ధర్మం మా పక్షానే ఉంది: వైఎస్సార్ కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధర్మం మా పక్షానే ఉంది: వైఎస్సార్ కాంగ్రెస్

ధర్మం మా పక్షానే ఉంది: వైఎస్సార్ కాంగ్రెస్

Written By news on Monday, July 21, 2014 | 7/21/2014

నెల్లూరు జెడ్పీ వైఎస్సార్ కాంగ్రెస్‌దే
 లాటరీ పద్ధతిలో ఎన్నిక
 టీడీపీ కుయుక్తులు విఫలం
 వైఎస్సార్‌సీపీకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు

 
 సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంది. మూడు వారాలుగా ఏర్పడిన ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. జెడ్‌పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ చేసిన కుయుక్తులు ఫలించలేదు. జెడ్‌పీ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా పొట్టేళ్ల శిరీష ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి (అక్బర్ బాషా), మరొకటి టీడీపీ (చాంద్ బాషా) దక్కించుకున్నాయి. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న 23 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చొన్నారు. టీడీపీ నుంచి గెలిచిన సభ్యులతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీలో చేరిన సభ్యులు - మొత్తం కలిపి 23 మంది 12.30 గంటలకు జెడ్‌పీ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశం హాల్లో టీడీపీ సభ్యులకు, వైఎస్సార్ సీపీ సభ్యులకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన 8మందికి ప్రత్యేక బ్యారికేడ్‌ను నిర్మించారు. టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున, వారిని మరో బ్యారికేడ్‌లో కూర్చోపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ శ్రీకాంత్, ప్రత్యేక పరిశీలకుడు రామాంజనేయులు సమావేశ వేదికపైకి చేరుకున్నారు. సభ్యులందరి చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడానికి సభ్యులను చేతులు ఎత్తాలని కోరారు. ఇరు పక్షాల్లోనూ 23 మంది సభ్యులు చొప్పున ఉన్నారు. దీంతో కలెక్టరు లాటరీ పద్ధతి ద్వారా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోగా, ఒకటి వైఎస్సార్ సీపీకి, మరొకటి టీడీపీకి దక్కాయి. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక తరువాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి చెప్పారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్‌ను వరించిన లాటరీ...
 
 మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ శ్రీకాంత్ వేదిక పైకి వచ్చారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థుల పేర్లు చదవగా, వారిని ప్రతిపాదించిన వారు బలపరిచారు. ఇద్దరికీ ఓటింగ్ పెట్టగా.. 23 మంది చొప్పున చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. ఇద్దరికీ ఓట్లు సమానమయ్యాయి. దీంతో ముందుగా కలెక్టర్  శ్రీకాంత్ చైర్మన్ ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. అందులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు రావడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి లాటరీ తీయగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి పొట్టేళ్ల శిరీష పేరు రావటంతో ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులు హర్షధ్వానాలు చేశారు.
 
 ఎట్టకేలకు ఉత్కంఠకు తెర...
 
 జిల్లాలో 46 జెడ్‌పీటీసీ స్థానాలు ఉండగా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 31, టీడీపీ 15 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వైఎస్సార్ సీపీ సభ్యులు కొందరిని ప్రలోభ పెట్టిన టీడీపీ నాయకులు ఐదుగురు సభ్యులను తమ శిబిరంలో చేర్చుకున్నారు. అయినా మెజారిటీ రాకపోవటంతో జెడ్‌పీ చైర్మన్ ఓటమి ఖాయమని నిర్ధారించుకుని, ఎన్నికలు జరగకుండా గొడవలకు దిగిన విషయం విదితమే. దీంతో కలెక్టరు ఈ ఎన్నికను 13వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుని, ఎన్నికలను సజావుగా జరపాలని నిర్దేశించింది. 13వ తేదీన తాము వచ్చినట్లు టీడీపీ సభ్యులు సంతకాలు చేయకపోవడంతో కోరం లేక జెడ్‌పీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఎన్నికల కమిషన్, హైకోర్టులు జోక్యం చేసుకుని, ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, భారీ బందోబస్తుతో ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్దేశించాయి. దీంతో ఆదివారం జెడ్‌పీ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.
 
 ధర్మం మా పక్షానే ఉంది: వైఎస్సార్ కాంగ్రెస్
 
 నెల్లూరు జెడ్‌పీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ద్వారా న్యాయం గెలిచిందని నిరూపణ అయిందని పార్టీ ఎన్నికల పరిశీలకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అభివర్ణించారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పార్టీ జెడ్‌పీటీసీ సభ్యులు లొంగకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో జెడ్‌పీ చెర్మైన్‌ను గెలుచుకున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వైఎస్సార్ సీపీ గెలిచిందని.. ప్రజా తీర్పును దేవుడు కూడా బలపరిచారని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు అభివర్ణించారు. టీడీపీ జిమ్మిక్కులు చేసినా భగవంతుడు తమ వైపు ఉన్నాడని నిరూపితమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 ఎంత చేసినా ఇంతేనా?
 
 జెడ్పీ ఎన్నికపై ఏపీ ిసీఎం బాబు అసహనం
 
 సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి షాకిచ్చింది. ఎన్ని మాయోపాయాలు, ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, తప్పుడు కేసులతో ప్రత్యర్థులను తమవైపు లాక్కొన్నా చైర్మన్ స్థానం తమకు దక్కక పోవడం సీఎం చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు తెలిసింది. వాయిదా అనంతరం ఎన్నిక నిర్వహిస్తే మూడు రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాలని ఎన్నికల సంఘం తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని టీడీపీ నాయకులు శనివారం రాత్రి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందించకపోవడంతో టీడీపీ నాయకులు ఉసూరుమన్నారు. దీంతో ఆదివారం అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో చివరకు విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వరించింది. జెడ్పీ పీఠం దక్కకపోవడంపై మంత్రి, జిల్లా నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
Share this article :

0 comments: