కార్యకర్తలతో జగన్ మమేకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలతో జగన్ మమేకం

కార్యకర్తలతో జగన్ మమేకం

Written By news on Thursday, June 12, 2014 | 6/12/2014

నవ్యోత్సాహం
నియోజకవర్గాల సమీక్షతో వైఎస్సార్ సీపీ కేడర్‌లో జోష్
కార్యకర్తలతో జగన్ మమేకం
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం

 
 ‘ప్రతిపక్షంలో ఉన్నామని భయపడాల్సిందేమీ లేదు. నాలుగున్నరేళ్లుగా మనం పడ్డ కష్టాలు జనాలకు తెలుసు. మోసపూరిత హామీలతో గెలిచిన ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి మరెంతో సమయం లేదు. భవిష్యత్తంతా మనదే. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అధికార పార్టీ దాడులకు వెరవద్దు. మీ తోడుగా ఉంటా.

 -  సమీక్ష సమావేశంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
 


విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే చాలు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలుపడ్డ దృశ్యాలు కళ్లముందే ఉన్నాయి. అలాంటిది ఏకంగా తమ అభిమాన నేత తమతో మాట కలపడం.. తమ సలహాలు సూచనలు ఆసాంతం వినడం.. భవిష్యత్ మనదేనని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటా యి. ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నగరంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి.

కార్యకర్తలతో మమేకం


ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పదుల సంఖ్యలో ప్రధాన కార్యకర్తలు, నేతలతో జగన్‌మోహన్‌రెడ్డి మమేకమయ్యారు. ప్రతి నేత, కార్యకర్తను పేరడిగి తెలుసుకున్నారు. వారి రాజకీయ అనుభవం, వారి కుటుంబ నేపథ్యం వారి నోటి నుంచే విన్నారు. ఒకటికి రెండుసార్లు పేర్లు తెలుసుకుని.. మధ్యమధ్యలో పేరుపెట్టి పిలుస్తూ.. వారికి మైక్ అందించే ఏర్పాట్లు చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్ని స్థూలంగా వారికి వివరించారు. అనంతరం వారి నుంచి ఎన్నికల ఫలితాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు, ఓటముల్లో కార్యకర్తలు అనుభవాలను పంచుకున్నారు. గెలిచిన చోట వారనుసరించిన కార్యాచరణ, ఓటమి చెందిన చోట కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణుల విశ్లేషణను నోట్ చేసుకున్నారు.
 
భవిష్యత్‌పై దిశానిర్దేశం

 యువనాయకత్వం ముందుండగా.. కాస్త పెద్దవాళ్లు, ముసలివాళ్లను సలహా కమిటీగా ఏర్పాటు చేస్తూ జిల్లా స్థాయిలో పార్టీకి మరిన్ని జవసత్వాలు చేకూర్చుతామంటూ పార్టీ శ్రేణులకు అధినేత జగన్ మోహన్‌రెడ్డి దిశానిర్దేశనం చేశారు. బూత్/ గ్రామ/వార్డు/డివిజన్ స్థాయి నుంచి మండ లం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామంటూ జోష్‌నిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ సమన్వయపరచగలిగే వారికే పార్టీలో పదవులు కట్టబెడతామంటూ చెప్పారు. పార్టీ శ్రేణుల్ని భవిష్యత్ దిశగా కార్యోన్ముఖుల్ని చేశారు.
 
వైఎస్‌కు నివాళి

 సమీక్ష ప్రారంభానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం హి మాచల్‌ప్రదేశ్ సంఘటనపై రెండు నిముషాలు మౌనం పాటించారు. జగన్‌తోపాటు సమీక్ష సమావేశాల్లో పార్టీ కీలక నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తైనాల విజయ్‌కుమార్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు బూడి ము త్యాలునాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పార్టీ నేతలు గొల్ల బాబూరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, తిప్పల గురుమూర్తిరెడ్డి, మళ్ల విజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు తాజాగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గ సమావేశంలో గండి బాబ్జీ, మాడుగుల సమావేశంలో బూడి ముత్యాలునాయుడు, చోడవరం సమీక్షలో కరణం ధర్మశ్రీ, బలిరెడ్డి సత్యారావు, నర్సీపట్నం సమీక్షలో పెట్ల ఉమాశంకర్ గణేష్, సూర్యనారాయణరాజు, కాకినాడ సమీక్షలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట సమీక్షలో జ్యోతుల నెహ్రూతోపాటు నియోజకవర్గాల పరిధిలోని తాజా, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఉదయం విశాఖ విమానాశ్రయంలో బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది.
 
Share this article :

0 comments: