వ్యతిరేకత లేదు. మనం, తెలుగుదేశం ఇద్దరం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఫలానాది చేయలేమని, ఇది సాధ్యం కాదని చెబితే కోటీ 30 లక్షల ఓట్లు వచ్చాయి. మోడీ గాలితో పాటు, దొంగ హామీలతో చంద్రబాబు కొంచెం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అయినా మనకు 67 స్థానాలిచ్చి ప్రజలు ఆశీర్వదించారు. వచ్చే ఎన్నికల్లో 167 స్థానాల్లో గెలిపిస్తారు. అతివిశ్వాసాన్ని పక్కనపెట్టి పని చేద్దాం. క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపే చర్యలు చేపడదాం’ అని చెప్పారు.
Share this article :

0 comments: