పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్

పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్

Written By news on Monday, June 16, 2014 | 6/16/2014

అబద్ధం ఆడను.. ఆడలేను
పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్
 
 
పార్టీని పటిష్టం చేసేందుకు అవసరమైన సలహాలన్నీ పాటిస్తా
నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.. ఇంటింటికీ వెళ్లాలి
ముగిసిన కృష్ణాజిల్లా సమీక్ష


విజయవాడ: ‘పదవి ఉన్నా, లేకపోయినా అబద్ధాలు చెప్పను. చెప్పలేను. ఆ పని నావల్ల కాదు. నిజాయతీగానే రాజకీయాలు చేస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అవసరమైన  సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తానని, కానీ అబద్ధాలు మాత్రం ఆడనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ శివారు కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజకీయాల్లో విజయం సాధించామా, లేదా అన్నదే ముఖ్యమని, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేందుకు శ్రీకృష్ణుడంతటివాడే అనేక అధర్మాలు చేశాడని, మనం కూడా అలాగే ముందుకెళ్లాలని సూచించినప్పుడు జగన్ పైవిధంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

తప్పులు పునరావృతం కాకూడదు

‘ఈ ఎన్నికల్లో సంస్థాగతంగా మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే మళ్లీ అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు కూటమికి, మన పార్టీకి కేవలం 5 లక్షల 60 వేల ఓట్లు మాత్రమే తేడా. కోటీ 30 లక్షల మంది మనకి ఓట్లు వేస్తే, చంద్రబాబు కూటమికి కోటీ 35 లక్షల మంది ఓట్లు వేశారు. ఈ 5 లక్షల 60 వేల ఓట్లు పెద్ద తేడా కాదు. ఉప ఎన్నికలో నా కొచ్చిన మెజారిటీయే దేశం మొత్తం నిలబడి చూసేట్టుగా 5.50 లక్షలు ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఓట్ల తేడా పెద్ద తేడా కాదు. ఈ 5 లక్షల 60 వేల ఓట్లలో మూడు లక్షల ఓట్లు అటువైపు నుంచి ఇటువైపు వచ్చి ఉంటే మనం అధికార పక్షంలో ఉండేవాళ్లం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారు. అయినా ఈ తేడా ఎందుకొచ్చిందనే అంశాన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్ర మోడీ గాలి పట్టణాల్లో కొంత పనిచేయడం. రెండో కారణం అసాధ్యమని తెలిసి కూడా చంద్రబాబు రూ.88 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కాస్తోకూస్తో ప్రజలను నమ్మించారు. బాబు మాదిరిగా మనం కూడా సాధ్యం కాదని తెలిసి కూడా హామీలిచ్చినా, ఆయన ఆడిన అబద్ధాలను మనమూ ఆడినా మూడు లక్షల ఓట్లో, అంతకంటే ఎక్కువ ఓట్లో మనకు వచ్చేవి. అవే అబద్ధాలు చెప్పి ఉంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉండేవాడినేమో. కానీ ఆ తర్వాత మూడు నెలలు కూడా తిరక్కుండానే రాష్ట్రంలోని ప్రతి రైతు మనల్ని తిట్టుకునేవాడు. మీరు కూడా వచ్చి నన్ను ప్రశ్నించేవారు. సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు చెప్పావన్నా అని అడిగేవారు. ఎందుకన్నా మోసం చేశావని నిలదీసేవారు. ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసం చేసి, గడ్డి తింటే.. ప్రజలకు న్యాయం చేయగలమా? నాలో కూడా గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒకసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయతీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంతగా మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈ రోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తర్వాత ప్రజలు ఐదేళ్లకే ఇంటికి పంపించి వేస్తారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేదు’ అని జగన్ చెప్పారు.

రోజుకో అబద్ధం రాశారు

‘చంద్రబాబు చేస్తున్న మోసం ఆయన ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఆయనకు జత కలిశారుు. ఎన్నికలకు ముందు రెండునెలల నుంచి రోజుకో అబద్ధం రాశారు. ఇంత అన్యాయంగా కూడా రాస్తారా? అని అనిపించేది. బాధనిపించినా చేయగలిగిందేమీ లేక ప్రజల్లోకి వెళ్లాం. చంద్రబాబు మోసం 10-15 రోజుల్లో బయటపడుతుంది. మరో 10 రోజుల్లో వర్షాలు పడతాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు బ్యాంకుల వద్దకు వెళతారు. పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని అక్కడ చెబుతారు. అలా చెప్పినప్పుడు ప్రతి రైతు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. చంద్రబాబు బండారం పూర్తిగా బయటపడినా ఆయన్ను రక్షించేందుకు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఒక్కటవుతాయి. చంద్రబాబు మంచోడే, ఆయనవి మంచి ఉద్దేశాలే కానీ ఆర్‌బీఐ ఒప్పుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదని చెబుతారు..’ అంటూ వివరించారు. ‘చంద్రబాబు మాదిరిగా ఇన్ని టీవీ చానళ్లు, పత్రికల మద్దతు మనకు లేదు. కానీ చంద్రబాబుకు లేనిది, మనకి ఉన్నది దేవుడి దయ ఒక్కటే. మనం ప్రజల్ని నమ్ముకున్నాం. మళ్లీ ప్రజల వద్దకే వెళదాం. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలి. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు చేపడతాం’ అంటూ జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు
Share this article :

0 comments: