హామీలు అమలు చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హామీలు అమలు చేయండి

హామీలు అమలు చేయండి

Written By news on Sunday, June 29, 2014 | 6/29/2014

హామీలు అమలు చేయండి బాబు
 ఒంగోలు అర్బన్ :బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను భేషరతుగా అమలు చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు వరుసపెట్టి ఉద్యోగాలు తీసేస్తున్నారని వైవీ దుయ్యబట్టారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆయన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి కష్టమొచ్చినా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై నిప్పులుచెరిగారు.

రుణమాఫీపై ప్రమాణస్వీకారం రోజున తొలి సంతకం చేస్తానని చెప్పి.. అధ్యయన కమిటీ ఫైల్‌పై సంతకం చేయడంతో రైతులు అయోమయంలో పడ్డారని అన్నారు. బ్యాంకర్ల ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న రైతులకు చంద్రబాబు ఏ విధంగా భరోసా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ బేస్‌పై పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఎంపీ తప్పుబట్టారు. వైఎస్సార్ సీపీకి చెందిన రేషన్ డీలర్లను తొలగించడం, వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం లాంటివి మానుకోవాలని హితవు పలికారు. 40 రోజులుగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపకపోతే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా పోరాటానికి దిగుతానని హెచ్చరించారు.

 జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..

త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్, బీహెచ్‌ఈఎల్ లాంటి పరిశ్రమలు అవసరమన్నారు. జిల్లాలో షిప్‌యార్డ్, విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పరిశ్రమల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నడికుడి రైల్వేలైన్ ఏర్పాటైతే ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉంటుందన్నారు. యూపీఏ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం రామాయపట్నంలో ఏర్పాటు చేయాల్సిన పోర్టును దుగరాజపట్నం తీసుకెళ్లిందని విమర్శించారు. పశ్చిమ ప్రకాశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే చార్జీలు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: