కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి

Written By news on Saturday, July 12, 2014 | 7/12/2014

‘లోటు’ పూడ్చండి
విభజన చట్టం హామీలను నెరవేర్చండి..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి

 
 ఏపీ రెవెన్యూ లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత లోపించింది
 ఆ లోటును పూడ్చకపోతే రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వస్తాయి
 రాజధాని, మౌలిక వసతుల నిర్మాణానికి తక్షణం నిధులు ఇవ్వండి
 పోలవరం ప్రాజెక్టుకు రూ. 4,000 కోట్లు విడుదల చేయండి
 రివైజ్డ్ బడ్జెట్‌లో ఆయా అంశాలపై స్పష్టతనిస్తామన్న జైట్లీ
► గెయిల్ బాధితులకు ఇతర దేశాల తరహాలో పరిహారం ఇవ్వాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జగన్ విజ్ఞప్తి
 కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో జగన్ మర్యాదపూర్వక భేటీ
 
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ సహా అనేక అంశాల్లో అస్పష్టత ఉందని.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలను సైతం కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించలేదని జగన్ కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తెచ్చారు. రాజధాని సహా అన్నీ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలను గుర్తు చేస్తూ జైట్లీకి ఓ వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన జగన్ శుక్రవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీల బృందంతో కలిసి పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఆయన చాంబర్‌లో భేటీ అయ్యారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన పలు అంశాలను జైట్లీ దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ‘‘కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా విషయాల్లో స్పష్టత లోపిం చిందని జైట్లీకి చె ప్పాం. వీటిపై స్పష్టత ఇవ్వాలని కోరాం. ముఖ్యంగా రెవెన్యూ లోటు విషయానికి వచ్చేటప్పటికి కొందరు రూ. 10 వేల కోట్లు, 11 వేల కోట్లు, 12 వేల కోట్లు, మరికొందరు రూ. 15 వేల కోట్లు అంటున్నారు. అటువంటి రెవెన్యూ లోటు పూడ్చకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. రెవెన్యూ లోటు పూడుస్తామని (నాటి) ప్రధానమంత్రి పార్లమెంటులో చెప్పడం జరిగింది. రాష్ట్రవిభజన చట్టంలోనూ దీన్ని ప్రస్తావించారు. అయితే ఏపీ రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాన్ని కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో మీరు ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటి అంశంపై స్పష్టత ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతామని కేంద్ర ఆర్థికమంత్రికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్‌లో రివైజ్డ్ బడ్జెట్ వస్తుందని, దాంట్లో ఈ అంశాలన్నిటిపై స్పష్టతనిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని విషయాలను వినతిపత్రంలో పేర్కొన్నాం. పోలవరం ప్రాజెక్టుకు కనీసం రూ. 4,000 కోట్లు ఇస్తేనే ఆ పనులు జరుగుతాయి.. లేదంటే పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికాదని మేం జైట్లీకి చెప్పడం జరిగింది. అన్నీ అంశాలు ఆయన సానుకూలంగా విన్నారు. మంచి చేస్తానని చెప్పారు. మంచి జరుగుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ పార్లమెంట్ లోపల పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, బుట్టా రేణుక ఉన్నారు.

గెయిల్ బాధితులకు సాయం పెంచాలి...

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గెయిల్ దుర్ఘటనలో బాధితులకు సాయం పెంచాలని.. జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు విజ్ఞప్తి చేశారు. జగన్.. పార్టీ ఎంపీలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం శాస్త్రిభవన్‌లో ప్రధాన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరు ఎంపీలతో కలిసి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశాం. మొన్న ఓఎన్‌జీసీలో జరిగిన దుర్ఘటన వంటివి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఏవిధంగా నష్టపరిహారం ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని కోరాం. అలాగైతేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని గట్టిగా చెప్పాం. ఆయిల్‌కి ధర నిర్ణయించేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం డాలర్లలో నిర్ణయిస్తారు. దేశీయ మార్కెట్‌లోనూ డాలర్ల రూపంలో లెక్కిస్తున్నా రు. అదే నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి వేరే దేశాలతో ఎందుకు పోల్చడం లేదు? ఆ దేశాల మాది రిగా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని మంత్రిని అడగడం జరిగింది. ఈ మేరకు ఓ వినతిపత్రం ఇచ్చాం. ఇది కొత్త చర్చకు నాంది పలుకుతుందని మంత్రి స్పందించారు. గట్టిగా ప్రయత్నించండి.. ఇలాంటివి చేయగలిగితేనే మీరు మంచి మంత్రిగా గుర్తింపు పొందుతారని మేం ఆయనను కోరాం. ఆయ న చేస్తారన్న నమ్మకం ఉంది’’ అని జగన్ తెలిపారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కి వరం..

పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లాంటిదని జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతకదు. అటువంటి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికావాలి. అది పూర్తయితేనే రైతుల మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అది జరక్కపోతే వ్యవసాయమే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ దిశగా బిల్లు పాస్ చేయడం సంతోషించదగ్గ పరిణామం’’ అని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: