నంద్యాల రూపురేఖలు మార్చేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నంద్యాల రూపురేఖలు మార్చేస్తా

నంద్యాల రూపురేఖలు మార్చేస్తా

Written By news on Tuesday, June 10, 2014 | 6/10/2014

నంద్యాల రూపురేఖలు మార్చేస్తా
నంద్యాల టౌన్: ఐదేళ్ల పదవీ కాలంలో నంద్యాల పట్టణ రూపురేఖలను మార్చేస్తానని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక తొలిసారిగా సోమవారం మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు కమిషనర్ రామచంద్రారెడ్డి, సిబ్బంది స్వాగతం పలికారు. భూమా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని, రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తానన్నారు. ఆవులు రోడ్లపైన తిరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ప్లాస్టిక్ తిని మృత్యువాత పడుతున్నాయని ప్రతి ఆవును ఎస్‌బీఐ కాలనీలోని గోశాలకు తరలించాలని శానిటరీ సూపర్‌వైజర్ జబ్బార్ మియాకు సూచించారు.

క్లీన్ సిటీలో భాగంగా  పట్టణంలో 450ఎకరాల ఖాళీ స్థలాల్లో కంపచెట్లు తొలగించినా, యజమానులు స్పందించడం లేదన్నారు. యజమానులు స్థలాల్లో మట్టి వేసుకొని, నీరు నిల్వ ఉండకుండా చదును చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికపై అదనంగా సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.

తక్షణమే రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లపై బతికే చిల్లర వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపి తర్వాతే రోడ్లను విస్తరించాలన్నారు. పందులను నిర్మూలించడానికి ఏఆర్ కానిస్టేబుళ్లను రప్పించాలని కలెక్టర్‌ను కోరాలని కమిషనర్‌కు  సూచించారు. కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, జేవీసీ హారిక, గోరె ముర్తుజా, కృపాకర్, విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు వడ్డెశీను, వడ్డెమనోజ్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

నిధుల కోసం ప్రధానిని కలుస్తా: భూమా
నంద్యాల : నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విషయమై ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకపోయినా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో నిధులను రాబట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

పట్టణంలోని పేదలకు 10 వేల ఇళ్ల నిర్మాణాలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మించి తీరుతామన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి కార్యాచరణ రూపొందిస్తానన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల విషయమై ప్రధానితో పాటు కేంద్రంలో పరిచయం ఉన్న నేతలందరినీ కలుస్తానన్నారు. పందుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని.. ఈ విషయమై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. పట్టణంలో రోడ్లపై తిరుగాడే ఆవులను గోశాలకు తరలించాలని.. వీటి పోషణకు దాతలు సహకరించాలని కోరారు.
Share this article :

0 comments: