వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్

Written By news on Wednesday, July 2, 2014 | 7/02/2014


* గుంటూరులో ముగ్గురిని అపహరించుకుపోయిన టీడీపీ నేతలు
* మండలాధ్యక్ష పదవి కోసమే కిడ్నాపులు
* ఎంపీటీసీ భర్తను సైతం కిడ్నాప్ చేసిన తెలుగు తమ్ముళ్లు!
* ఏపీ అదనపు డీజీపీకి ఎంపీటీసీ మామ ఫిర్యాదు
* స్పీకర్ కోడెలపై వైసీపీ నేత అంబటి నిప్పులు
 
సాక్షి, హైదరాబాద్/రాజుపాలెం/చిలకలూరిపేట: గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీల కిడ్నాప్ పర్వం తీవ్ర కలకలం సృష్టించింది. మండలాధ్యక్ష పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఆయా ఎంపీటీసీలను అపహరించుకు పోయినట్టు స్థానికులు వెల్లడించారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని నెమలిపురి-2 వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ వేముల అంజలీదేవిని ఆమె భర్త, కుమారుడు సహా టీడీపీ నేతలు పోలీసుల సాయంతో అపహరించడం మరింత కలకలం సృష్టించింది. అదేవిధంగా ఇదే జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి-2 ఎంపీటీసీ జమ్మలమడక కృష్ణ, చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడుగుంటుపల్లి శ్రీనివాసరావును కూడా టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఆయా ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసింది. వివరాలు..

* గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని నెమలిపురి-2 ఎంపీటీసీగా వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందిన వేముల అంజలీదేవిని ఆమె కుటుంబం సహా టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్టు జెడ్పీటీసీగా ఎన్నికైన మర్రి వెంకట్రామిరెడ్డి మంగళవారం ఫోన్‌లో తెలిపారు.
 
 రాజుపాలెం మండలంలో 13 ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ 8 స్థానాలు, టీడీపీ 5 స్థానాలు గెలుపొందాయి. ఈ క్రమంలో మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న దురాశతో టీడీపీ నాయకులు కుట్రలు పన్ని అంజలీదేవిని కిడ్నాప్ చేసినట్టు మర్రి తెలిపారు. భర్త రమేష్, కుమారుడితో సహా అంజలీదేవి విశాఖపట్నం సమీపంలోని చోడవరం వద్ద ఉండగా కొందరు టీడీపీ నాయకులు పోలీసుల సహకారంతో బలవంతంగా తీసుకెళ్లినట్టు చెప్పారు.
 
 మరోఘటనలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి-2 వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ జమ్మలమడక కృష్ణను మంగళవారం రాత్రి టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. మాట్లాడాలని పిలిచి బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించారని గ్రామస్తులు తెలిపారు. ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించారు.

 ఇదే జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడుగుంటుపల్లి శ్రీనివాసరావును కూడా టీడీపీ నేతలు మంగళవారం రాత్రి 7గంటలకు కిడ్నాప్ చేశారు. మొత్తం 15 ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ 8 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. చిలకలూరి పేట ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలు కట్టుబడివారిపాలేనికి బైక్‌పై వెళుతున్న శ్రీనివాసరావును అపహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై  వైఎస్సార్ సీపీ నేతలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఏపీ అదనపు డీజీపీకి ఫిర్యాదు..
ఎంపీటీసీ వేముల అంజలీదేవి కిడ్నాప్‌పై ఆమె మామ వేముల ఏడుకొండలు మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎంపీపీ మర్రి సుందరరామిరెడ్డి, రాజుపాలెం ఎంపీటీసీ పులిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) ఆర్పీ ఠాకూర్ కార్యాలయానికి వెళ్లిన ఏడుకొండలు ఈ మేరకు ఫిర్యాదు సమర్పించారు.
 
* చోడవరంలోని సురక్షిత ప్రాంతంలో ఉన్న అంజలీదేవి కుటుంబాన్ని టీడీపీ వర్గీయులు బలవంతంగా తీసుకువెళ్లారని, దీనికి శాసనసభ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజుపాలెం ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు తన కోడలిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని, ఒత్తిడి తట్టుకోలేక ఆమె తన కుటుంబంతో సహా చోడవరంలో తలదాచుకోగా.. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. చోడవరం పోలీసులను ఆశ్రయించినా స్పందించలేదని, తక్షణమే అంజలీదేవి కుటుంబాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎన్నికల కమిషనర్‌కు కూడా వినతిపత్రం అందించారు.
 
స్పీకర్ కోడెల నియోజకవర్గంలోనే కిడ్నాపులా?: అంబటి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికైన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజా ప్రతినిధులను అపహరించారని అంబటి విమర్శించారు. ఎంపీటీసీల అపహరణపై రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాజుపాలెం మండలంలో వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 5 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా మండల పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు ఒక మహిళా ఎంపీటీసీని పోలీసుల సహకారంతో అపహరించుకు పోయారని ధ్వజమెత్తారు.

నెమలిపురి-2 స్థానం నుంచి ఎన్నికైన వేముల అంజలీదేవి అనే ఎంపీటీసీని, ఆమె భర్త, కుమారుడిని గత నెల 21న అర్థరాత్రి పోలీసుల సహకారంతో అపహరించుకు పోయారన్న విషయంలో అంజలీదేవి మామ వేముల ఏడుకొండలుతో కలిసి తాము రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన కోడలు, కుమారుడు అపహరణకు గురయ్యారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోక పోవడంతో డీజీపీ దృష్టికి తెచ్చామన్నారు. ఏడుకొండలు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ ప్రమేయంతో ఇలా జరుగడం దారుణమని అంబటి దుయ్యబట్టారు.

వాస్తవానికి కోడెల నేరచరిత్ర గలవాడని, ఆయనపై అనేక కేసులున్నాయన్నారు. స్పీకర్ అయ్యాక మారతారని భావించామని అయితే పాత వాసనలేవీ పోలేదని అక్కడ జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థమవుతోందని అన్నారు. తన సొంత నియోజకవర్గంలోనే వైఎస్సార్ సీపీకి మెజారిటీ ఉన్న మండలాన్ని వారికి దక్కకుండా కిడ్నాపులను ప్రోత్సహిస్తున్న స్పీకర్ కోడెల ఈ ఐదేళ్లూ ఇక అసెంబ్లీని ఎలా నిర్వహిస్తారనే విషయం ఇట్టే అర్థం అవుతోందన్నారు. కోడెల ఇంట్లో బాంబులు పేలాయని సీబీఐ నిర్ధారించినా అప్పట్లో ఆయన రాజకీయ పలుకుబడితో కేసు నుంచి బయట పడ్డారని విమర్శించారు.
Share this article :

0 comments: