ఎత్తుకు పై ఎత్తులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎత్తుకు పై ఎత్తులు

ఎత్తుకు పై ఎత్తులు

Written By news on Monday, July 14, 2014 | 7/14/2014

టీడీపీకి షాక్
ఎత్తుకు పై ఎత్తులు, నిముషాల వ్యవధిలో జరిగి పోయిన అనూహ్య పరిణామాలు అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాయి. జెడ్పీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా గెలవాలనుకున్న తెలుగుదేశం ఆశలు నెరవేరలేదు. పార్టీకి ఝలక్ ఇచ్చిన పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీ అభ్యర్థిని ఒక్క ఓటు తేడాతో ఓడించడంతో పార్టీ నేతలు ఖంగు తినాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో అప్పటి దాకా గెలుపు ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ నిరుత్సాహంలో మునిగిపోయారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనూహ్య మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అడ్డదారిలో గెలవాలనుకున్న తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా వినియోగించకునే అవకాశం లేకుండా ఒక తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. గెలుపు కోసం తప్పుడు కేసు పెట్టించి పోలీసులను తెలుగు తమ్ముళ్లలాగా మార్చినా ఫలితం దక్కలేదు. గత నెల 20న ఘటన జరిగిందంటూ ఈ నెల 10వ తేదీ రాత్రి ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయకుండా 80 మంది పోలీసులతో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసిన తరహాలో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది.

ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యులు కూడా తమ వారే గెలవడంతో జెడ్పీ చైర్మన్ తమదే అన్న ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంత సభ్యుడు ఈదర హరిబాబు ఇచ్చిన ఝలక్‌తో సీన్ రివర్స్ అయ్యింది. జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవిని కూడా పోగొట్టుకున్న దేశం నేతలు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.  ఈదర హరిబాబు అసంతృప్తితో ఉన్నాడని గుర్తించినా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడంతో వారు దృష్టి పెట్టలేదు.

 జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కోసం కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్‌చౌదరి టీడీపీ తరఫున డాక్టర్ మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మర్రిపూడి జెడ్పీటీసీ తుళ్ళూరి వెంకట నరసింహం బలపరిచారు. ఈలోగా ఈదర హరిబాబు లేచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని చెప్పడంతో ఏవరైనా ప్రతిపాదించి, బలపరచాలని కలెక్టర్ సూచించారు. దీంతో వైఎస్సార్ సీపీ తన వ్యూహం మార్చుకుని తమ అభ్యర్థిని బరిలో దింపకుండా ఈదర హరిబాబుకు మద్దతు ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కనిగిరి జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం ప్రతిపాదించగా, పెద్దారవీడు జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి బలపరిచారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన డాక్టర్ నూకసాని బాలాజీని వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టింది.

 సమావేశంలోనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే జరిగిన ఈ పరిణామాలతో వారు కొద్దిసేపు నిశ్చేష్టులయ్యారు. తర్వాత బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అతని నామినేషన్ చెల్లదంటూ అడ్డగోలు వాదనకు దిగారు. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. ఈ విషయంపై జాప్యం జరుగుతుండంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపుసురేష్ ఎన్నికల నిబంధనను ప్రత్యేకంగా చదివి వినిపిస్తూ తొందరగా ఎన్నిక నిర్వహించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ సలహా తీసుకునేందుకు యత్నిస్తున్నానని, వచ్చింది రెండు నామినేషన్లే కనుక ఈదర హరిబాబు దాఖలు చేసిన నామినేషన్ విషయమై స్పష్టత కోసం వేచి ఉన్నామని చెప్పడంతో అయోమయం నెలకొంది.

అయితే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం జెడ్పీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈదర హరిబాబుకు అతని ఓటుతోపాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 27 మంది మద్దతు కలిసి 28 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అయిన మన్నె రవీంద్రకు టీడీపీ సభ్యుల 24 ఓట్లు, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు సభ్యులతో కలిసి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈదర జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ నూకసాని బాలాజీ పేరును వెలిగండ్ల జెడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి ప్రతిపాదించగా, ఇంకొల్లు జెడ్పీటీసీ పీ.వెంకట రమణ బలపరిచారు. దీంతో ఆయన కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 26 మంది, అతని ఓటు, టీడీపీ నుంచి ఈదర హరిబాబు ఓటు కలిపి 28 ఓట్లు సాధించారు.

ప్రత్యర్థి పటాపంజుల కోటేశ్వరమ్మను సంతనూతలపాడు జెడ్పీటీసీ అభ్యర్థి తన్నీరు శ్రీనివాసరావు ప్రతిపాదించగా, కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్‌చౌదరి బలపరిచారు. అయితే ఈమెకు కేవలం 27 ఓట్లు మాత్రమే రావడంతో డాక్టర్ నూకసాని బాలాజీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయం దక్కడంతో ఒక్కసారిగా ఈదర హరిబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.  ఎన్నిక కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నడిరోడ్డుపై ఇనుప ముళ్లకంచెలు వేసి పాస్ లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు. మీడియాను కూడా సెల్‌ఫోన్లతో లోపలికి అనుమతించలేదు.

 చైర్మన్ ఈదర హరిబాబు ప్రొఫైల్
 పేరు: ఈదర హరిబాబు
 తండ్రి: చెంచయ్య
 స్వస్థలం : నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు
 వయస్సు: 59 సంవత్సరాలు
విద్యార్హతలు: పదో తరగతి వరకు అమ్మనబ్రోలులో చదివారు. ఇంటర్మీడియెట్ చీరాల వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ను ఒంగోలు సీఎస్‌ఆర్ శర్మా కాలేజీలో చదివారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్‌ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజకీయ జీవితం: తొలుత స్వగ్రామమైన అమ్మనబ్రోలు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షునిగాను, 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇవి కాకుండా ఏటా క్రమం తప్పకుండా ఎన్‌టీఆర్ కళాపరిషత్, విద్యార్థి పరిషత్, కర్షక పరిషత్, భారతీయం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రొఫైల్
 పేరు: డాక్టర్ నూకసాని బాలాజీ
 తండ్రి: కోటయ్య,
 తల్లి : కామేశ్వరమ్మ
 స్వస్థలం : బింగినపల్లి, సింగరాయకొండ మండలం,  ప్రకాశం జిల్లా
 వయస్సు: 53
 విద్యార్హతలు: ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ
రాజకీయ జీవితం: కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా బీసీ సెల్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా 2007 నుంచి 2010 వరకు పనిచేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2011 మే 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఇటీవలే పుల్లలచెరువు జెడ్పీటీసీగా గెలుపొందారు.
Share this article :

0 comments: