వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలి

వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలి

Written By news on Thursday, June 5, 2014 | 6/05/2014

వాల్మీకుల్లో ప్రాంతీయ  వ్యత్యాసాలు తొలగించాలి
 వైఎస్ జగన్‌కు వీఆర్‌పీఎస్ నేతల వినతి

 కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్:వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి, ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకు పూర్తి సహకారం అందించాలని వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ నేతలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందించినట్లు సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చే అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చిన విషయాన్ని గుర్తు చేశామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం ప్రభుత్వాలు వాల్మీకులకు ఇచ్చిన హామీని విస్మరించకుండా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వాల్మీకులకు మద్దతుగా నిలవాలని కోరామన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వాల్మీకులు ఎస్‌టీ రిజర్వేషన్‌లో కొనసాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వాల్మీకుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సుభాష్ పేర్కొన్నారు.

 జెడ్పీ చైర్మన్ పీఠం వాల్మీకులకే..: గతంలో ప్రకటించిన విధంగానే కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వాల్మీకులకే కేటాయిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వేరే సామాజిక వర్గానికి  జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జగన్ చెప్పినట్లు సుభాష్ పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, రాష్ట్ర కార్యదర్శి జీ రాంభీంనాయుడు,   గోపి, మల్లేష్, గోవర్ధన్, గణేష్ ఉన్నారు.
Share this article :

0 comments: